మూసి పరివాహక ప్రాంతాల్లో మానవ హక్కుల వేదిక అధ్యయనం

తెలంగాణ ప్రభుత్వం భారీ బడ్జెట్ తో మూసీనది సుందరీకరణ ప్రాజెక్టు చేపడుతున్న నేపథ్యంలో, 05.04.2026 వ తేదీన, మూసీ నది క్రింది భాగాన ఉన్న గ్రామాలు, ఆ ప్రాంతంలో నెలకొని ఉన్న కత్వాల నీటి పారుదల వ్యవస్థ, వాటి ఉప కాలువలు పరిశీలించి గ్రామాలలోని ప్రజలను పద్నాలుగు మంది సభ్యులతో కూడిన బృందం కలిసింది. ఈ బృందంలో మానవ హక్కుల వేదిక, క్లయిమేట్ ఫ్రంట్, మరియు మూసీ పరిరక్షణ సమితి సంస్థ బాద్యులు ఉన్నారు. ఆ ప్రాంత వృత్తి దారుల సంఘాల నాయకులు హక్కుల సంస్థ బృందానికి సహాయ కారిగా గ్రామాల పర్యటన, పరిశీలన నలో పాల్గొన్నారు.

ఫిర్జాదిగూడ, ప్రతాప్ సింగారం, కాచి వాని సింగారం, గౌరవెళ్లి, అనంతారం, ఎంకిర్యాల, పల్లెగూడ, రాఘవాపూర్, పిలాయ్ పల్లి, పెద్దగూడెం, బాచారం, ఏదులాబాద్, జూలూరు గ్రామాలు, ఈ గ్రామాలలో వ్యవసాయానికి అను సంధానంగా ఉన్న సాగునీటి వ్యవస్థ లైన కాత్వాలు, ఉపకాలువలు చెరువులు పరిశీలించింది. అన్ని చోట్ల నీటి వనరుల్లో, నీరు పచ్చని రంగులో కనపడ్డాయి, విపరీతమైన దుర్వాసన రావడం గమనించాo. ఆనీళ్లను పశువులు, గొర్రెలు, మేకలు కూడా తాగడం లేదని తెలిసింది. ఆ ప్రాంతం అంతా చాలా మనోహరంగా, వరి పంట, గడ్డితో కనిపించింది. గడ్డిని మాత్రం జంట నగరాల్లో పాలవ్యాపారం చేసే వాళ్ళు తమ ఆవులు, గేదెల కోసం కొనుక్కు పోతున్నారని, వరి పైరు చూడటానికి బాగా కనపడ్డప్పటికీ వడ్లలో దాదాపు 40% తాలు వస్తుందని, మిగిలిన ధాన్యం కోళ్ల ఫారమ్ లు నడిపే వాళ్ళు కోళ్ళ దానా లో కలపడానికి తీసుకెళ్తారని రైతులు తెలిపారు. ఈ ప్రాంతంలో మూసీ నదిలో చేపలు సమృద్ధిగా లభించేవి.

ఇప్పుడు విషo లాంటి కాలుష్య నీటిని తట్టుకునే క్యాట్ ఫిష్ చేపలు మాత్ర మే ఉన్నాయని, అవి మనుషులు తినడానికి పనికి రావని చెప్పారు. మత్యకారుల కుటుంబాలకు చెందిన మహిళలందరు, ప్రతి రోజు రాంనగర్, సికిoద్రాబాద్ లోని చేపల మార్కెట్లకు వెళ్ళి చేపలు కొని నగరం లో అమ్ముకొని రాత్రికి తిరిగి వస్తారని గ్రామస్తులు తెలిపారు. చేపలకు ప్రసిద్ధి గాంచిన ఏదులాబాద్ చెరువు బోసిపోయి, భయంకరమైన వాసన వేస్తూ కనిపించింది. కొందరు మత్యకారులు బయట నుండి చేపపిల్లలను ఖరీదు చేసి తెచ్చి చెరువుల్లో వేసినా, అవి పెరగడం లేదని, వాటిపై నల్లని మచ్చలు రావడంతో ఎవరూ కొనడం లేదని బెస్త వాండ్లు తెలిపారు.

