దళితులు కొబ్బరికాయ కొడితే నేరమా? శమ్నాపూర్ ఘటనపై గళమెత్తిన ప్రజాసంఘాలు

శమ్ననాపూర్ గ్రామంలో దళితులపై జరిగిన అవమానంపై ప్రజాసంఘాలు మండిపడ్డాయి. వినాయకుడి వద్ద అంజలి అనే ఇంటర్ విద్యార్థిని తన తల్లితో కలిసి మొక్కు తీర్చుకోవడానికి వెళ్లడం.. అక్కడ కొందరు మీ కులం వారు ఇక్కడికి రావద్దంటూ అడ్డుకోవడం.. తదుపరి దాడులకు పాల్పడిన ఘటనపై దళిత బహుజన ఫ్రంట్, మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ చేపట్టారు. డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ అహ్మద్, దుబాషి సంజీవ్, హనుమకొండ దయాసాగర్ ఆధ్వర్యంలో గ్రామం దళిత కుటుంబాలను కలిశారు. బాధిత మహిళ భాగ్యమ్మతో మాట్లాడి సంఘటనపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శమ్నాపూర్ గ్రామంలో అంజలి కొబ్బరికాయ కొట్టడానికి వెళ్లడం.. కులం పేరిట ఆమెను దూషిస్తూ వినాయక మండపం వద్ద నిలువరించడం పెట్రేగిపోతున్న కులోన్మాదానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. తిరిగి వారి పైనే కౌంటర్ కేసులు పెట్టేలా పోలీసులు వ్యవహరిస్తున్న తీరును ఖండించారు. గ్రామంలో జరుగుతున్న అగ్రకులాల అధిపత్యం వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇలాంటి ఘటనపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు రోజుకోచోట జరుగుతున్నాయని, అయినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అన్నారు. నిందితులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

మెదక్,
15.09.2024

Related Posts

Scroll to Top