ప్రశ్న రావణ్ గా తెలిసిన బచ్చలకూర జోసెఫ్ మీద జూలై నాలుగున కృష్ణ జిల్లా గన్నవరం పట్టణ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) లోని రెండు సెక్షన్లు- సెక్షన్ 13, 39-నమోదు చేయడం అనేది పోలీస్ వ్యవస్థ పాలక వ్యవస్థను మెప్పించడానికి ఏ స్థాయి వరకు దిగజారగలదో తేట తెల్లం చేస్తుంది. అదే ఎఫ్.ఐ.ఆర్ లో బిఎన్ఎస్ ప్రకారం పెట్టిన పలు సెక్షన్లు కూడా రాజ్యాంగం ప్రతి మనిషికి కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛకు, వాక్ స్వాతంత్రానికి విఘాతం కలిగించేవే. అతని వ్యాఖ్యలు, వాడిన భాష ఎంత అభ్యంతరకరంగా ఉన్నప్పటికీ ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రత్యేకించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించిన కారణంగానే అతనిని ఇలా వేధింపులకు గురి చేస్తున్నారని మానవ హక్కుల వేదిక (HRF) భావిస్తోంది
ప్రత్యేకించి అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలను వ్యక్తులను ఉద్దేశించి సామాన్యులు, యూట్యూబర్లు, కమెడియన్లు మాట్లాడినప్పుడు ఇలాంటి సెక్షన్లను ఉపయోగించడం మనం పలు కేసులలో చూస్తూనే ఉన్నాము. ఇలాంటి అనేక కేసులలో మెజిస్ట్రేట్లు జ్యూడిషియల్ రిమాండ్ ఇచ్చే అవసరం కూడా లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికి రావణ్ మీద మాకు తెలిసి 4 జిల్లాలలో (కృష్ణ, కాకినాడ, అనకాపల్లి, ఏలూరు) 5 పోలీసు స్టేషన్లలో (గన్నవరం పట్టణ, ఇనగూడూరు, పిఠాపురం పట్టణ, పాయకరావుపేట, ఏలూరు త్రీ టౌన్) 5 కేసులు ఇదే విషయం మీద నమోదు చేశారు. ఈ ఐదు కేసులలో కనీసం నాలుగిటిలో కూడా అదే తేల్చి చెప్పారు. ఆ కేసులలో రిమాండ్ రాకపోవడంతో ఈ ఊపా కేసు పెట్టారని భావించవలసి వస్తున్నది. అదే విధంగా కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్ లో 2025 డిసెంబర్ లో పెట్టిన వేరే కేసుని కూడా ఇప్పుడు ఈ అవసరం కోసం తిరగదోడారు. ఇవన్నీ కూడా వేధింపులు కాకుండా ఏమనుకోవాలి?
ఇప్పుడు అధికారంలో ఉన్న ఇదే నాయకులు గతంలో వాళ్లు ఇచ్చిన అనేక బహిరంగ ఉపన్యాసాలలో వాడిన భాష కూడా అంతే అభ్యంతరకరం. ప్రతిపక్ష నాయకులైనా, అధికారంలో ఉన్న రాజకీయ నాయకులైనా వాళ్లు వాడే భాష గాని ఎంచుకునే అంశాలు గాని ప్రజల్లో విద్వేషాలు, తీవ్రమైన భావోద్వేగాలు రెచ్చగొట్టడానికే. పలు సందర్భాలలో ఆయా రాజకీయ నాయకులు ఇచ్చిన విద్వేషపూరిత ప్రసంగాలు ప్రత్యక్షంగా హింసాత్మక ఘటనలకు దారితీసాయి.
అయితే అధికారంలో ఉన్న వాళ్లు రాజ్యాంగబద్ధ వ్యవస్థలను, సంస్థలను తమ జేబు వ్యవస్థలుగా వాడుకుంటూ అధికారంలో లేని వాళ్లపైన తమను ప్రశ్నించిన వారిపైన కేసులను పెట్టి వేధించడం ఒక మామూలు ప్రక్రియగా మారిపోయింది. తమ నాయకున్ని కించపరిచిన వాళ్లని తమకు అప్పజెప్పమని పోలీసులపైనే మూకదాడులకు తెగబడే స్థాయికి మన సమాజంలో చట్టబద్ధ పాలన దిగజారింది. ఇది తిరిగి తిరిగి సామాన్యులకే అపారమైన నష్టం కలగజేస్తుంది.
వై. రాజేష్ (HRF ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
జి. రోహిత్ (HRF ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి)
విజయవాడ,
06.07.2026