పౌరహక్కుల సంఘం నిజ నిర్ధారణను అడ్డుకోవటం ప్రభుత్వానికి సిగ్గుచేటు

ఈ సెప్టెంబరు ఐదవ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రఘునాథ పాలెం గ్రామ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి చెందిన ఆరుగురు సాయుధ దళసభ్యులు చనిపోయారని పోలిసులు ప్రకటించారు. పరస్పరం ఎదురుకాల్పులు జరిగి ఒక పక్షానికి చెందిన సాయుధులు పెద్ద ఎత్తున అక్కడికక్కడే చనిపోతే, ఎదురుకాల్పుల్లో మరోవైపు ఉన్న పోలీసులకు, నూటికి తొంబై తొమ్మిది సందర్భాల్లో, చిన్న గీత కూడా పడదు. ఇటువంటివి ఎలా జరుగుతాయో తెలుగు నేలలో ఉన్న పౌరులందరికీ తెలిసిన విషయమే. సహజంగానే ప్రతి ఎన్కౌంటర్ లాగే ఈ ఎన్ కౌంటర్ పైన కూడా అనుమానం వస్తుంది కాబట్టి, పౌర హక్కుల సంఘం బాధ్యులు ఈ నెల 14వ తారీకున నిజ నిర్ధారణకు బయలుదేరారు.

పోలీసులు పౌరహక్కుల సంఘ సభ్యుల ఫోన్లను టాప్ చేసి, బస్సులో వెళ్తున్న వారిని మణుగూరు పట్టణంలో ఆపి, బల ప్రయోగం చేస్తూ అందరినీ ఒక మారు మూల పోలీసు స్టేషన్ లో నిర్బంధించి, నిజ నిర్ధారణకు వెళ్లకుండా అడ్డుకుని, తిప్పి పంపించారు. 2020 అక్టోబర్ నాలుగవ తారీఖున ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అప్పటి వరకు జరిగిన మూడు ఎన్కౌంటర్ల పై నిజనిర్ధారణకు వెళ్తున్న ఐదుగురు సభ్యుల మానవ హక్కుల వేదిక బృందాన్ని కూడా పోలీసులు ఇలాగే ఫోన్ టాపింగ్ చేసి, ఇల్లందలో దారి కాచి ఆపి, మారుమూల బోడు పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. మమ్మల్ని నిజ నిర్ధారణకు వెళ్లకుండా ఆపి పైగా, పోలిసుల విధి నిర్వహణకు అడ్డు వచ్చినట్టు కేసు నమోదు చేశారు.

ఆ కాలం కేసీఆర్ నిరంకుశ కాలం అనుకుని, ఆ పార్టీ మారితే పరిస్థితి మారుతుందనుకున్నాం. కానీ పరిస్తితి మారకపోగా ఇంకా దౌర్జన్య పూరితంగా తయారవుతున్నది. ఒకప్పుడు మిలటరీ పరిపాలన ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే ఎన్కౌంటర్లపై నిజనిర్ధారణ చేయడం, మరీ ముఖ్యంగా బయటి రాష్ట్రాల వారు వచ్చి తిరగటాన్ని అక్కడి మిలిటరీ సహించేది కాదు. ఇప్పుడు స్వంత ‘ప్రజాస్వామ్య రాష్ట్రం’ లో, ఎప్పుడూ తిరిగే హక్కుల సంఘాలను కూడా అడ్డుకునే స్థాయికి తెలంగాణ ప్రజాస్వామ్య ప్రభుత్వం, పోలీసులూ రూపాంతరం చెందారు.

ఎన్నికల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యం, ప్రజల స్వేచ్ఛ గురించి ఎన్ని వాగ్దానాలు చేసినప్పటికీ వాస్తవంగా ఆయనకూ, ఆయన పార్టీకీ పాలకులను విమర్శించే పౌరుల ప్రశ్నలను ఎదుర్కొనే సత్తా లేదు. అందుకోసమే ఇలా పౌర ప్రజా సంఘాలనూ, మేధావులనూ భౌతికంగా అడ్డుకుంటున్నారు.

ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి హోం మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ పట్ల నిజాయితీ కలిగి ఉంటే పౌర హక్కుల సంఘం బాధ్యులను అడ్డుకున్న పోలీసులపై కేసు నమోదు చేసి, విచారణ జరిపించాలి.

తెలంగాణ రాష్ట్రంలో “ఎన్కౌంటర్లు” చేయటానికి పోలీసులను వాడుకోకూడదు.

– డాక్టర్ ఎస్ తిరుపతయ్య,
ప్రధాన కార్యదర్శి, మానవ హక్కుల వేదిక, తెలంగాణ
17.09.2024.

Related Posts

Scroll to Top