ఈనెల 21వ తేదీ బుధవారం ఉదయం ఛత్తీస్గడ్ అబూజ్ మడ్ ప్రాంతంలో జరిగిన ‘ఎన్కౌంటర్ ‘ లో 27 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన సజ్జ వెంకట నాగేశ్వరరావు (రాజన్న), వన్నాడ విజయలక్ష్మి (భూమిక), గోనెగండ్ల లలిత (సంగీత), బుర్ర రాకేష్ (వివేక్ )లు ఉన్నారు.
తెలుగు రాష్ట్రాలకు చెందిన పై వ్యక్తుల మృతదేహాల కోసం గురువారం నాడు చత్తీస్ ఘడ్ వెళ్ళిన వారి కుటుంబ సభ్యులు నారాయణపూర్ జిల్లా పోలీసు స్టేషన్, ఆసుపత్రిల ముందు ఐదు రోజులుగా పడిగాపులు గాస్తున్నారు. అవసరమైన అన్ని పత్రాలను అధికారులకు సమర్పించినప్పటికీ ఈరోజు వరకు మృతదేహాలను పోలీసులు అప్పగించలేదు. పొద్దున ఇస్తాం, సాయంత్రం ఇస్తా అంటూ రోజులు గడుపుతున్నారే తప్ప మృతదేహాలను మాత్రం అప్పగించటం లేదు. ఇప్పటికి ఆరు రోజులు దాటుతున్నది. మృతదేహాలను కోల్డ్ స్టోరేజ్ లో కాకుండా మార్చురీలో ఓపెన్ గా పడవేసి ఉంచారని తెలుస్తున్నది.
మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించునే హక్కు వారి బంధువులకు ఉంటుందని, అలాగే మృతదేహాలకు కూడా గౌరవప్రదంగా చూడబడే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పి ఉన్నది. కానీ అక్కడి ప్రభుత్వం, పోలీసులు ఇవేవీ పాటించటం లేదు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను సైతం కాలరాస్తూ, దురుద్దేశపూర్వకంగా మృతదేహాలను అప్పగించడంలో తీవ్ర ఆలస్యం చేయటం అన్యాయమే కాక మానవత్వం లేని విధానం అవుతుంది. ఇది ఎవరూ అంగీకరించలేని పాశవికత్వం.
కాబట్టి, మృతదేహాలను వారి వారి కుటుంబ సభ్యులకు వెంటనే అప్పగించాలని, చనిపోయిన వారికి గౌరవప్రదంగా అంత్యక్రియలను జరుపుకునే వారి బంధువుల హక్కును గుర్తించాలని మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ కేంద్ర ప్రభుత్వాన్నీ, చత్తీస్గడ్ రాష్ట్ర ప్రభుత్వాన్నీ డిమాండ్ చేస్తున్నది.
ఆత్రం భుజంగరావు (రాష్ట్ర అధ్యక్షుడు)
డా ఎస్. తిరుపతయ్య ( రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
26.05.2025