సిట్ పోలీసుల చిత్రహింసల కారణంగానే కర్నూలు జిల్లాలో వితంతు దళిత మహిళ మాల గంగమ్మ మృతి చెందిందని HRF అభిప్రాయపడుతుంది

సిట్ పోలీసుల చిత్రహింసల కారణంగానే కర్నూలు జిల్లాలో వితంతు దళిత మహిళ మాల గంగమ్మ మృతి చెందిందని మానవ హక్కుల వేదిక (HRF) అభిప్రాయపడుతుంది. అలాగే ఆమెతో సహజీవనం చేసిన ఆమె ప్రియుడు, వివాహితుడైన మాల దర్గయ్య చావు, బతుకుల మధ్య కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పోరాడవలసిరావడాన్ని మానవ హక్కుల వేదిక, భారత కార్మిక సంఘాల సమాఖ్య (IFTU) తీవ్రంగా ఖండిస్తుంది. HRF నుండి రాష్ట్ర ఉపాధ్యక్షులు యు. జి. శ్రీనివాసులు, కర్నూలు జిల్లా అధ్యక్షులు కె. ఉరుకుందప్ప, IFTU కర్నూలు జిల్లా బాధ్యులు నర్సన్నలతో కూడిన ముగ్గురు సభ్యుల బృందం కర్నూలు జిల్లా కౌతాళం మండలం బదినేహాల్ గ్రామ ప్రజలను, గంగమ్మ కుటుంబసభ్యులను, కౌతాళం పోలీసులను విచారించగా ఈ కింది వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

సిట్ పోలీసులా! మజాకా !!

మన సిట్ పోలీసుల విచారణ “చూసిరమ్మంటే కాల్చివచ్చారన్న” విధంగా ఉంది. గంగమ్మ పెద్దకొడుకు వీరేంద్రచావుకు కారకులు ఎవరన్నది విచారించి, వారిపై కేసును నమోదు చేసి నివేదిక ఇవ్వమని ఏ పి రాష్ట్ర హైకోర్టు సిట్ ను ఆదేశించిన విషయం తెలిసిందే. రాష్ట్ర డిజిపీ ఆదేశాల మేరకు గుంటూరు అదనపు ఎస్పీ సుప్రజ నాయకత్వంలోని 13 మంది పోలీసులతో సిట్ ఏర్పడింది.

గత కొంత కాలంగా గంగమ్మ (40 సం), దగ్గయ్య (45 సం) మధ్య వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. గంగమ్మ కొడుకు వీరేంద్ర దానిని వ్యతిరేకించినందుకే గంగమ్మ, దర్గయ్యలు వీరేంద్రను చంపారన్న ఆరోపణలు ఉన్నాయి. సిట్ పోలీసులు గంగమ్మ, ఆమె ప్రియుడు దగ్గయ్యలే వీరేంద్ర హత్య చేశారని తమ విచారణలో తేల్చారు. అయితే వారు వీరేంద్ర శవాన్ని ఎక్కడ పూడ్చి పెట్టారని తెలుసుకోవడానికి గంగమ్మ, దగ్గయ్యలను తీవ్రమైన చిత్రహింసలకు గురిచేశారు. ఆ క్రమంలోనే గంగమ్మ మృతిచెందగా, దర్గయ్య పోలీసుల పహారా మధ్య ప్రభుత్వ ఆసుపత్రిలో చావు బతుకులమధ్య పోరాడుతున్నాడన్నది వాస్తవం.

