జూన్ 8, సాయంత్రం మైలారపు అడెల్లు (భాస్కర్) స్వగ్రామం అదిలాబాద్ జిల్లా బోధ్ మండలం, పొచ్చర గ్రామానికి మానవ హక్కుల వేదిక రాష్ట్ర కమిటీగా మేం వెళ్ళి వారి బంధువులను, గ్రామస్తులను కలిసి పరామర్శించాము. భాస్కర్ కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నాం. అప్పటికి ఇంకా భాస్కర్ మృతదేహం ఇంటికి చేరలేదు.
33 ఏళ్ల క్రితం నక్సలైట్ పార్టీలో చేరి పని చేస్తున్న భాస్కర్ ను గత శుక్రవారం బీజాపూర్ జిల్లాలో కేంద్ర బలగాలు ఎన్కౌంటర్ పేరుతో హత్య చేశాయి. భాస్కర్ మృతదేహం నిన్న రాత్రి 10:30 గంటల ప్రాంతంలో స్వగ్రామం చేరింది.
ఎన్కౌంటర్ల పేరు మీద కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదంతా క్రూరమైన హత్యాకాండ మాత్రమే. ఒక్క మావోయిస్టుల విషయంలోనే కాదు, మొత్తం దేశం విషయంలో కేంద్ర పరిపాలకులు రాజ్యాంగాన్నీ, ప్రజాస్వామ్యాన్నీ ఎప్పుడో పక్కన పడేశారు. వారు పాల్పడుతున్న ఈ హత్యాకాండ మాత్రమే కాదు, వారి పరిపాలన అంతా కూడా ఫాసిస్టు పరిపాలనలో భాగమే.
కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత శాశ్వత శాంతి ఏర్పాటుకు కూడా కట్టుబడి ఉంటామని మావోయిస్టులు చెప్తున్నప్పటికీ వారిని చివరి మనిషి వరకూ హత్య చేయాలనుకునే ఈనాటి పాలకుల వైఖరి ఆదిమ తెగల యుద్ధ నీతి కంటే హీనమైనది. ఇప్పటికైనా ఈ రక్తపాతాన్ని, ఏకపక్షయుద్ధాన్ని ఆపేసి, మావోయిస్టులతో చర్చలు జరిపి, శాంతియుత పరిష్కారాన్ని కనుగొనాలని మేం కేంద్రాన్ని డిమాండు చేస్తున్నాం. పాలకుల ఇటువంటి విధానాలను, పరిపాలకుల్లో తలెత్తే నియంత్రితో పోకడలను ఎప్పటికప్పుడు గ్రహించి, వ్యతిరేకిస్తూ సమాజంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పౌర సమాజానికి మేం విజ్ఞప్తి చేస్తున్నాం.
మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ,
09.06.2025.