ఎల్లమ్మ బస్తీ నివాసులకు న్యాయం చెయ్యాలి

కుత్బుల్లాపూర్ మండలం చింతల్ చెరువుని ఆనుకొని ఉన్న దేవేంద్రనగర్ ఎల్లమ్మ బస్తీలో ‘హైడ్రా’ అధికారులు పోలీసుల సహాయంతో ఆగస్టు 6, 2024 పొద్దున 50 కి పైగా ఇళ్ళను అక్రమ కట్టడాలనే నెపంతో కూల్చారు. ఈ విషయం మీద మానవ హక్కుల వేదిక బృందం ఆగస్టు 10 న నిజ నిర్ధారణ జరిపింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

దేవేంద్రనగర్ లో 50 కి పైగా ఇళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ఒకటి రెండు చిన్న గదులు ఉన్న రేకుల ఇళ్ళు. వీరంతా గత రెండు, మూడు సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తున్నారు. ఈ ఇండ్లను స్థానిక రియల్ ఎస్టేట్ వ్యక్తి వద్ద కొనుగోలు చేసినట్టు తెలుస్తున్నది. వీళ్లకు ప్రభుత్వం నుండి ఎలాంటి సంక్షేమ పథకాలు అందట్లేదు. అన్ని వసతులు వీళ్ళు సమకూర్చుకున్నవే. ఇక్కడ నివాసం ఉంటున్న అత్యధికులు రోజుకూలీలే. ఆటో, రాపిడో, GHMC స్వచ్ఛ ఆటోలు నడుపుకుంటూ ఉంటారు. వీరిలో ఎక్కువమంది స్థానికులే. ఒక 20 కుటుంబాల వరకు జి.హెచ్.ఎం.సి లో చెత్త ఎత్తే వాళ్ళు ఉన్నారు. వీరు మాత్రం అనంతపురం, కర్నూలు నుండి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. అయితే ఆగస్టు 6 ఉదయం 9 గంటల ప్రాంతంలో జి.హెచ్.ఎం.సి అధికారులు హైడ్రా (Hyderabad Disaster Response and Assets Monitoring and Protection) సహకారంతో కరెంటు తీగలను కట్ చేసి, జేసీబీలతో ఇండ్లను కూల్చారు. అడ్డం వచ్చిన వారి పైన లాఠీలు ఝుళిపించారు. గత మూడు సంవత్సరాలుగా నివసిస్తున్నా కూడా బాధితులకు ఎన్నడూ ఖాళీ చేయమని నోటీసు ఇవ్వలేదు, జేసీబీలతో ఇళ్ళు కూల్చే సమయానికి చాలామంది అక్కడ లేరు, ఉన్నవారికి కూడా ఇంట్లో సామాన్లు తీసుకునే సమయం ఇవ్వలేదు. కనీసం ఆధార్ కార్డు, ఓటర్ ఐడి వంటి ముఖ్యమైన పత్రాలను కూడా తీసుకోనివ్వలేదు.

గతంలో ‘హైడ్రా’ లేదు, DRF (డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) పేరుతో ఒక సంస్థ ఉండేది. వర్షాకాలంలో బాధితులకు సహాయంగా ఉంటూ, మిగతా కాలాల్లో పౌరులకు అవసరమైన ఇతరత్రా సహాయం చేస్తుండేది. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ భూముల్ని కాపాడే బాధ్యత ఇస్తూ, దాని పేరును ‘హైడ్రా’గా మార్చింది. ఈ సంస్థ జి.హెచ్.ఎం.సి తో పాటు వాటర్ బోర్డు, విజిలెన్సు, ట్రాఫిక్, ఎనర్జీ మరియు పోలీస్ విభాగాలతో కలిసి పని చేస్తుంది. ఇది ప్రభుత్వ ఆస్తుల, చెరువుల, నాలాల కబ్జాల మీద, అక్రమ నిర్మాణాల మీద ఉక్కుపాదం మోపడానికి ఉద్దేశించిన సంస్థ. దీని అధికారాన్ని హైదరాబాద్ కే పరిమితం చేయకుండా దాదాపు 200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఓ.అర్.అర్ వరకు విస్తరించాలని ఆలోచిస్తున్నారు. సాధారణంగా రెవెన్యూ అధికారులు చేస్తూ వచ్చిన పనిని వీరికి అప్పగించారు. కొత్తగా రూపుదిద్దుకున్నప్పటికీ ఈ సంస్థ పాత పద్ధతులను మార్చుకోలేదు. ఏదన్నా కట్టడం కూల్చేటపుడు అందులో నివాసం ఉంటున్న వారికి ముందుగా నోటీసులు ఇవ్వాలి, ఇంట్లో సామాన్లను బయటికి తీసుకువెళ్ళే సమయం ఇవ్వాలి, నిరసన తెలుపుతున్న ప్రజల వాదన విని, వారు చూపించే డాక్యుమెంట్లను పరిశీలించాలి. ఇలాంటివి ఏవీ చేయకుండా లాఠీలు ప్రయోగించే పాత దౌర్జన్య పద్ధతులనే ఎంచుకున్నారు.