మా నిర్ధారణకు కారణాలు

  • వీరేంద్ర చావుకు గంగమ్మ, దర్గయ్యలే కారకులని సిట్ పోలీసులు తమ విచారణలో నిర్ధారణకు వచ్చారు. చట్ట ప్రకారం సిట్ పోలీసులు గంగమ్మ, దగ్గయ్యలను నిందితులుగా చూపి, వారిపై హత్యకేసు నమోదుచేసి, రిమాండుకు పంపాలి. వీరేంద్ర శవాన్ని నిందితులైన వారు ఎక్కడ పూడ్చి పెట్టినారన్న విషయం తేల్చడానికి, హింసించడం తోనే కాకుండ, సమయం తీసుకొని వారు శాస్త్రీయమైన పరిశోధన చేయవలసింది. కానీ వారా పని చేయకుండ, హైకోర్టు సిట్ పై పెట్టిన నమ్మకాన్ని వమ్ముచేశారు.
  • ⁠సిట్ పోలీసుల అదుపులో ఉన్న గంగమ్మ అనారోగ్యం కారణంగా మృతిచెందడం వాస్తవమైతే, ఆమె శవానికి పోస్టుమార్టం చేయవలసిన అవసరం ఉంటుందా? ఆమెను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చకుండ, 31 మే, 2026 తేది, శనివారం సాయంత్రం అంబులెన్సులో తీసుకొనివెళ్లి కర్నూలు కిమ్స్ ఆసుపత్రికి ఎందుకు చేర్చినట్టు ? ఆమె అక్కడ 01 జూన్, 2026 తేది, ఆదివారం ఉదయం 7 గం లకు మృతిచెందగా, వారు 1 టౌన్ పోలీసుస్టేషన్, కర్నూలులో కేసును నమోదుచేసి, పోస్టుమార్టం చేయించారు. ఆమె ఒంటిమీద గాయాలను డాక్టర్స్ ఎంతమాత్రం సవ్యంగా రికార్డుచేసి ఉంటారన్నది సందేహమే!
  • ⁠గంగమ్మ శవానికి అంత్యక్రియలకు ముహూర్తం 01 జూన్, 2026 తేదినే జరపాలన్నది సిట్ పోలీసులే నిర్ణయించారు. అంత్యక్రియలకు తరపున బంధువులు వచ్చారో, లేదో తెలియదు కాని, దానికి సిట్ పోలీసులతో పాటు, స్థానిక పోలీసులు 20 – 30 మంది అదేరోజు సాయంత్రం 5.30 గంలకు బదినేహాల్ చేరుకొని 7 గంల కల్లా శవాన్ని పూడ్చి పెట్టడం జరిగింది. గంగమ్మ చావుకు సిట్ పోలీసుల ప్రమేయం లేకుంటే, వారే గంగమ్మ శవానికి దగ్గరుండి అంత్యక్రియలకు హడావిడిగా జరపవలసిన అవసరం ఏముంది?
  • ⁠సిట్ పోలీసుల కథనం ప్రకారం దర్గయ్య బైక్ మీద నుండి కిందపడిన కారణంగానే దెబ్బలు తగిలిలాయి. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో దగ్గయ్య తనకు తగిలిన దెబ్బలకు చికిత్సకోసం చేరడం వాస్తవమైతే, దర్గయ్యను ఎవరినీ కలవనీయకుండా పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు?

ఘటనపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరపక పోతే ప్రజాప్రభుత్వం ఎలా అవుతుంది?

వీరేంద్ర హత్యకు గంగమ్మ, దర్గయ్యలే కారణమని వచ్చిన ఆరోపణలు నిజమైతే, తప్పనిసరిగా ఆ నేరాలకు వారు బాధ్యత వహించాలి అని మేం భావిస్తున్నాం. సాధారణ పోలీసుల వల్ల పని జరగదని రాష్ట్ర హైకోర్టు ప్రత్యేక విచారణ అధికారం కలిగిన సిట్ (Special Investigation Team)తో విచారణ జరిపించమని ఆదేశిస్తే, వారు సైతం గంగమ్మ, దర్గయ్యలను చిత్రహింసలకు గురిచేసి, గంగమ్మను లాకప్ మృతికి గురిచేయడమే కాకుండ, దర్గయ్యతో ఎవరిని కలవనీయకుండ చేయడం చట్ట ప్రకారం నేరాలు కాదా అని మేం అడుగుతున్నాం. అదే విధంగా సిట్ పోలీసులు తాము చేసిన నేరాలను కప్పిపుచ్చుకోవడానికి పాల్పడిన చర్యలు మరింత తీవ్రమైన నేరాలుగా మేం భావిస్తున్నాం. సుప్రజ నేత్రుత్వంలోని సిట్ పోలీసులతోపాటు, సహకరించిన స్థానిక పోలీసులు, డాక్టర్స్ సక్రమంగా భాద్యతలు నిర్వహించారా? లేదా? అన్న విషయమై ప్రజలలో అనేక అనుమానాలు ఉన్నాయి.

కావున రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, సిట్ పోలీసులు విధి నిర్వహణలో చట్టబద్దంగా నడుచుకోవడంలేదనే విషయాన్ని గుర్తించాలి. ఘటనపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించి, గంగమ్మ శవానికి రీ పోస్టుమార్టం చేయించి, అందుకు కారకులైన సిట్ పోలీసులందరిపైన, వారికి సహకరించిన వారిపైనా, హత్య కేసుతోపాటు, ఎస్సీ, ఎస్టీ, (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989, కింద నమోదు చేయడంతోపాటు, బాధిత కుటుంబాలు ఎవరితో ఏం చెబితే తమకు ఎవరి నుండి ఏం ప్రమాదం ముంచుకు వస్తుందోనని భయంనీడలో బతుకుతున్నారు కాబట్టి వారికి వెంటనే భద్రతను కల్పించడంతోపాటు, వారి కుటుంబాలకు తగిన ఆర్ధిక సహాయం అందించాలని మేం డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించి, సిట్ పోలీసులపై వెంటనే చర్య తీసుకోకపోతే, ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న కొద్దిపాటి విశ్వాసం లేకుండాపోయే ప్రమాదం ఉందని మేం భావిస్తున్నాం.

యు. జి. శ్రీనివాసులు (HRF రాష్ట్ర ఉపాధ్యక్షులు)
కె. ఉరుకుందప్ప (HRF కర్నూలు జిల్లా అధ్యక్షులు)

24.06.2026,
ఆదోని.

Related Posts

Scroll to Top