ఆకివీడు మండలంలోని పెదపేటలో ఉన్న గొంతెనమ్మ గుడిని అక్రమంగా రామాలయంగా మార్చే ప్రయత్నాలకి ప్రభుత్వం తక్షణమే అడ్డుకట్ట వేయాలి !!

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం ఆకివీడులోని పెదపేటలో ఉన్న గొంతెనమ్మ గుడిని అక్రమంగా రామాలయంగా మార్చే ప్రయత్నాలకి ప్రభుత్వం తక్షణమే అడ్డుకట్ట వేయాలని మానవ హక్కుల వేదిక (HRF) డిమాండ్ చేస్తుంది. అలాగే ఆకివీడులో మత సామరస్యం, శాంతి భద్రతలు దెబ్బతినకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.

ఆకివీడు పెదపేటలో గొంతెనమ్మ గుడి / సత్రం వివాదానికి కేంద్ర బిందువుగా మారిన నేపధ్యంలో నలుగురు సభ్యుల HRF బృందం ఆదివారం నాడు (29.03.2026) ఆకివీడు గ్రామంలో నిజ నిర్ధారణ చేపట్టింది. ఆకివీడు పెదపేటలోని డాబా 1920 నుంచి గొంతేనమ్మ సత్రంగా ఉంటూ వచ్చింది. దానిలో నంది విగ్రహం కూడా ఉంది. ఈ డాబా నిర్మాణానికి సాయం చేసిన దళిత కుటుంబాల ఇంటి పేర్లు కూడా ఇక్కడి రాతి పలకల్లో ఉన్నాయి. నంది బొమ్మతో దళితులు ప్రతి సంవత్సరం జాతర జరిపే వారు. ఇది ఎప్పుడూ కూడా మనం సామాన్యంగా భావించే గుడిలా వినియోగంలో లేదు. ప్రాథమికంగా సత్రం, అలానే గొంతేనమ్మ ప్రతిమ ఉంచుకోవడానికి ఒక చిన్న డాబా లాంటి కట్టడం. ఆ రోజుల్లో బాటసారులు ఈ డాబా భవనం మెట్లెక్కి పైన సేదతీరెవారు. తర్వాత కాలంలో ఎవరో బయట వేరొకచోట తీసేసిన సిమెంటు సీత, రామ విగ్రహాలను అప్పట్లో సత్రం వ్యవహారాలు చూసే వ్యక్తి అనుమతితో ఇక్కడ పెట్టారు. అయితే వాటికెప్పుడూ ఎవరూ పూజా కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు లేవు. తర్వాత్తర్వాత గొంతేనమ్మ జాతర చేయడం కూడా ఆగిపోయింది. ఆ కట్టడం మొత్తం పాడుపపడిపోయింది.

ఒక మూడు వారాల క్రితం సాక్షి పత్రికలో రామాలయం పాడైపోయినా ఎవరూ పట్టించు కోవడం లేదనే వార్త వచ్చింది. దీనితో స్థానిక ఆర్. ఎస్. ఎస్. నాయకులు, ఇక్కడ రామాలయాన్ని నిర్మిస్తామని ప్రకటించారు.

తమ గొంతేనమ్మ సత్రాన్ని పడగొట్టి రామాలయం నిర్మిస్తానండంపై స్థానిక దళితులు అభ్యంతరం తెలియచేసారు. ఈ నెల మార్చి 7వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కె. రఘురామ కృష్ణంరాజు, తన అనుచరులు, ఆర్. ఎస్. ఎస్. నాయకులతో వచ్చి సత్రం పూర్వాపరాలు తెలుసుకోకుండా అక్కడ విగ్రహం వద్ద కొబ్బరి కాయ కొట్టి, ఎవరు కాదన్నా అక్కడ రామాలయం నిర్మించి తీరుతామని ప్రకటన చేస్తూ, దళితులను ప్రత్యేకించి చర్చికి వెళ్ళేవాళ్లను హేళన చేస్తూ అవమానకరంగా మాట్లాడారు. దళితులు వాస్తవాలను వివరించడానికి ప్రయత్నిస్తుండగా ఆర్. ఎస్. ఎస్. వాళ్ళు, ఎమ్మెల్యే అనుచరులు దళితులపై దాడిచేసారు. పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసారు.

