ONGC లో విష వాయువు లీక్ – ప్రజల జీవితాలతో చెలగాటం !

చమురు సహజవాయు సంస్థలు సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా ప్రజల జీవితాలతో చెలగాటమాడటం చట్టరీత్యా నేరమని మానవ హక్కుల వేదిక అభిప్రాయపడుతుంది. గురువారం మానవ హక్కుల వేదిక సభ్యులు కేసనపల్లి జి జి ఎస్ వద్ద కు వెళ్లి షిఫ్ట్ ఇంచార్జ్ నాయక్ తో మాట్లాడి విషయ సేకరణ చేయడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ లో తరచూ జరుగుతున్న పారిశ్రామిక ప్రమాదాల కొనసాగింపుగా మరోసారి ONGC లో హైడ్రోజన్ సల్ఫైడ్ తో కూడిన సహజవాయువు వెలువడి కార్మికులనూ, గ్రామస్తులనూ అస్వస్థతకు గురి చేసింది. ఇది ఒక రోజు వార్తగా మిగిలి పోతుంది. అంతే. నివారణ చర్యలుండవు. చమురు సహజవాయువు పరిశ్రమ నియంత్రణ లేని పరిశ్రమ. రాష్ట్ర నియంత్రణ అధికారులకు ONGC భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకునే సామర్ధ్యం లేదు.

కోనసీమ ప్రాంతంలో ఉత్పత్తయ్యే సహజ వాయువు “పుల్లని వాయువు” (Sour gas). దానిలో 10 – 50 పిపిఎం హైడ్రోజన్ సల్ఫైడ్ వుంటుంది. దానిని 1 పిపిఎం స్థాయిలో పీలిస్తీనే భద్రం. గాలిలో హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువుని సులువుగా వాసన ద్వారా గుర్తించగలం. సగటున అందరూ గాలిలో 0.03 – 0.05 పిపిఎం స్థాయిలో వాసన పసి గట్ట గలరు. కొందరికి 0.0008 పిపిఎం ల స్థాయిలో కూడా వాసన తెలుస్తుంది. గరిష్టంగా 100 పిపిఎం ల వరకూ వాసన గుర్తించ గలరు. ఆ పై వాసన తెలియదు. అందువల్ల ప్రమాదాలు జరుగుతాయి. పనిలో గరిష్టంగా 15 నిముషాల పాటు 5 పిపిఎం ల హైడ్రోజన్ సల్ఫైడ్ (ACGIH) వున్న గాలి పీల్చవచ్చు. ఆ పై ప్రమాదం.

హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు విడుదలయ్యే అవకాశం వున్న పని ప్రదేశాలలో ఆ వాయువుని గుర్తించే డిటెక్టర్లు పెట్టాలి. అది 5 పిపిఎం లకు చేరగానే హెచ్చరిక చేసేలా ఏర్పాటు వుండాలి. నియంత్రణ అధికారులు నిరంతరంగా గాలిలో హైడ్రోజన్ సల్ఫైడ్ స్థాయిని గుర్తించి , హెచ్చరిక జారీ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయించి వుంటే లీకైనా ప్రమాదం జరిగేది కాదు. హెచ్చరికతో కార్మికులు తప్పుకునే వారు. ఇక్కడ కేవలం కార్మికులే కాదు పరిసర గ్రామ ప్రజలూ బాధితులే. వారికీ ఎలాటి హెచ్చరికా చేయ లేదు. గ్రామాలలో పసివారూ, వృద్ధులూ, రోగగ్రస్తులూ వుంటారు. వారికి కార్మికులకు వర్తించే భద్రతా ప్రమాణాలు వర్తించవు. వివిధ దేశాలలో నివాస ప్రాంతాలలో గాలిలో హైడ్రోజన్ సల్ఫైడ్ స్థాయి 0.005 పిపిఎం మించకూడదు. కంపెనీ గోడ దగ్గర హైడ్రోజన్ సల్ఫైడ్ 0.1 పిపిఎం వున్నా గ్రామస్తులకు హెచ్చరిక చేయాలి. ఆసమయాలలో తీసుకోవలసిన జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పించాలి.
బాధ్యత గల అధికారులూ, ప్రభుత్వాలూ తీసుకోవలసిన కనీస చర్యలివి.

ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక జిల్లా కార్యవర్గ సభ్యులు జనిపల్లి నాని, ముత్యాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.

కోనసీమ,
13.03.2025

Related Posts

Scroll to Top