ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా యాజమాన్యం పై క్రిమినల్ కేసులు పెట్టాలి.
సెజ్, ఫార్మా కంపెనీల్లో సమగ్రమయిన సేఫ్టీ ఆడిట్ జరపాలి.
ప్రభుత్వాల, అధికారుల, యాజమాన్యాల అలసత్వమే ఈ ప్రమాదాలకు ముఖ్యకారణం
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్(SEZ) లోని ‘ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్’ లో 21 ఆగస్టు 2024న భారీ ప్రమాదం జరిగి పలువురు మృతి చెందిన విషయం, ఈ ప్రమాదంలో భవనంలోని ఒక అంతస్తు కుప్ప కూలిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో 17 మంది మృతి చెందారని అధికారిక ప్రకటన వెలువడింది. గాయపడిన వారిసంఖ్య 36 అని వార్తలు. అయితే వారి సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి కారణం రియాక్టర్ పేలుడు అని వార్తలు సూచిస్తుండగా, ఫ్లోర్ లో జరిగిన సాల్వెంట్ లీకేజీ వల్ల జరిగిందని ప్రభుత్వ ప్రతినిధులు కొందరు చెబుతున్నారు. కంపెనీ యాజమాన్యం ప్రమాద విషయాన్ని పట్టించుకోలేదని, తాను స్వయంగా ఫోన్ చేసినా, మెసేజ్ పెట్టినా ఎటువంటి స్పందనా లేదని సాక్ష్యాత్తూ హోం మినిస్టరే చెబుతున్నారు. ఈ ప్రమాదానికి అసలు కారణం ఏమిటనేది ఇంకా అధికారులకు తెలియరాలేదట. బహుశా ప్రజలు, పత్రికలవాళ్ళూ మరచిపోయినంత వరకూ ఈ విషయం వారి పరిశీలనలోనే ఉంటుందేమో.
ఎసెన్షియా కంపెనీ ఇంటర్మీడియట్ కెమికల్స్ మరియు యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాలను తయారు చేస్తుంది. ఇది ₹200 కోట్ల పెట్టుబడితో ఏప్రిల్ 2019లో కార్యకలాపాలను ప్రారంభించింది. అచ్యుతాపురం క్లస్టర్ వద్ద ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ బహుళ-ఉత్పత్తి సెజ్ పరిధిలో 40 ఎకరాల క్యాంపస్లో ఉంది.
మృతుల కుటుంబాలకు రూ. కోటి నష్టపరిహారం ప్రకటించారు. అయితే ఈ నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటించింది, యాజమాన్యం నుండి ఎటువంటి ప్రకటనా ఇంతవరకూ రాలేదు.
ప్రమాదానికి బాధ్యులైన యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు చేపట్టలేదు. బాధ్యుల పేర్లను సహితం ఇంతవరకూ బహిర్గతం చెయ్యలేదు.
చాలా కాలంగా సేఫ్టీ ఆడిట్ జరగకపోవడమే ప్రమాదానికి కారణం అని ఉప ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఈ ఒక్క పరిశ్రమలోనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి నెలకొన్నదని ఆయన గమనించాలి. భద్రతా పర్యవేక్షణ మొత్తం గాలికి వదిలేసారు.
మొత్తంగా ఈ సెజ్ లో 208 కంపెనీలున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఉన్నప్పటికీ కేవలం ఒకే ఒక్క అగ్నిమాపక వాహనం ఉండటం శోచనీయం. అది కూడా నీరు మినహా కెమికల్ రియాక్టర్లు పేలినప్పుడు అవసరమైన ప్రత్యేక రసాయనాలు ఏవీ అగ్ని మాపక సేవల శాఖ వద్ద అందుబాటులో లేవు. చుట్టుపక్కల ఫైర్ స్టేషన్ల నుంచి అగ్నిమాపక వాహనాలను తెప్పించి మంటలను ఆర్పారు.
ఈ సెజ్ లోనే కాదు, ఫార్మాసిటీలో కూడా గతంలో అనేకసార్లు ప్రమాదాలు జరిగి ఎంతోమంది చనిపోయారు. అయితే ఏ పరిశ్రమ మీదా ప్రభుత్వం ఇంతవరకూ చర్య తీసుకున్న దాఖలాలు లేవు. యాజమాన్యాల, ప్రభుత్వాల, అధికారుల అలసత్వమే ఈ ప్రమాదాలకు ముఖ్యకారణం. కర్మాగారాలలో భద్రత పర్యవేక్షణ కొరవడింది. చాలా ప్రాధమిక భద్రతా ఉపకరణాలు కూడా లేని పరిశ్రమలు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాలలో భద్రతా విద్య లేదు. భద్రతా నిపుణుల కొరత ఉంది. విశ్వ విద్యాలయ స్థాయిలో భద్రతా విద్య విభాగాలను ప్రారంభించడం అత్యవసరం. సేఫ్టీ ఆడిట్ చేయడానికి నిజమైన నిపుణులు కావాలి. లేకుంటే లోపాలు బయట పడవు. ఫీజు కోసం ఆడిట్ చేసేవాళ్ళు లోపాలను పూర్తిగా గుర్తించకుండా కంపెనీలకు అనుకూలంగా రాస్తారు. అది ఇంకా ప్రమాదకరం.
డిమాండ్లు:
- సెజ్, ఫార్మా కంపెనీల్లో ఒక సమగ్రమయిన సేఫ్టీ ఆడిట్ ను ప్రభుత్వం సత్వరమే చేపట్టాలి. థర్డ్ పార్టీ ద్వారా సేఫ్టీ ఆడిట్లను చేపట్టే విధానానికి స్వస్తి పలకాలి
- ప్రమాదాలకు బాధ్యులయిన పరిశ్రమల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టాలి
- సేఫ్టీ ఆడిట్ల నివేదికలను కర్మాగారాల శాఖ వెబ్ సైట్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలి
- బయటపడ్డ లోపాలను సరిదిద్దే ప్రక్రియ అమలు పరచడం ప్రధానం. అమలుపై సరైన పర్యవేక్షణ వుండాలి
- ప్రభుత్వమే కాక కంపెనీ యాజమాన్యం కూడా మృతుల కుటుంబాలకూ, క్షతగాత్రులకు నష్ట పరిహారం చెల్లించాలి
- SEZ చట్టాన్ని రద్దు చెయ్యాలి
ఎం. శరత్ – మానవ హక్కుల వేదిక (HRF) రాష్ట్ర ఉపాధ్యక్షులు
కె. అనూరాధ – HRF విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి
23.08.2024,
విశాఖపట్నం.