గతంలో మూసీ నీరు తాగడం వల్ల మహిళ లకు గర్భo పోవడం అధికంగా జరిగివని, ఇప్పుడు RO ప్లాంట్లు పెట్టుకున్న తరువాత ఆ సమస్య తగ్గిందని తెలిపారు. ఒకప్పుడు ఈ ప్రాంతం గొర్రెలు, మేకలకు ప్రసిద్ధి అని, ఇప్పుడు అసలు లేవని, బయట నుండి గొర్రెలు ఖరీదు చేసి, తెచ్చుకొని పెంచుకుంటే అసలు అవి గర్భం దాల్చడం లేదని యూదవ సంఘం నాయకులు చెప్పారు. భూమి లేని దళితులు ఇక్కడ విస్తారంగా ఉన్న పంటపొలాల్లో కూలీ పనులు చేసుకునేవారట, కాలుష్యం వల్ల పొలం లోకి దిగిన వాళ్ళ కాళ్ళకు, చేతులకు చర్మవ్యాదులు వస్తున్నాయని, ఈ పరిస్థితి లో దళితులు, భూమి లేని పేదలందరు హైదరాబాద్ నగరానికి వలస వెళ్ళి కూలిపనులు చేసుకుంటున్నారని దళిత నాయకుడు తెలిపాడు. ఈ భయంకర మైన పరిస్థితి అంతా పైభాగంలో నుండి మూసీ కాలుష్యం తోనిండిన నీరు ఊర్ల లోకి రావడంతో తమ గ్రామాలన్నీ విద్వoసానికి గురై తీవ్ర సంక్షోభం లో చిక్కు కున్నాయని అన్ని గ్రామాలలో ప్రజలు ముక్త కంఠంతో మాకు తెలిపారు.

మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని విన్నామని, మూసీ నీరు శుభ్రం అవుతుందనే ఆశ తమకుందని చెప్పారు. అయితే ఆ ప్రాజెక్ట్కు గురించి పత్రికల్లో, వాట్సాప్ లో, టి.వి.ల లో చూస్తున్నాం, వింటున్నాం, కాని ఇంతవరకు ప్రభుత్వ ప్రతినిధులు గాని, ఎం.ఎల్.ఎ గాని, ప్రతి పక్ష పార్టీ వాళ్ళు గాని, ఏ రాజకీయ నాయకులు గాని తమ ప్రాoతాలకు వచ్చి ఈ ప్రాజెక్టు గురించి వివరించి, తమకేం కావాలి అన్న విషయం అడగ లేదని చెప్తూ, హక్కుల సంఘంమే ఈ అంశం గురించి చెప్పిన మొదటి సంస్థ అనే అభిప్రాయాన్ని వెల్లడించారు.

జూలూరు గ్రామం లో జరిగిన సమావేశంలో డిండి బాలరాజు గౌడ్ (గౌడ సంఘం), చిలువేరు అయిలయ్య (యాదవ సంఘం), గుండల లిo గస్వామి (శాలివాహన సంఘం), కులమోని బస్వయ్య (ముదిరాజ్ సంఘం), సర్పంగి అయిలయ్య (దళిత సంఘం – MRPS), సివేరి రాజు (యాదవ సంఘం), మలియాల బాలయ్య (నాయిబ్రాహ్మణ సంఘం) మరియు బట్టు శంకర్ (మూసీ పరిరక్షణ సమితి ) గార్లు పాల్గొని మా విశయ సేకరణ బృందానికి వాళ్ళ, వాళ్ళ సమస్యలు వివరించారు.

ప్రజల అభిప్రాయాల్లో చర్చకు వచ్చి, ప్రభుత్వం ముందు ఉంచుతున్న అంశాలు

  • మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కు ప్రభుత్వం వేసుకున్న బడ్జెచ్ లో కనీసం 2 వేల కోట్లు గ్రామాల వ్యవస్థలకు కెటాయించాలి.
  • ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఏర్పడ్డ ముగ్గురు మంత్రుల కమిటీ గ్రామాలలో సమావేశాలు నిర్వహించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలి.
  • శిధిలావస్తలో ఉన్న కత్వాలను ఆధునీకరించాలి.
  • కత్వాలకు అను సంధానంగా ఉన్న ఉపకాలువాలలో పెరిగిన బ్రహ్మజెముడు, పిచ్చిమొక్కలను తొలగించి, సిమెంట్ తో లైనింగ్ చేయాలి.
  • మూసీలో శుభమైన నీరు ప్రవహించేలోపే, వివిధ రసాయన కాలుష్యలతో నిండిన చెరువులలో పూడిక తీసి శుభ్రపరచాలి.
  • ప్రభుత్వం శుభ్రమైన మంచినీరు ట్యాంకర్ల ద్వారా గ్రామాలకు సరఫరా చేయాలి.
  • మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక వైద్య బృందాన్ని గ్రామాలకు పంపాలి.
  • మూసీ పునరుద్ధరణ గౌరెల్లివరకే ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టు క్షేత్రాన్ని, సోలిపల్లి దగ్గరి మూసీ సాగునీటి డ్యాం వరకు పొడిగించాలి.

సభ్యులు:

వి. వసంత లక్ష్మి, ఎస్. జీవన్ కుమార్ – ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు
వి. బాలరాజు – రాష్ట్ర ఉపాద్యక్షుడు
ఎం. సురేశ్ బాబు – నగర కమిటీ అధ్యక్షుడు
టి. రోహిత్ – నగర కమిటీ కార్యదర్శి
శ్రావ్య, ప్రొఫెసర్. శ్రీధర్, ఎం.బాలయ్య, ఆకాష్ – నగర కమిటీ
రుచిత్, అభిషేక్ – క్లైమేట్ ఫ్రంట్

06.04.2026,
హైదరాబాద్.

Related Posts

Scroll to Top