ఆరోర్ ఫార్మాసిటికల్స్ కంపెనీలో సంభవించిన ప్రమాదం మీద ప్రాథమిక నివేదికను విడుదల చేయాలి

నవంబర్ 20వ తారీఖు ఆరోర్ ఫార్మసిటికల్ కంపెనీలో రియాక్టర్ పేలి మంటలు చెలరేగినట్టు పత్రికల్లో వార్త వచ్చింది. ఈ వార్త ఆధారంగా సైంటిస్ట్ ఫర్ పీపుల్ మరియు మానవ హక్కుల వేదిక 23 వ తారీఖున నిజ నిర్థారణ జరిపింది.

హైదరాబాద్ సూరారం లోని ఆరోర్ ఫార్మసిటికల్స్ కంపెనీలో ఫార్మకి సంబంధించిన మందులు తయారు చేస్తూ ఉంటారు. నవంబర్ 20వ తారీకు పొద్దున 10 గంటల సమయంలో రియాక్టర్ ని క్లీన్ చేస్తూ ఉండగా పేలుడు సంభవించి నలుగురు కార్మికులకు గాయాలు అయ్యాయి. అనిల్ కుమార్ (42), బలరాం (51), గోపీచంద్ (30), శ్రీనివాస్ రెడ్డి (46). ఇందులో అనిల్ కుమార్ అక్కడికి అక్కడే మృతి చెందాడు, మిగితా ముగ్గుర్ని హాస్పిటల్ కి తరలించగా మూడు రోజుల తరువాత బలరాం మృతి చెందినట్టు తెలిసింది . మిగితా ఇద్దరికీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు, కోలుకోవడానికి రెండు మూడు నెలలు అయినా పట్టొచ్చు. గోపీచంద్ కి పొట్ట నుండి పై భాగం వరకు శరీరం కాలిపోయింది. శ్రీనివాస్ రెడ్డి శరీరానికి 30% గాయాలు అయ్యాయి. గోపీచంద్ కెమిస్ట్ మరియు ఫుల్ టైం ఎంప్లాయ్, మిగితా ముగ్గురు హెల్పర్స్, కాంట్రాక్టు వర్కర్స్.

సంఘటన జరిగిన వెంటనే ప్రాథమిక చికిత్స ఏమి అందించనట్టుగా తెలుస్తుంది. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడిన వాళ్ళను వెంటనే షవర్ కిందకు తీసుకెళ్లి నీళ్ళతో శరీరమంతా తడపాలి. ఇలాంటి భద్రత ప్రమాణాలు ఏవి ఫ్యాక్టరీ లో ఉన్నట్టు కానీ, యాజమాన్యం పాటించినట్లు కానీ అనిపించట్లేదు. ఈ ఘటనకు సంబంధించి అదే ఫ్యాక్టరీ లో పని చేసే ఇతర వర్కర్ల తోని మాట్లాడినప్పుడు భదత్ర ప్రమాణాలు ఏమి పాటించట్లేదు అని తెలిసింది. ఫ్యాక్టరీ లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు దగ్గర్లో ఉన్న ఫైర్ స్టేషన్కి సమాచారం అందించాలి. ఈ ఫ్యాక్టరీకి 500 మీటర్ల దూరంలో ఉన్న ఫైర్ స్టేషన్ కి ఎలాంటి సమాచారం రాలేదు అని, మధ్యాహ్నం రెండు గంటల సమయంలో విలేకరుల ద్వారా తెలిసింది అని సంబంధిత అగ్నిమాపక అధికారి శేఖర్ రెడ్డి గారు తెలిపారు. సూరారం సి.ఐ. భరత్ గారు తమకు ఈ విషయం ఫ్యాక్టరీ యాజమాన్యం ద్వారా తెలిసింది అని, తాము ఫ్యాక్టరీ కి వెళ్లే లోపే గాయ పడిన వాళ్ళని హాస్పిటల్ కి తరలించారని, అయితే ఫ్యాక్టరీ కి సంబంధించిన విషయం కాబట్టి ఈ సంఘటన మీద ఇన్స్పెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్ వాళ్ళ నివేదిక ఆధారంగా కేసు పురోగమిస్తోంది అని, బి.ఎన్.ఎస్ 106 (నెగ్లిజెన్స్) కింద కేసు నమోదు చేసామని తెలిపారు. డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్ కంపెనీ యాజమాన్యాన్ని మరియు బాధితులను కలిశారు, విచారణ చేపడుతున్నారు. ప్రాథమిక నివేదిక బయటికి రావలసి ఉంది. బాధిత కుటుంబాలు, ఫ్యాక్టరీ లో పని చేసే ఇతర హెల్పర్స్ తోని మాట్లాడిన మాకు ఈ కింది విషయాలు అర్థం అయ్యాయి.

