కోనసీమ అల్లర్ల కేసులు ఎత్తివేయడం చట్టబద్ధ పాలనను అపహాస్యం చేయడమే!

కోనసీమ జిల్లా పేరు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చినందుకు జరిగిన గొడవలలో నమోదైన కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడం చట్టబద్ధ పాలనను అపహాస్యం చేయడమేనని మానవ హక్కుల వేదిక భావిస్తుంది. 

తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, వాటి స్వతంత్ర ప్రతిపత్తిని నాశనం చేసి తమ జేబు సంస్థలుగా వాడుకోవడం పాలక పార్టీలకు పరిపాటి అయిపోయింది. గతంలో కాపు రిజర్వేషన్ల సభలో జరిగిన తుని అల్లర్ల కేసులు ఎత్తివేయడం ఈ కోవలోనిదే. సామాజికంగా, రాజకీయంగా బలంగా ఉన్న కులాలు ఎటువంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా, చట్టాలు తమను ఏమీ చేయలేవనే భావనను ఈ నిర్ణయం మరింత బలపరుస్తుంది. ఇప్పటికే రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని, చట్టాలను ఖాతరు చేయకుండా పోలీస్ వ్యవస్థను తమ రాజకీయ ప్రాబల్యానికి అనుకూలంగా ఉపయోగించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. దీనితో సామాన్యులకు న్యాయం జరిగే పరిస్థితులు ఉండడం లేదు. అధికారంలో ఉన్న వాళ్ళు చట్టాలకు అతీతం అనే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఈ రకంగా రాజకీయ అధికారాన్ని విచక్షణా రహితంగా వాడుకొని, రాజ్యాంగబద్ధ వ్యవస్థలైన పోలీసు, న్యాయ వ్యవస్థలను బలహీనపరచడం సమాజంలో అరాచకత్వం పెరగడానికి దోహదపడుతుంది. 

సెక్షన్-321 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం, క్రిమినల్ కేసులలో ప్రాసిక్యూషన్ను ఉపసంహరించుకునే అధికారం ఆయా పబ్లిక్ ప్రాసిక్యూటర్ లకు ఉంది. సాధారణంగా ప్రభుత్వం ప్రతిపాదించిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఆయా కేసుల ఉపసంహరణ చట్టానికి లోబడి ఉన్నట్లుగా నిర్ధారించుకుని ఆ ప్రతిపాదనను కోర్టుల ముందు పెట్టాలి. కోర్టులు కూడా ఒప్పుకున్న తర్వాతనే ఉపసంహరణ జరగాలి. అయితే ఈ విచక్షణాధికారాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడం ఇప్పుడు అన్ని రాష్ట్రాలలోనూ సాధారణమైపోయింది. ప్రభుత్వమే నియమించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ప్రభుత్వానికి వంత పాడడం తప్ప స్వతంత్రంగా వ్యవహరించలేరు. కోర్టులు కూడా ఈ విషయంలో స్వతంత్రంగా    వ్యవహరించకపోవడం చట్టబద్ధ పాలనకే ముప్పు.

అయితే రైతులు, అంగన్ వాడీ వర్కర్లు, మున్సిపల్, సఫాయి కార్మికులు, అసంఘటిత కార్మికులు, దళిత, బలహీన వర్గాలు తమ న్యాయమైన హక్కుల కోసం నిరసన తెలియజేసినప్పుడు నమోదైన కేసుల విషయంలో మాత్రం ఈ విచక్షణాధికారాన్ని ఉపయోగించరు.అలానే దళితులు, మైనారిటీలు బాధితులైన కేసులను త్వరితగతిని విచారించి ముద్దాయిలను శిక్షించేందుకు కూడా పాలక ప్రభుత్వాలు ఈ విచక్షణాధికారాన్ని ఉపయోగించుకోవు. 26 ఏళ్లుగా సాగుతోన్న వెంకటాయపాలెం శిరోముండనం కేసు దీనికి ఒక ఉదాహరణ మాత్రమే. ఆ కేసులో ప్రథమ ముద్దాయి తోట త్రిమూర్తులు పాలక పార్టీలో చేరి ఎమ్మెల్సి కూడా అయిన విషయం తెలిసిందే.

దళితుల స్థితి గతులలో ఎలాంటి మార్పుకూ ఉపయోగ పడనప్పటికీ, జిల్లా పేరు మార్పు అనే ఒక చిన్న డిమాండ్ ను సైతం దళితులు సంఘటితమై సాధించుకోవడం జీర్ణించుకోలేని ఇతర అన్ని కులాలలోని కుల దురహంకారులే ఈ విధ్వంసకర చర్యలకు కారణం. ఈ కేసులను నిష్పక్షపాతంగా విచారణ చేయాలని, తద్వారా సామాన్యులకు చట్టబద్ధ పాలనపై నమ్మకం కలిగించాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తోంది. లేదంటే చట్టబద్ధ వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగాను, సమాంతరంగాను ఆధిపత్య కులపెత్తందారులు పాలన కొనసాగించే పరిస్థితులు ఏర్పడతాయి.

మానవ హక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్
31 మార్చి 2023

Related Posts

Scroll to Top