కులధృవీకరణ పత్రాలు మంజూరులో అధికారుల అలసత్వం
వెంకటాయపాలెం శిరోముండనం బాధితులు కోటి చినరాజు, దడాల వెంకటరత్నం పిల్లలకు కులధృవీకరణ పత్రాలను వెంటనే మంజూరు చేయాలని మానవ హక్కుల వేదిక ప్రతినిధులు సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ లో విశాఖపట్నం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో శిరోముండనం నేరం రుజువై నిందితులకు 18 నెలలు జైలు శిక్ష పడిన విషయం విదితమేనని వారు అన్నారు. ఈ కేసులో బాధితులను ఎస్సీలుగా కోర్టు గుర్తించి తీర్పు ఇచ్చినప్పటికీ వారి పిల్లలకు ఎస్సీ కులధృవీకరణ పత్రాలు మంజూరు చేయకుండా రెవిన్యూ అధికారులు వేధిస్తున్నారని చెప్పారు. ఈ కారణంగా బాధితుల పిల్లలు విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోయి తీవ్రంగా నష్టపోతున్నారని వారు తెలిపారు. బాధితులు కులధృవీకరణ పత్రాల కోసం పలుమార్లు జిల్లా కలెక్టర్ కు, రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు సమర్పించారని; 2019లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బాధితులను ఎస్సీలుగా గుర్తించి కులధృవీకరణ పత్రాలు మంజూరు చేయవలసిందిగా ఉత్తర్వులు ఇచ్చిందని వారు చెప్పారు. అయినప్పటికీ బాధిత కుటుంబాల వారికి కులధృవీకరణ పత్రాలు మంజూరు చేయకపోవడానికి కారణం ముద్దాయిల సామాజిక, రాజకీయ ప్రాబల్యానికి అధికారులు లోనుకావడమేనని వారు పేర్కొన్నారు.
ఈ మేరకు మానవ హక్కుల వేదిక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు మహమ్మద్ ఇక్బాల్, నామాడి శ్రీధర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
22 డిసెంబర్ 2024,
అమలాపురం.