విశాఖ ఉక్కు కర్మాగారంలో జూన్ 8, 2026న జరిగిన పేలుడు మరోసారి పారిశ్రామిక భద్రత, యాజమాన్య వైఫల్యాలు, కేంద్ర-రాష్త్ర ప్రభుత్వాల విధానాలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రతి ప్రమాదం జరిగిన తర్వాత దానిని ఒక “దురదృష్టకర సంఘటన”గా చిత్రీకరించడం సులభమే. కానీ, వరుసగా జరుగుతున్న ప్రమాదాలను పరిశీలిస్తే అవి కేవలం ప్రమాదాలు కావు, యాజమాన్య నిర్లక్ష్యం, సిబ్బంది కొరత, నిర్వహణ లోపాలు, ఖర్చు తగ్గింపు పేరుతో చేపడుతున్న విధ్వంసకర చర్యల ఫలితమని మానవ హక్కుల వేదిక (HRF) భావిస్తుంది.
ఈ ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం ప్రకారం ద్రవ ఉక్కు ప్రక్రియలో ఉపయోగించే కొన్ని ఎడిటివ్స్లో నాణ్యత లోపాల కారణంగా రసాయనిక ప్రతిచర్య జరిగి పేలుడు సంభవించి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పూర్తి స్థాయి సాంకేతిక విచారణ అవసరం. అయితే ఈ ఒక్క అంశాన్నే కారణంగా చూపి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న వ్యవస్థీకృత సమస్యలను పక్కన పెట్టడం సరైంది కాదు.
గత కొన్నేళ్లుగా విశాఖ ఉక్కు కర్మాగారంలో నిర్వహణ వ్యవస్థ తీవ్రంగా బలహీనపడింది. ముఖ్యంగా మాజీ సీఎండీ సక్సేనా కాలంలో దశాబ్దాల అనుభవం కలిగిన ఉద్యోగులను వారి విభాగాల నుండి ఇతర విభాగాలకు బదిలీ చేయడం జరిగింది. అదే సమయంలో ఆయా విభాగాల్లో అనుభవం లేని సిబ్బందిని నియమించారు. ఉద్యోగులపై కక్షపూరితంగా వ్యవహరించిన తీరు వలన పరిశ్రమకు ఎంతో నష్టం జరిగింది. అనుభవజ్ఞులైన, నిజాయితీపరులైన కొందరు అధికారులను సస్పెండ్ చేసి, వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసారు. భారీ పరిశ్రమల్లో అనుభవం అనేది భద్రతకు ప్రాణాధారం. దశాబ్దాలుగా ఒక యంత్రాంగాన్ని నిర్వహించిన ఉద్యోగి స్థానంలో కొత్త వ్యక్తిని పెట్టడం వల్ల ఉత్పత్తి మాత్రమే కాదు, భద్రత కూడా ప్రమాదంలో పడుతుంది. భద్రత అంటే కేవలం హెల్మెటు, షూస్ మాత్రమే కాదు. విడిభాగాల (స్పేర్ పార్ట్స్) నాణ్యత, ఇతర ప్రమాణాలు ఎన్నో విశాఖ ఉక్కు వంటి భారీ కర్మాగారాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఇంకా ఆందోళనకర విషయం ఏమిటంటే, గత నాలుగేళ్లుగా అవసరమైన స్పేర్ పార్ట్స్ కొనుగోలు దాదాపు నిలిచిపోయిందని ఉద్యోగులు చెబుతున్నారు. ఉక్కు పరిశ్రమ వంటి నిరంతర ప్రక్రియల పరిశ్రమలో యంత్రాల నిర్వహణ, విడిభాగాల మార్పిడి అత్యంత కీలకం. వాటిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదాలు అనివార్యమవుతాయి.
