మూక దాడులు, మతం పేరిట జరిగే నేరాల నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలి

తుక్కుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యయుడు రాములు గారి మీద అయ్యప్ప మాల వేసుకున్న స్వాముల రూపంలో హిందుత్వ మూకలు 23 డిసెంబర్ 2024 రోజున దాడి చేసిన విషయం తెల్సిందే. ఈ విషయం మీద మానవ హక్కుల వేదిక సభ్యులు ఈ రోజు అనగా 5 జనవరి 2025 రోజున భాధిత ప్రధాన ఉపాధ్యాయులు రాములు గారిని కలిసి వివరాలు సేకరించడం జరిగింది.

అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థిని కాలితో తన్నకపోయినా, తన్నాడని హిందుత్వ వాదులు తమ whatsapp గ్రూప్స్ లో ప్రచారం చేసి, హిందూ మతం మీద దాన్ని ఒక దాడిగా అభివర్ణించారు. అయ్యప్ప మాల ధరించిన వ్యక్తులు పాఠశాలకి వెళ్లి , జై శ్రీరామ్ నినాదాలు ఇస్తూ ప్రధానోపాధ్యాయుడు రాములు గారి బట్టలు చిరిగేలా కొట్టారు. మాల వేసుకున్న విద్యార్థి కాళ్ళు మొక్కించడమే కాక, దాడికి వచ్చిన అయ్యప్పలందరి కాళ్లు మొక్కాలని ఒత్తిడి చేశారు. అతి చిన్న మామూలు విషయానికి మతం రంగు పులిమి, భౌతిక దాడి చేసి, పాఠశాలలో ఒక సీనియర్ ఉపాధ్యాయుడిని అవమనించడాన్ని, ఆ వీడియోస్ తీసి సోషల్ మీడియా లో ప్రచారం చేయటాన్ని మానవ హక్కుల వేదిక తీవ్రంగా ఖండిస్తున్నది. సంఘటన జరిగి ఇన్ని రోజులు అయినా ఇంకా నిందితులను పోలీసులు అరెస్టు చేయకపోవడం వల్ల ఒక ప్రధాన ఉపాధ్యాయుడిని మతం ముసుగులో కొట్టచ్చు అన్న సందేశం సమాజం లోకి వెళ్తుంది అని అభిప్రాయపడుతోంది. ఈ విషయం మీద వెంటనే పోలీసులు స్పందించాలని డిమాండ్ చేస్తూ, రెచ్చగొట్టే సోషల్ మీడియా మెస్సేజీలను నిజానిజాలు తెలుసుకోకుండా ప్రభావం అవ్వడం మానుకోవాలి అని ప్రజలకు పిలుపునిస్తోంది.

ఈ నిజ నిర్దారణ లో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య గారు, ఉపాధ్యక్షులు బాలరాజు గారు, వరంగల్ యూనిట్ ప్రధాన కార్యదర్శి దిలీప్, హనుమాన్ ప్రసాద్, రంగారెడ్డి జిల్లా నుంచి నరసింహ, జంగయ్య, హైదరాబాద్ యూనిట్ ప్రెసిడెంట్ సురేష్ బాబు , వెంకట్నారాయణ, రోహిత్, సంజీవ్ పాల్గొన్నారు

05.01.2025,
రంగారెడ్డి.

Related Posts

Scroll to Top