రాజలింగమూర్తి హత్య కేసు విచారణను హైకోర్టు సిట్టింగ్ జడ్జికి అప్పగించాలి

ఈనెల 19వ తారీకు బుధవారం రోజు భూపాలపల్లి నగరంలో జరిగిన నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసు విషయంలో బీఆరెస్ రాజకీయ ప్రముఖుల హస్తం ఉందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మానవ హక్కుల వేదిక నిజనిర్ధారణ బృందం ఈరోజు మృతుడి కుటుంబీకులను, బంధుమిత్రులను కలిసి వివరాల సేకరించింది. అలాగే, హత్య జరిగిన స్థలాన్ని పరిశీలించి, పట్టణ పోలీసు అధికారులను కలిసి వివరాలు సేకరించింది.

49 సంవత్సరాల వయసు కలిగిన నాగవెల్లి రాజలింగమూర్తి భూపాలపల్లి నగరాన్ని అనుకొని ఉన్న జంగేడు గ్రామ నివాసి. లింగమూర్తి కులవృత్తి రీత్యా వడ్రంగి పనిచేసుకొని జీవించేవాడు. వెనుకబడిన కులాలకు రాజకీయ అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో గత పది సంవత్సరాలుగా తన చుట్టూ ఉన్న సామాజిక విషయాలను పట్టించుకుంటూ పట్టణంలో ముఖ్యుడుగా ఎదిగాడు. రాజలింగమూర్తి భార్య బీఆరెస్ పార్టీ నుండి భూపాలపల్లి నగర 15వ వార్డు కౌన్సిలర్ గా ఎన్నికైనారు. రాజలింగమూర్తి భూపాలపల్లి పట్టణంలో అనేక ప్రభుత్వ, ప్రైవేటు భూ వివాదాలు, అధికారుల అవినీతి విషయంలో ధైర్యంగా పై అధికారులకూ, కోర్టులలో ఫిర్యాదులు చేసేవాడు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని 2023 అక్టోబర్ లో కోర్టులో వేసిన ప్రైవేట్ కంప్లైంట్ పై కొన్ని నెలలుగా రాష్ట్ర హైకోర్టులో విచారణ జరుగుతున్నది. కేసీఆర్ , కేటీఆర్ మొదలగు వారికి మూడవసారి కోర్టు నుండి సమన్లు జారీ అయ్యాయి. తెల్లవారితే హైకోర్టులో విచారణ ఉండగా రాజలింగమూర్తి దానికి ముందు రోజే హత్యకు గురికావడం కాకతాళీయంగా లేదు. స్థానిక మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ప్రధాన అనుచరుడైన కొత్త హరిబాబు ఈ హత్య కేసులో కుట్ర దారుడిగా ఉన్నాడు. హత్యలో స్వయంగా పాల్గొన్న ఒక ప్రధాన నిందితుడు హత్యానంతరం హరిబాబుకు ఫోన్ చేసి, ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన డబ్బుల గురించి అడిగిన విషయం పోలీసుల విచారణలో వెళ్లడైంది. హరిబాబు కు రాజలింగమూర్తిని చంపించాల్సినంత అవసరం వ్యక్తిగతంగా లేదని, కాలేశ్వరం కేసు విచారణను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ పార్టీ అధినాయకులే అవినీతి విచారణ నుండి తప్పించుకోవటానికి హరిబాబు ద్వారా రాజలింగమూర్తిని హత్య చేయించారని మృతుని భార్య, వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈరోజు పోలీసులు మీడియాకు వెల్లడించిన నిందితులందరూ కేవలం పాత్రధారులేనని వారితో హత్య చేయించింది గండ్ర వెంకటరమణారెడ్డి, కేటీఆర్ లేనని వారి ఆక్రందన. వారి బలమైన అనుమానాల నేపథ్యంలో విచారణ ఆ వైపుగా జరగాల్సి ఉంది. 20వ తారీకు హైకోర్టులో ఆ కేసు విచారణ సందర్భంగా హాజరు కావలసిన కెసిఆర్, కేటీఆర్ హాజరు కాకపోవటానికి కారణం ఏమిటని హైకోర్టు న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా వారి తరఫు లాయరు కక్షిదారుడే చనిపోయినప్పుడు ఇంకా కేసు విచారణ ఏముంటుందని మాట్లాడడాన్ని బట్టి చూస్తే కూడా రాజలింగమూర్తి హత్యకూ, కాలేశ్వరం అవినీతి కేసుకూ సంబంధం ఉన్నట్టుగా నమ్మాల్సి వస్తున్నది.

అందువల్ల రాజలింగమూర్తి హత్య కేసును రాజకీయాలకు అతీతంగా, పాలకవర్గాల ప్రమేయాల కతీతంగా విచారణ జరిపి దోషులను తేల్చేందుకు ఒక సెట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తికి అప్పగించాల్సిందిగా మేం ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నాం. మృతుని కుటుంబ సభ్యులకు కూడా అదే నిందితుల నుండి ప్రాణభయం ఉన్న నేపథ్యంలో వారికి రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్నాం.

మా నిజ నిర్ధారణ బృందంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ తిరుపతయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు బదావత్ రాజు, రాష్ట్ర సహాయ కార్యదర్శి టి. హరికృష్ణ, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి దిలీప్, సభ్యులు హనుమాన్ ప్రసాద్, కర్ణాటక సమ్మయ్య మరియు చంద్రగిరి శంకర్ గార్లు పాల్గొన్నారు.

డాక్టర్ ఎస్. తిరుపతయ్య,
మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

భూపాల్ పల్లి,
23.02.2025.

Related Posts

Scroll to Top