నవంబర్ 20 న ఉదయం ఎప్పటి లాగే షిఫ్ట్ లోకి దిగిన నలుగురు, రియాక్టర్ క్లీన్ చేయడానికి వెళ్లారు. బలరాం మరియి అనిల్ టౌలిన్ అనే కెమికల్ ని రియాక్టర్ లో పోసినప్పుడు మంటలు చెలరేగాయి. ఆ మంటలు దానికి దగ్గర్లో ఉన్న ఈ ఇద్దరి మీద పడి మరణానికి కారణమయ్యాయి. కొంత దూరం లో ఉన్న గోపి, శ్రీనివాస్ లు గాయాలతో బయట పడ్డారు. టౌలిన్ బకెట్ల ద్వారా రియాక్టర్ లో పోసినట్టు తెలిసింది. నిజానికి టౌలిన్ కి మంటలు పుట్టించే స్వభావం ఉండదు, అయితే టౌలిన్ తో ఇంకా వేరే కెమికల్ ఏదన్నా కలిపారా లేదా ఎక్కడన్నా నిప్పురవ్వలు పుట్టాయా అన్న విషయాలు తేలాల్సి ఉంది. రియాక్టర్ క్లీనింగ్ కు సంబందించిన భద్రతా ప్రమాణాలు ఫ్యాక్టరీ వాళ్ళు పాటించలేదు. స్కిల్ల్డ్ వర్కర్స్ తోని చేయించాల్సిన పనిని నార్మల్ హెల్పర్స్ తోని చేయించారు. మంటలు వచ్చినపుడు, ఆ మంటలు బయటికి పొక్కకుండా డోర్ ఆటో లాక్ సిస్టం ఉన్నది. కానీ వీళ్ళు ఆ రియాక్టర్ ఉన్న రూమ్ డోర్ ఆటో లాక్ కాకుండా పేపర్లు అడ్డు పెట్టినట్టు, దాని వల్లనే డోర్ బయటికి ఇద్దరు వచ్చి, ప్రమాదం నుండి గాయాలతో బయట పడ్డట్టు తెలిసింది. ఈ టెక్నాలజీ మీద స్పష్టత కోసం ఇంకొంత పరిశోధన చేయాల్సి ఉంది. గోపి తానంతట తానే బయటికి వచ్చి షవర్ కింద కూర్చున్నాడు. ప్రమాదంలో మరణించిన అనిల్ కుటుంబానికి 42 లక్షలు, బలరాం కుటుంబానికి 45 లక్షల రూపాయలు కంపెనీ యాజమాన్యం చెల్లించినట్లు తెలుస్తుంది. మిగితా ఇద్దరికి హాస్పటల్ లో వైద్యానికి అయ్యే ఖర్చులు కంపెనీనే భరిస్తునది.