ఇవి అక్రమ కట్టడాలు అని గుర్తించి కూలగొట్టడమొక్కటేనా ప్రభుత్వం చేయాల్సిన పని? ఆ ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి, వారికి పునరావాసం ఎక్కడ కల్పించాలి అన్న విషయం కూడా ఆలోచించవద్దా! వారేమీ సంపన్నులు కాదు కదా, పొట్ట కూటి కోసం పని చేసుకుంటున్న పేద జనం. సాధారణంగా ఇటువంటి బలవంతపు తొలగింపులు బస్తీలలో జరిగినపుడు మండల రెవిన్యూ అధికారి ప్రజలను శాంతపరిచే ప్రయత్నంగా దగ్గర్లో ఉన్న కమ్యూనిటీ హాల్ లో తాత్కాలికంగా ఉండే ఏర్పాటు, భోజన సదుపాయాలు మొదలైనవి చేస్తారు. ఈ సంఘటనలో మాత్రం అటువంటి ప్రయత్నాలు ఏమీ జరగలేదు. ఇళ్ళు కూల్చేసిన తరువాత పెద్ద వర్షం పడింది, ఆ వర్షంలో ఎక్కడికి పోవాలో, ఎక్కడ ఉండాలో కూడా వారికి దిక్కు తెలియలేదు. జి.హెచ్.ఎం.సి లో పని చేస్తున్న వాళ్ళు అయితే మాకు ఉండడానికి అద్దెకు కూడా ఇళ్ళు ఎవరూ ఇవ్వట్లేదు అని, మా చెత్త బండిని చూసి మమ్మల్ని ఎవరూ దగ్గరకు రానివట్లేదు అని, వాళ్ళ ఇంట్లో చెత్త ఎత్తేది కూడా మేమే కాని మాకు ఉండడానికి ఇల్లు లేకుండా చేసారు అని బాధపడ్డారు. ఈ ప్రాంతంలో ఉండమని చెప్పిన వ్యక్తి , ప్రస్తుతం వీరికి బియ్యం కూరగాయలు ఇస్తున్నాడు. ఈ ప్రాంతానికి ఒక కిలోమీటర్ దూరంలో ప్రభుత్వం నిర్మించిన ఇంకా పూర్తిగా హ్యాండోవర్ కు నోచుకోని డబల్ బెడ్ రూం ఇళ్ళు ఉన్నాయి. నివాస హక్కు కూడా ప్రాథమిక హక్కే అని ప్రభుత్వానికి గుర్తుచేస్తున్నాం. ఇంత జరిగినా వీరిని ఆదుకోవడానికి ఒక ప్రభుత్వ అధికారి కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ రాలేదు.

మా డిమాండ్లు:

  • దేవేంద్రనగర్ నివాసులకు డబల్ బెడ్ రూం ఇళ్ళు కేటాయించాలి.
  • ఈ లోగా వారికి తాత్కాలిక వసతి ఏర్పాటు చేయాలి, రేషన్ అందించాలి.
  • నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలి.
  • అర్హులకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలి.
  • నోటీసు ఇవ్వకుండా ఇళ్ళు కూలగొట్టించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలి

సంజీవ్,
హైదరాబాద్ నగర ప్రధాన కార్యదర్శి.

రోహిత్,
హైదరాబాద్ నగర కార్యదర్శి.

12.08.2024,
హైదరాబాద్.

Related Posts

Scroll to Top