మరో తీవ్రమైన సమస్య సిబ్బంది కొరత. దేశంలోని ఇతర సమీకృత ఉక్కు కర్మాగారాల్లో ఒక టన్ను ఉక్కు ఉత్పత్తికి సగటున నలుగురు ఉద్యోగులు పనిచేస్తుండగా, విశాఖ ఉక్కులో అది కేవలం 1.25 మందికి మాత్రమే పరిమితమైందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. అంటే, మిగతా కర్మాగారాలతో పోలిస్తే చాలా తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ పని చేయిస్తున్నారు. దీనివల్ల కార్మికులపై అసహజమైన పని ఒత్తిడి పెరుగుతోంది. పని ఒత్తిడితో పాటు ఉద్యోగుల సంక్షేమ చర్యలను కూడా క్రమంగా తగ్గించారు. ప్లాంట్లో ఉన్న క్యాంటీన్లను మూసివేయడం, ఎనిమిది గంటలకు పైగా కొనసాగే షిఫ్టుల్లో కనీసం టీ కూడా అందుబాటులో లేకపోవడం వంటి పరిస్థితులు కార్మికుల శారీరక, మానసిక సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అలసట, ఒత్తిడి, తొందరపాటు వాతావరణం పారిశ్రామిక ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడ్డాయి.
అయితే, ఈ పరిస్థితులకు బాధ్యులైన పాలకులు, యాజమాన్యాలు తమ వైఫల్యాలను అంగీకరించకుండా ఉద్యోగులపైనే నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కార్మికులను “గోస్ట్ ఉద్యోగులు”, “పని చేయకుండా జీతాలు తీసుకునేవారు” అన్న అధికార పార్టీ ప్రతినిధుల వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించదగ్గవి. మండే కొలిమిల మధ్య, వేల డిగ్రీల ఉష్ణోగ్రతల్లో, ప్రాణాలను పణంగా పెట్టి పని చేసే ఉక్కు కార్మికులను అవమానించడం అంటే వారి శ్రమను, వారి త్యాగాన్ని అవమానించడమే. ఉక్కు కర్మాగారంలో ప్రతి టన్ను ఉక్కు వెనుక వేలాది కార్మికుల చెమట, కష్టం, ఆరోగ్యం, కొన్నిసార్లు ప్రాణాలే ఉంటాయి. ఆ శ్రమను గౌరవించడం ప్రభుత్వాల కనీస బాధ్యత.
విశాఖ ఉక్కులో జరుగుతున్న ప్రమాదాలు వ్యక్తిగత తప్పిదాల ఫలితం కావు. అవి కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలు, ఖర్చు తగ్గింపు పేరుతో సిబ్బంది కోతలు, నిర్వహణ నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాల క్షీణతల ఫలితాలు. అందువల్ల, తాజా ప్రమాదంపై హైపవర్ స్వతంత్ర విచారణ జరిపి అసలు కారణాలను ప్రజలకు వెల్లడించాలి. మరణించిన, గాయపడిన కార్మికులకు న్యాయం చేయాలి. ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. అవసరమైన స్పేర్ పార్ట్స్, భద్రతా పరికరాల కొనుగోళ్లను చేపట్టాలి. కార్మిక సంక్షేమ సదుపాయాలను పునరుద్ధరించాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది. జూన్ 13, 2012న స్టీల్ ప్లాంట్ ఆక్సిజన్ విభాగంలో జరిగిన పేలుడులో 19 మంది చనిపోయారు . అప్పుడు నియమించిన ఎస్.కె. జైన్ విచారణ కమిటీ రిపోర్టును ఇప్పటికీ బయట పెట్టలేదు. ఇప్పుడైనా పారదర్శకంగా విచారణ జరపాలి.
విశాఖ ఉక్కు కేవలం ఒక పరిశ్రమ కాదు. అది వేలాది కుటుంబాల జీవనాధారం, ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల పోరాట ఫలితం. ఈ కర్మాగారాన్ని కాపాడటం అంటే కేవలం ఉక్కును కాదు, కార్మికుల ప్రాణాలను, గౌరవాన్ని, భవిష్యత్తును కాపాడటం.
ఎం. శరత్ – మానవ హక్కుల వేదిక AP రాష్ట్ర ఉపాధ్యక్షులు
కె. అనురాధ – మానవ హక్కుల వేదిక విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి
9-6-2026,
విశాఖపట్నం.