డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీీమ జిల్లా, అల్లవరం మండలం గోడి గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలిక కేతా లాస్య మాధురి విద్యుత్ ప్రమాదానికి గురై చేతిని కోల్పోయిన విషయం తెలిసినదే. ప్రమాద సమయంలో కుమార్తె ను రక్షించబోయిన తల్లి రమాదేవి కూడా గాయపడింది. తల్లి కూతుళ్లు కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయమై మానవ హక్కుల వేదిక నిజ నిర్ధారణ చేపట్టింది వేదిక సభ్యులు బాలిక కుటుంబీకులను గ్రామస్తులను కలిసి వివరాలు సేకరించారు. తమ ఇంటి పిట్టగోడకు కేవలం ఒక అడుగు లోపు లోనే ఉన్న హై వోల్టేజ్ విద్యుత్ తీగలను తొలగించమని విద్యుత్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు అన్నారు. బాలిక తండ్రి దివ్యాంగుడవటంతో ఆమె తల్లే కుటుంబ పోషణ భారం వహిస్తున్నారు ఇప్పుడు ప్రమాదానికి గురై ఆమె కూడా ఆసుపత్రి పాలు కావడం, ప్రమాదం వలన పాప చేయి తొలగించాల్సి రావడం ఆ కుటుంబ పరిస్థితిని మరింత దిగజార్చాయి. అల్లవరం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయినప్పటికీ ఇంతవరకు బాధ్యులపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. అలానే బాధితుల చికిత్స కొరకు ఎలాంటి ఆర్థిక సహాయమూ అందించలేదు.
ఈ ఘటనకు బాధ్యులైన విద్యుత్ శాఖ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది.
ఈ నిజ నిర్ధారణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై రాజేష్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం ఇక్బాల్, నామాడి శ్రీధర్ పాల్గొన్నారు.
వై రాజేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
మానవ హక్కుల వేదిక
అమలాపురం
20-01-2025