ఈ ఘటన తరువాత స్థానిక దళితులను కించ పరుస్తూ సోషల్ మీడియాలో కూటమి నాయకులు, కార్యకర్తలు అనేక అసభ్యకరమైన పోస్టు పెట్టారు. ఒక రకమైన విద్వేషపూరిత వాతావరణం నెలకొన్న అలాంటి పరిస్థితుల్లో ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రఘరామ కృష్ణం రాజు సామరస్యాన్ని పెంపొందించే చర్యలు చేపట్టకపోగా “హిందువులు రామాలయంలో పూజ చేసుకోవడానికి దళిత క్రైస్తవులు దాడి చేసి అడ్డుపడుతున్నారు” అనే అసత్య ప్రచారాన్ని రాష్ట్రమంతా విస్తృతంగా చేశారు. మళ్ళీ శ్రీరామనవమి రోజున వందలాదిమంది అనుచరులతో అక్కడికి వచ్చి పోలీసు బందోబస్తు నడుమ పూజలు నిర్వహించి, ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి వెళ్లి పోయారు. ఆయన అనుచరులు కవ్వింపు చర్యలకు పాల్పడి దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఘర్షణకు పాల్పడ్డారు. అక్కడ ఉన్న తెలుగుదేశం మరియు జనసేన నాయకుల మధ్య ఉన్న గ్రూపు తగాదాలు కూడా ఈ ఘర్షణకు కొంత కారణమని స్థానికులు అంటున్నారు.

ఈ ఘర్షణలో దెబ్బలు తిన్న జనసేన నాయకుడు గవర అనిల్ ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఆకివీడు పోలీస్ లు 58 మంది దళితులపై హత్యాయత్నం సహా పలు సెక్షన్లతో కేసు నమోదు చేసారు. కేవలం వీడియోలో ఉన్న పెదపేట దళితులందరిపైన దాడితో సంబంధం లేకపోయినా కేసు నమోదు చేసారు. ఇదే ఘర్షణలో గాయలబారినపడ్డ దళిత యువకులు మద్దే నరేష్, మద్దే కిషోర్ ల వాంగ్మూలాలు పోలీసులు తీసుకుని వాటి ఆధారంగా కేసు నమోదు చేయాలి. అది చేయకపోగా గాయాలతో ఉన్న వారిద్దరినీ అరెస్ట్ చేసారు. మద్దే నరేష్ మొన్నటి వరకూ నర్సాపురం తెలుగుదేశం పార్టీ ఎస్. సి. సెల్ నాయకుడిగా ఉండేవారు. ఈ ఘటనలో దళితుల పక్షాన మాట్లాడుతున్నాడని అతనిని పదవినుండి తొలగించారు. ఇప్పటి వరకూ 27 మందిని అరెస్టు చేసి రిమాండు కు పంపారు.

ఏకపక్షంగానే కేసు నమోదు చేయడం, దళితులపై దాడి చేసిన వారిపై ఇంతవరకూ కనీసం కేసు కూడా నమోదు చేయకపోవడం చూస్తే స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే పోలీసు యంత్రాంగం పనిచేస్తున్నట్టు అర్ధమౌతుంది. పెదపేటలో పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించడం స్థానిక దళితులను భయాందోళనలకు గురిచేయడానికి తప్ప వేరే ఏ ప్రయోజనమూ లేదు. ఈ ఘటనలకి, పోలీసులకి భయపడి పెదపేటలో మగవారు ఇల్లు విడిచి వేరే చోట తలదాచుకుంటున్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు కూడా క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకోకుండా హిందువులు పూజలు చేసుకోవడాన్ని దళితులు అడ్డుకొంటున్నారనే అసత్య ప్రచారానికే ప్రాచుర్యం కల్పించడం సిగ్గుచేటు.

దళితులపై దాడి చేసిన వారిపైన అలానే సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారి పైన కూడా తగు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయాలని, దళితులపై నమోదైన కేసులో ముద్దాయిలుగా చూపించిన 58 మందిలో దాడికి సంబంధం లేని వారిని తక్షణమే వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టాలని, అలాగే ఈ ఘర్షణ వెనుక ఉన్న అసలు వ్యూహకర్తలు ఎవరు? ఇవి ఎవరి ప్రయోజనాల కోసం రెచ్చగొట్టారు అనేవి ప్రభుత్వమే నిష్పక్షపాతమైన విచారణ జరిపించి నిగ్గు తేల్చాలని మానవ హక్కుల వేదిక (HRF) డిమాండ్ చేస్తుంది.

వై. రాజేష్ (HRF ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
ఏ. రవి (HRF ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యకులు)
జి. రోహిత్ (HRF ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి)
ఎం. శ్రీనివాస రావు (HRF ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యవర్గ సభ్యులు)

30.03.2026,
విజయవాడ.

Related Posts

Scroll to Top