రక్తహీనత తో మరణించిన గిరిజన బాలింత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి

నిర్మల్ జిల్లా కడెం మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన కొలాo గిరిజన బాలింత మహిళ రక్తహీనత తో శనివారం తెల్లవారుజామున ఉట్నూర్ లో మృతి చెందిన సంఘటన అందరి హృదయాలను కలచివేసిందని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గిరిజన శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భుజంగరావు పేర్కొన్నారు.

ఆదివారం మానవ హక్కుల వేదిక నిజ నిర్ధారణ కమిటీ బృందం మృతి చెందిన కొలాo గిరిజన మహిళ స్వ గ్రామమైన నిర్మల్ జిల్లాలోని కడెం మండల పరిధిలోని మారుమూల అటవీ ప్రాంతంలో గల లోతట్టు గ్రామమైన ఇస్లాంపూర్ గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను కలిసి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మృతి చెందిన బాలింత అయిన శ్రీవిద్య భర్త మాత్రం భగవంతురావు మాట్లాడుతూ తాము ప్రతినెల ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేపిస్తున్నామని, కానీ 7 8 9 నెలలలో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేపించలేదని, చివరిగా ప్రసూతి కోసం ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేపించగా బాధితురాలికి ఒక రక్తహీనత ఉందని, వెంటనే నాలుగు బాటిల్ల రక్తం ఎక్కించి ప్రసవం చేశారన్నారు. అనంతరం వైద్యులు శ్రీవిద్యకు గుండె సంబంధిత వ్యాధి ఉన్నదని, ఆమెను హైదరాబాదులోని ఆసుపత్రికి తీసుకెళ్లి మెరుగైన వైద్యం చేపించుకోవాలని సూచించగా తమ వద్ద ఆర్థిక స్తోమత లేనందున బాలింత ఆరోగ్యంగా ఉందని ఆలోచించి ఇంటి వద్దనే ఉన్నామని తెలిపారు. శ్రీవిద్య ప్రసవం అయిన 40 రోజుల నుండి ఆరోగ్యం నిలకడగా ఉండి అకస్మాత్తుగా శనివారం తెల్లవారుజామున గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందిందని వివరించారు.

గిరిజన శాఖ అధికారులు,వైద్యులు తమ ఆర్థిక ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వ వాహనాన్ని చేకూర్చి మెరుగైన వైద్యం కోసంహైదరాబాదులోని ఆసుపత్రులకు తరలించి ఉంటే తన భార్య శ్రీవిద్య, తనకు, తన కుటుంబ సభ్యులకు, జన్మనిచ్చిన పసిపాపకు దూరమయ్యేది కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు భుజంగరావు మాట్లాడుతూ కొలా o గిరిజనుల కోసం ప్రత్యేకమైన శాఖ ఉందని, కొలాo డెవలప్మెంట్ ఆఫీసర్, ఐటీడీఏ పీవో, పి వి టి జి లు అంతరించిపోతున్న కొలాoగిరిజనుల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాయన్నారు. ఐటీడీఏ లో ప్రత్యేక వాహనాలు కేటాయించి గిరిజనుల అభివృద్ధి కోసం పివిటిజీలు మారుమూల గ్రామాలలో నివసిస్తున్న గర్భవతుల,బాలింతల,పసి పిల్లల ఆరోగ్యం కోసం ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ అవి వారి దరి చేరకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా ఉన్నట్లుకళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుందని భుజంగరావు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని గిరిజనుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రవేశపెట్టి,గిరిజనులను చైతన్య పరచడానికి ప్రతి మారుమూల గ్రామంలో కళాజాత బృందా లచే అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. మృతి చెందిన శ్రీవిద్య కన్న పసిపాప పాలన కోసం ప్రభుత్వం పాడి ఆవుని,లేక గేదెను సమకూర్చి పసిపాపకు పాలు అందించే విధంగా కృషి చేయాలని కోరారు. శ్రీవిద్య ప్రస్తుతం డిగ్రీ చదువుచూ ఉండేదని, ఆమె భర్త భగవంతురావు కూడా డిగ్రీ వరకు చదువుకొని ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కాలం వెళ్ళదీస్తున్నాడని, ఆయనకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించి వారి కుటుంబం చిన్నా భిన్నo కాకుండా ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని, మృతి చెందిన బాలింత ప్రసవించిన పసిపాప ఆలనా పాలన కోసం ఐదు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియాచెల్లించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి రఘోత్తమ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు అమృత రావు, కమిటీ సభ్యులు మేడమురళీధర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

-మృతి చెందిన బాలింత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి.
-పాప సంరక్షణ కోసం ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలి.

కడెం,
09.03.2025

Related Posts

Scroll to Top