ఎదురుగా సముద్రమ్మునా వేట చేసుకోలేని దుస్థితి లో వున్న మత్యాకారులు

పెద్ద గణగల్లవాని పేట గ్రామము శ్రీకాకుళం రూరల్ మండలం శ్రీకాకుళం టౌనుకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పంచాయతీ లో ఉన్న మత్యకారులందరి జీవనాధారం సముద్రంపై చేపల వేట చేసుకొని జీవిస్తూ ఉంటారు, అయితే సుమారు నాలుగు సంవత్సరముల నుంచి వీరి జీవనాధారమైన సముద్రంపై వేట చేయలేని పరిస్థితి వీరికి దాపరించినది కారణం ఏమంటే రెండు కిలోమీటర్లు దూరములో వున్న నాగావళి నది వీరి గ్రామానికి దగ్గరలో ఉన్న మోపస్ బందర్ గ్రామం దగ్గర సముద్రంలో కలిసే ప్రాంతం. అయితే కొన్ని సంవత్సరాల నుంచి ఈ నదీ తీరం వెంబడి ఆక్వా చెరువులు అక్రమంగా నిర్మించడం వలన ఆ చెరువులు చుట్టూ కాంక్రీట్ గోడలు నిర్మించడం వలన నది సహజ సిద్ధముగా సముద్రంలో కలిసే మార్గాన్ని దారి మళ్లించి పల్లము వైపు నది తన దిశన మార్చుకున్నది అందువలన ఒకప్పుడు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నది ఈ గ్రామానికి 50 మీటర్ల దూరంలోకి వచ్చేసింది.ఈ గ్రామం వాసులు అందరూ మత్స్యకారులు వీరు రోజువారి సముద్రంపై వేట చేయలేకపోతే పూట గడవదు, ప్రస్తుతం నది సముద్రానికి వీరి గ్రామానికి మధ్య నుంచి ప్రవహిస్తుంది, వీరు ప్రతిరోజు నదిని దాటి సముద్రంలోకి వేటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. లక్షల విలువచేసే బోట్లు తయారు చేసుకుని ఈ వేళ ఈ మత్స్యకారులు సముద్రం పై వేట చేయలేని దుస్థితి ఏర్పడినది.

ప్రభుత్వానికి అనేక పర్యాయములు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ స్థానిక రాజకీయ నాయకులకి దృష్టికి తెలియజేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు చివరకు గ్రామంలో ఉన్న యువకులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేసి అక్రమంగా ఉన్న చెరువులను తొలగించమని ఆర్డర్ ను తెచ్చుకున్నప్పటికీ ఆ ఆర్డర్ ను అమలు చేయుటకు ప్రభుత్వం యంత్రాంగం సహకరించట్లేదు అని తెలిసినది.

ప్రభుత్వ యంత్రాంగము రాజకీయ నాయకులు ఈ ఆక్వా కల్చర్ మాఫియాకు లోనై ఈరోజు మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నారు ఈ విషయము సాక్షి పేపర్లో తేదీ 13-3-2025 ప్రచురించడం చేత మానవ హక్కుల వేదిక జిల్లా బాధ్యులు ఫల్గుణ రాజు అలాగే రాష్ట్ర బాధ్యులు కేవీ జగన్నాథం గారు ఈరోజు అనగా తేదీ 15-3-2025 ఉదయం మీడియా ను తీసుకొని ఆ గ్రామాన్ని సందర్శించి బోటుపై ఆ గ్రామస్తులు తో నదిలోకి వెళ్లి మొత్తం నది ఏ విధముగా దిశ మార్చుకున్నది పరిశీలించడం జరిగింది .

ఈ సందర్భంగా ముఖ్యంగా మానవ హక్కుల వేదిక పరిశీలనలో తేలినది ఏమంటే తీర ప్రాంతంలో గతంలో జరిగిన సాండ్ మైనింగ్ వలన ఈ ప్రాంతాల పలమభూములుగా మారాయి మరియు నదీ గర్భంలో అక్రమంగా నిర్మించిన ఆక్వా కల్చర్ రొయ్యల చెరువుల వలన తీర ప్రాంత ఎకో సిస్టం దెబ్బతింటుంది. ఈ జిల్లాలో ఉన్న ప్రధానమైన నదులు నాగవల్లి వంశిధార మహేంద్ర తనయ నదులలో నది ముఖద్వారంలో ఇదే విధానం కొనసాగుట వలన ఆయా గ్రామాలు కోతకు మరియు ముంపుకు గురవుతున్నాయి. పరివాహక ప్రాంతాల్లో నదీ గర్భంలో అక్రమము గా రొయ్యలు చెరువులు నిర్మించి వాటి చుట్టూ రాతి కట్టడాలు చేయడం వలన నదులు తన సహజ సిద్ధమైన దిశను కాక వేరే దిశలో ప్రవాహాలు జరుగుతున్నాయి. దీనివలన ఎంతో సుందరమైన బీచులు గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు దీనిపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ వారు కూడా ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించు కోవటలేదు. దీనిపై మానవ హక్కుల వేదిక స్పందించి ఈ జిల్లాలో ఉన్న ఇతర నదీ ప్రవాహాలపై కూడా దృష్టి సారించి దీనిపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటిస్తున్నాము అలాగే రాష్ట్ర బాధ్యులు కూడా దీనిపై స్పందించి సరైన గైడెన్స్ ఇవ్వాలని కోరుచున్నాము.

మానవ హక్కుల వేదిక,
శ్రీకాకుళం జిల్లా బాద్యులు,
15.03.2025

Related Posts

Scroll to Top