తెలంగాణ పోలీసు శాఖ మరియు తెలంగాణ ప్రభుత్వం విప్లవ రచయితల సంఘం (విరసం) నిర్వహించదలచిన సభను అడ్డుకోవడాన్ని మానవ హక్కుల వేదిక తీవ్రంగా ఖండిస్తోంది.
ఈ సభ 05-07-2026(ఆదివారం) న హైదరాబాద్‌లోని, సుందరయ్య భవన్ ప్రాంగణం లో జరగాల్సి ఉండె. హాలులో జరుపదల్చిన ఒక శాంతియుత ప్రజాస్వామిక సమావేశాన్ని నిరోధించడం రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైన చర్య. ఇది పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛ, సమావేశ స్వేచ్ఛలపై నేరుగా దాడి చేయడమే. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే చర్య.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, ప్రజాస్వామిక విలువలను పరిరక్షిస్తామని, భావ ప్రకటనా స్వేచ్ఛకు గౌరవం ఇస్తామని ముఖ్యమంత్రి గారు శాసనసభ వేదికగా ప్రకటించిన విషయాన్ని మేము గుర్తు చేయదలచుకున్నాo.
ఇదే తరహా ఘటన 2004 సంవత్సరంలో కూడా జరిగింది. అప్పట్లో చిక్కడపల్లి పోలీసులు యాజమాన్యానికి, ఒక స్త్రీ హక్కుల సంస్థ,మానవ హక్కుల వేదిక నిర్వహించదలచిన సమావేశానికి తమ అనుమతిలేకుండా హాలు ను బుక్ చేయకూడదని సూచించారు. హాలు యాజమాన్యాన్ని వేధించే ధోరణి లో ప్రవర్తించారు.
ఆ సందర్భంలో మా సంస్థ డీ.జీ.పీ మరియు ముఖ్యమంత్రికి లేఖ రాసి జోక్యం చేసుకోవాలని కోరింది.లేఖకు స్పందన గా ముఖ్యమంత్రి గారు పోలీసులకు ఇటువంటి నిర్బంధ చర్యలకు పాల్పడవద్దని సూచించినట్లు మాకు తెలిసింది. అప్పటి నుండి ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో జరిగిన ఎటువంటి ప్రజాస్వామిక సమావేశాలను పోలీసులు అడ్డుకోలేదు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత పోలీసు చర్య అత్యంత ఆందోళనకరమైనది. రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కుల పరిధి కుంచించుకుపోతున్నదనే అనుమానాలకు ఇది బలం చేకూరుస్తోంది.
ముఖ్యమంత్రి గారిని వెంటనే జోక్యం చేసుకొని, ఈ విషయాన్ని సమీక్షించి, ప్రజాస్వామిక కార్యకలాపాలపై పోలీసులు ఇష్టనుసారంగా,
ఆంక్షలు విధించకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని మా వేదిక కోరుతోంది.
ఎస్. జీవన్ కుమార్, సమన్వయ కమిటీ సభ్యులు, తెలంగాణ & ఆంధ్రప్రదేశ్
డా. ఎస్. తిరుపతయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ
06-07-2026,
హైదరాబాద్.