లక్కవరం కనుమల దొడ్డి ప్రాంతంలో అక్రమ ఆక్వా చెరువుల సాగుతో ఇబ్బంది పడుతున్న వ్యవసాయదారులు

ఈ విషయమై ఈరోజు, అనగా 31.05.2026 నాడు, నలుగురు సభ్యుల మానవ హక్కుల వేదిక (HRF) బృందం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరం గ్రామంలో నిజ నిర్ధారణ చేపట్టింది. స్థానిక రైతులను కలిసి విషయ సేకరణ చేసింది.

ఈ ప్రాంతంలో 15 ఎకరాల మేరకు ఎటువంటి అనుమతులు లేని అక్రమ ఆక్వా సాగు గత ఐదేళ్లుగా కొనసాగుతోంది. దీనితో చుట్టుపక్కల ఉన్న 85 ఎకరాల వరి, కొబ్బరి తోటల వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింది. గతంలో దాల్వా, సార్వ కలిపి ఎకరాకు 80 బస్తాలు వచ్చే దిగుబడి ఇప్పుడు 20 బస్తాలకు పడిపోయిందని రైతులు వాపోయారు. అపరాలు పంట వేసుకునే పరిస్థితి లేదని, కొబ్బరి చెట్లు దిగుబడి తగ్గిపోయిందని వారన్నారు. ఆక్వా రైతులు కలుషిత వ్యర్ధాలను స్లడ్జ్తో కలిపి పంట బోదులలోనూ, మురికి కాలువలలోను వదిలిపెట్టేయడంతో తమ పొలాల్లోని నీరు దిగే అవకాశం లేక మొల లోతు వరకు నీరు నిలబడి పోతోందని, దీంతో ఎరువుల పిచికారికి డ్రోన్లను ఉపయోగించవలసి వస్తోందని, దానితో వ్యవసాయ ఖర్చులు పెరిగిపోయి గిట్టుబాటు కావడం లేదని వారు అన్నారు.

ఆక్వా సాగుకు కావలసిన ఉప్పునీటి కోసం 400 అడుగుల లోతు వరకు బోర్లు వేయడం వాల్టా చట్టానికి వ్యతిరేకం

అనుమతులు లేని ఆక్వా చెరువులను నిలుపుదల చేయాలి. స్థానిక రైతులకు న్యాయం చేయాలి.

ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యేడిద రాజేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ. రవి, జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యాల శ్రీనివాసరావు, చెవ్వాకుల వెంకట్, రైతులు సాధనాల నరసింహమూర్తి, గడ్డం నాగేశ్వరరావు, అని శెట్టి ప్రకాశరావు, అప్పారి కేశవరావు, చెల్లింగి శ్రీనివాసరావు, ఎల్లమెల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మలికిపురం,
31.05.2026

Related Posts

Scroll to Top