మత్స్యకార సంపద మత్స్యకారులకే దక్కాలి

మత్స్యకార సంపద మత్స్యకారులకే దక్కాలని, వారు తరతరాలుగా వాడుకుంటున్న భూమి అన్యాక్రాంతం అవ్వడం అన్యాయమని వివిధ ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం లంక ఆఫ్ ఠానేలంక గ్రామంలో 08.02.2026 నాడు శ్రీ కోదండరామ మత్స్యకారుల సంఘం, మానవ హక్కుల వేదిక (HRF) సంయుక్తంగా ‘సంక్షోభంలో మత్స్యకారులు – పరిష్కార మార్గాలు’ అనే అంశం మీద సభ నిర్వహించాయి.

మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు వి. ఎస్. కృష్ణ మాట్లాడుతూ తీర ప్రాంతంలో కానీ, నదీ తీరంలో కానీ వనరులు మీద సహజ హక్కులు మత్స్యకారులకే దక్కుతాయని తెలిపారు. లంక ఆఫ్ ఠానేలంక లో స్థానిక మత్స్యకారుల భూమి సమస్య పై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని, అక్రమ ఆక్వా చెరువులని తొలగించాలని, ఆ భూములని మత్స్యకారులకు దక్కేలా అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

లంక ఆఫ్ ఠానేలంకలో పెరుగు లంక భూములు ప్రైవేటు భూములు ఎలా అయ్యాయి అని, అక్కడ చట్టవిరుద్ధంగా రొయ్యల చెరువులు ఎలా తవ్వుతున్నారని ప్రశ్నిస్తూ, ఈ అక్రమాలకు తక్షణమే అడ్డుకట్ట వేసి, ఆ భూములని మత్స్యకారులకు అందుబాటులో ఉంచాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి జి. రోహిత్ అన్నారు.

దళిత బహుజన మహిళా శక్తి కన్వీనర్ కె. రాజమణి మాట్లాడుతూ న్యాయస్థానం ద్వారా ఈ విషయంలో న్యాయం పొందే విధంగా మత్స్యకారులు కదలాలని పిలుపునిచ్చారు.

సిపిఎం జిల్లా కార్యదర్శి కారెం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మత్స్యకారులు సంఘటితంగా తమ హక్కులు కోసం ఉద్యమించాలని తెలిపారు. వారి పోరాటానికి తాము మద్దతుగా ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని శ్రీ కోదండరామ మత్స్యకారుల సంఘం అధ్యక్షులు చింతా శ్రీను నిర్వహించారు. అలాగే, ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ. రవి, జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యాల శ్రీనివాసరావు, పిన్నింటి పవన్, డిటిఎఫ్ డబల్యూ ఎఫ్ అధ్యక్ష , కార్యదర్శులు దోమ ఆదినారాయణ, చింతా శ్రీను, పి డి ఎస్ యూ నాయకులు రేవు తిరుపతి రావు, పౌర హక్కుల సంఘం నాయకులు కె. బాబురావు, ఆర్ పి ఐ నాయకులు శరత్, పేరుపాలెం మత్స్యకార నాయకులు తిరుమాణి శ్రీనివాసరావు, తిరుమాణి సత్యనారాయణ, గ్రామస్తులు పాల్గొన్నారు.

ముమ్మిడివరం,
08.02.2026

ముత్యాల శ్రీనివాస రావు
9553200201

Related Posts

Scroll to Top