జూన్ 20 నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామపంచాయతీ పరిధిలోని కోసగుంపు గుత్తికోయ గూడెం పై అటవీ అధికారులు దాడి చేసిన సంఘటనపై నిజనిర్ధారణ కోసం మానవ హక్కుల వేదిక రాష్ట్ర శాఖ మరియు ఖమ్మం జిల్లా శాఖల ఆరుగురు సభ్యుల బృందం (రాష్ట్ర ఉపాధ్యక్షులు బదవత్ రాజు, ఖాదర్ బాబా, మరియు ఆదినారాయణ, దిలీప్,రమేష్, ముక్తేశ్వర రావు) జులై 7 ఆదివారం నాడు ఆ బాధితులను కోసగుంపు లో కలిసి వివరాలు సేకరించడం జరిగింది.
ముప్పై సంవత్సరాల క్రితం కుంజ లక్ష్మయ్య కోసగుంపు గ్రామాన్ని నెలకొల్పడం జరిగింది. ఈ గ్రామంలో ప్రస్తుతం 34కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. వీరు గత ముప్పై సంవత్సరాలుగా పోడు చేసుకుంటున్న భూముల్లోకి అటవీ అధికారులు ఉన్నపళంగా వచ్చి విత్తనాలు నాటుతున్న మహిళలపై దాడి చేయడమే కాకుండా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దుర్భాషలాడుతూ వారిపై అత్యాచార యత్నం చేయబోయారు. ఇది గమనించిన మహిళలు పెద్దగా కేకలు వేయడంతో గూడెంలోని ఇతర మహిళలు, పురుషులు రావడం జరిగింది. ఈ సందర్భంలో అటవీ అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే వారు సాగుచేస్తున్న భూముల మధ్య నుండి కందకాలు తీయడానికి జేసిబి లను తీసుకు వచ్చి కందకాలు తీయడానికి ప్రయత్నం చేయగా ఎందుకు కందకాలు తీస్తున్నారని ప్రశ్నించిన మహిళలను జుట్టుపట్టి ఈడ్చుకుంటూ ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరిగినది. ఈ సందర్భంలో పలువురు మహిళల వస్త్రాలు చించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్క మహిళా అధికారి కూడా లేకపోవడం శోచనీయం. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వార్త చానల్లో ప్రసారం అయినవి.
ఈ దాడికి పాల్పడిన అటవీ అధికారులైన నాగరాజు, రాంబాబు, బాబురావు తదితర అధికారులు దాడికి కొద్ది రోజుల ముందు గ్రామస్థుల నుండి ఒక్కో కుటుంబం నుండి రెండు వేల చొప్పున వసూలు చేసి, ఆదివాసుల చేత విందు ఏర్పాటు చేయించుకున్నారు.ఇట్లా అనేకమార్లు అటవీ అధికారులు అమాయక ఆదివాసుల నుండి పలుమార్లు బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని కోసగుంపు బాధితులు మానవ హక్కుల వేదిక నిజనిర్ధారణ బృందం ముందు తమ గోడును విన్నవించుకున్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే ఆదివాసీ మహిళలు చిరిగిన దుస్తులతోనే తమకు జరిగిన అన్యాయం గురించి అటవీ అధికారులపై పిర్యాదు చేయడానికి వెళ్తే అవహేళనగా మాట్లాడి వారి పిర్యాదును స్వీకరించకపోగా, మిమ్మల్ని ఎవరు కొట్టలేదు అని దబాయించి వారిని పంపించడం జరిగింది. ఆ తర్వాత జూన్ 26 నాడు వచ్చిన రెవెన్యూ, అటవీ అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధుల బృందం ఆదివాసీ ప్రజల చేత తెల్లకాగితలపై సంతకాలు తీసుకుని మమ్మల్ని ఎవరు వేధించలేదని,మేము పాత పోడునే చేసుకుంటామని, వచ్చిన అటవీ అధికారులు మాపై ఎటువంటి దాడి చేయలేదు, కేవలం వారి విధినిర్వహణలో భాగంగానే వచ్చిపోయారని మోసపూరిత తీర్మానం చేసినట్లుగా మా బృందం దృష్టికి తీసుకువచ్చారు.
అధికారులే ఈ రకంగా తప్పుడు తీర్మానాలు చేయడం అదికూడా అక్షర ఙ్ఞానం తెలియని దాడికి గురైన ఆదివాసీలపై వారికి తెలుపకుండానే ఇటువంటి చర్యలను మానవ హక్కుల వేదిక తీవ్రంగా ఖండిస్తున్నది. పై అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ మొత్తం సంఘటనలో అధికారులే తప్పుడు తీర్మానాలు చేస్తూ ఆదివాసీలకు అన్యాయం చేస్తున్న సందర్భంలో దీనిపై జ్యుడిషియరీ విచారణ చేసి ఆదివాసీలకు న్యాయం చెయ్యాలని మానవ హక్కుల వేదిక ప్రధానంగా డిమాండ్ చేస్తుంది.
డిమాండ్స్:
- 13 డిసెంబర్2005 కంటే ముందు పోడు సాగు చేసుకుంటున్న వారందరికీ పట్టాలివ్వాలి.
- ఆదివాసీ మహిళలపై దాడిచేసి,అత్యాచార యత్నం చేసిన అటవీ అధికారి నాగరాజు పై ఎస్సీ,ఎస్టీ అత్యాచార చట్టం కింద కేసు నమోదు చెయ్యాలి.
- ఆదివాసీ మహిళలపై జరిగిన దాడికి బాధ్యులైన అందరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
- ఈ మొత్తం సంఘటపైన జ్యుడిషియరీ ఎంక్వైరీ చేసి బాధిత ఆదివాసీలకు న్యాయం చెయ్యాలి.
- ఇరవెండి కోసగుంపు లో అంగన్వాడీ కేంద్రం, విద్యా,వైద్యం,తాగునీటి సరఫరాతో పాటు మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలి.
- ఆదివాసీ ప్రజా ప్రతినిధులు (ఎమ్మెల్యే, మంత్రులు) ఇప్పటివరకు స్పందించకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా వారు స్పందించి ప్రభుత్వంతో మాట్లాడి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేలా చూడాలి.
ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు బదవత్ రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖాదర్ బాబా, ఖమ్మం జిల్లా అధ్యక్షులు దాగం ఆదినారాయణ, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దిలీప్.వి, సభ్యులు రమేష్ బండారి, ఊకె ముక్తేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
06-07-2025,
బూర్గంపాడు.