ఇలాంటి సంఘటనలు జరిచినప్పుడు తమ ఫ్యాక్టరీ లో తప్పులను వదిలేసి వర్కర్ల మీదికి తప్పు తోసేసే ప్రయత్నమే ఆరోర్ ఫార్మసీ కంపెనీ కూడా చేస్తున్నది. 2023 సంవత్సరం మార్చ్ లో ఇదే ఫ్యాక్టరీ లో రియాక్టర్ పేలి ఇద్దరు మరణించారు. దానిమీద వివరాలు సేకరించే ప్రయత్నం చేసాము కానీ మాకు ఎలాంటి వివరాలు దొరకలేదు. బాధితులు స్థానికులు కాకపోవడం చేత ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఎలాంటి వివరాలు అందించలేదు. నవంబర్ 28, 2024 న ఇదే కంపెనీ కి చెందిన కాజిపల్లి ఫ్యాక్టరీ లో మంటలు రేగాయి. ఇలా వరుస ప్రమాదాలకు కారణం అవుతున్న ఫ్యాక్టరీ మీద విచారణ జరిపి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి. గత పది సంవత్సరాల్లో తెలంగాణ లోని ఫ్యాక్టరీలలో జరిగిన ప్రమాదాల వల్ల 92 మంది చనిపోయారు. ఈ సంఘటనలు జరిగినపుడు విచారణ జరిపి, నివేదిక అందించాల్సిన ఇన్స్పెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్ వాళ్ళు సకాలంలో చర్యలు తీసుకోవట్లేదు. అలాగే సుమోటో గా స్వీకరిస్తున్న ఎన్.జి.టి వాళ్ళు కూడా పర్యావరణానికి సంబందించిన విషయం తప్ప ప్రాణనష్టం గురించి వాళ్ళ జడ్జిమెంట్ లో ప్రస్తావించట్లేదు. ఈ సమస్యను మా సంస్థ తరపున ఎన్.జి.టి లో కేసు వేసే ప్రయత్నం చేస్తాం.

ఫాక్టరీలలో భద్రతా ప్రమాణాలను తనిఖీ చేసే విధానం కాగితాలకే పరిమితం అయ్యిందా, లేక ఎప్పటికప్పుడు అంతా బాగుంది అన్న నివేదికను ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్ వారు రాసేసుకుంటున్నారా? ఇలాంటి ప్రమాదాలు జరిగినపుడు ప్రాణ నష్టం నివారించడానికి ప్రథమ చికిత్స ఎలా చెయ్యాలి, ప్రోటోకాల్ ఏమి అనుసరించాలి అన్న డ్రిల్స్ అవుతున్నాయా? ఇలా అగ్ని ప్రమాదాలకు గురి అయిన కార్మికుల ప్రాణాలను రక్షించేందుకు బర్న్ వార్డ్ ఉన్న హాస్పిటల్ వివరాలు కంపెనీ దగ్గర ఉన్నాయా లేక అంబులెన్సు ఎక్కించేసి చేతులు దులుపుకుంటున్నారా? సుమోటో గా ఎన్.జి. టి, తీసుకుంటోంది సరే, మరి లేబరు డిపార్ట్మెంట్ ఏమి చర్యలు తీసుకుంటోంది కంపెనీ మీద?

ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు లేకుండా, ఫార్మా విలేజీ, ఫార్మా సిటీ అంటూ వస్తున్నా ప్రణాళికలు పగటి కలలు గా మిగిలిపోవడమే మంచింది.

మా డిమాండ్లు:

  • చనిపోయిన కార్మికులకు కోటి రూపాయలకు తగ్గకుండా నష్టపరిహారం ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించాలి.
  • జరిగిన విషయం మీద ప్రాథమిక నివేదికను ఇన్స్పెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్ వాళ్ళు వెంటనే సామాజిక మాధ్యమాల్లో పెట్టాలి .
  • ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆరోర్ ఫ్యాక్టరీ పైన చర్యలు తీసుకోవాలి.
  • ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళ వల్ల జరిగే నష్టాన్ని గుర్తించి, అన్ని ఫ్యాక్టరీలలో భద్రతా ప్రమాణాలు పెంచాలి. భద్రతా ప్రమాణాల తనిఖీలు క్రమపద్దతిలో చేపట్టాలి.

కె. బాబు రావు,
రిటైర్డ్ శాస్త్రవేత్త, సైంటిస్ట్ ఫర్ పీపుల్.

సంజీవ్,
మానవ హక్కుల వేదిక, హైదరాబాద్ నగర ప్రధాన కార్యదర్శి.

రోహిత్,
మానవ హక్కుల వేదిక, హైదరాబాద్ నగర కార్యదర్శి.

09.12.2024,
హైదరాబాద్.

Related Posts

Scroll to Top