ఈనెల 22వ తేదీ నుండి 43,000 మంది తెలంగాణ ఆర్టీసీ కార్మికులు నిరోధికంగా సమ్మె చేస్తున్న నేపథ్యంలో, ఈరోజు మానవ హక్కుల వేదిక బృందం కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ డిపో కార్మికులు నిర్వహించిన ఊరేగింపులో పాల్గొని, అనంతరం డిపోలో తిరిగి సమావేశమైన కార్మికులను ఉద్దేశించి మాట్లాడి తన మద్దతును తెలియజేసింది.
తక్కువ వేతనం, ఉద్యోగ అభధ్రతల మధ్య కార్మికులతో పని చేయిస్తూ, ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను మానసిక శారీరక ఒత్తిడికి గురి చేస్తున్నది. కార్మికుల ఉమ్మడి శ్రమ, అంకితభావాలతో వచ్చే మంచి ఫలితాలను ప్రభుత్వం తన గొప్పగా చెప్పుకుంటూ, సంస్థ ఆర్థిక నష్టాలకు కార్మికులే బాధ్యులన్నట్టు ప్రవర్తిస్తున్నది. నిజానికి సంస్థ ప్రయాణికులకు అందించే సమయ పాలన, రోడ్డు భద్రత, మహిళల భద్రత వంటి గొప్ప సేవలు కార్మికుల శ్రమా, నిజాయితీల ఫలితాలు. సంస్థ ఆర్థిక నష్టాలకు ప్రభుత్వాలు ప్రయాణికులకు అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలకు తగిన సమయంలో సంస్థకు డబ్బులు చెల్లించకపోవడం, బస్సులను ఆధునికరించకపోవడం అసలు కారణాలు.
2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, వారి పాలనా కాలం సగం పూర్తయినా, అమలు ప్రారంభం కాకపోవటం కార్మికులను ఆందోళనకు గురిచేసే విషయం.
ఈ నేపథ్యంలో జరిగే వారి సమ్మె ప్రజాస్వామ్య బద్ధమైనది. వారి డిమాండ్లు న్యాయమైనవి. ప్రభుత్వం వెంటనే వారితో మాట్లాడి సంస్థ పరిరక్షణకు, కార్మికుల హక్కులకూ, సంక్షేమానికీ కట్టుబడి తన విధానాల్ని రూపొందించడమే కాకుండా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి.
అలా కాకుండా, దాటవేత విధానాల్ని, అణచివేత విధానాల్ని అవలంబించడం ప్రజాస్వామ్య విధానాలు కావు. ఎన్నికల్లో లబ్ధి పొంది, ఎన్నికల హామీలను అమలు పర్చాల్సిన అవసరం లేదన్నట్టు వ్యవహరించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల స్ఫూర్తికే విరుద్ధం. కాబట్టి ప్రభుత్వం వెంటనే, కార్మిక నాయకులతో మాట్లాడి, వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి, ఆందోళనను విరమింప చేయాలి.
కార్మికులు కూడా క్షణికావేశంలో ఉద్యమ సమయంలో ఆత్మ బలిదానాల విధానాన్ని మానుకోవాలి. ఏ సమస్యనైనా తక్షణ పరిష్కారాలు, దీర్ఘకాలిక పరిష్కారాల నేపథ్యంలో చూస్తూ సమిష్టిగా ఎదుర్కోవాలి. ఆత్మబలిదానాల్లో ఎంత నిజాయితీ ఉన్నా , అవి ఎవరూ కోరుకోదగ్గ పోరాటరూపాలు కావు, కాకూడదు. ఓపికతో కూడిన సమిష్టి పోరాటమే అన్నిటికీ పరిష్కారం.
కార్మికులతో ఊరేగింపులో పాల్గొని, ఉద్యమ శిబిరాన్ని సందర్శించిన మానవ హక్కుల వేదిక బృందంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ తిరుపతయ్య , కరీంనగర్ జిల్లా మానవ హక్కుల వేదిక నాయకులు గోశిక మధు, ఎస్. అచ్యుత్ కుమార్, ఇంజం చైతన్య లు ఉన్నారు.
డాక్టర్ ఎస్.తిరుపతయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
హుజురాబాద్,
24.04.2026.