షాపూర్ నగర్ నివాసి అయిన రాము నాయక్ (38) ను సెప్టెంబర్ 16 తారీఖు ఉదయం జీడిమెట్ల పోలీసులు, స్టేషన్ కి తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన విషయం మీద మానవ హక్కుల వేదిక నిజ నిర్థారణ చేసింది.
రాము గత 15 సంవత్సరాలుగా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. అడ్డా మీద కూలి పని చేసుకుంటూ ఉంటాడు, తన భార్య ఇళ్లలో పని చేస్తుంది. సెప్టెంబర్ 15 వ తారీకు రాత్రి గణేష్ నిమజ్జనం సమయంలో తాగిన మత్తులో షాపూర్ దగ్గర కొందరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. ఒక వ్యక్తి 5 వేల రూపాయలు పోయాయి. అవి తీసుకున్నది రాము కి తెలిసిన వాళ్ళే అన్న అనుమానం తోని, రామును అక్కడి వాళ్ళు సహాయం చేయమని అడిగారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమని డబ్బులు పోయిన వ్యక్తి అడిగాడు. వాళ్ల వివరాలు తనకు తెలుసనీ ఉదయాన్నే తీసుకెళ్తాను అని చెబుతూ, తన ఇంటికి దారి చూపించాడు. మరుసటి రోజు అనగా 16 సెప్టెంబర్ రోజున 11 గంటలకు ఇద్దరు కానిస్టేబుళ్లు తన ఇంటికి వచ్చి స్టేషన్ కి తీసుకువెళ్ళారు, డబ్బులు తీసిన వాళ్ళ వివరాలు ఇవ్వాలిసిందిగా తనను బూతులు తిడుతూ బెల్ట్ తోని, లాఠీల తోని కొట్టారు అని రాము మా బృందంతో చెప్పాడు. తనను రెండు గంటలు చిత్రహింసలకు గురి చేసి మధ్యాహ్నం 2 గంటల సమయంలో వదిలేసారు అని చెప్పాడు. రాము ఎడమ కాలు, చేతికి దెబ్బల తగలడం వలన సరిగ్గా నడవలేకుండా ఉన్నాడు, హాస్పిటల్ కి పొయ్యేటందుకు డబ్బులు లేవు. పనికి పోయే పరిస్థితి లేదు, గత వారం రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ విషయం వార్తా పత్రికల్లో రావడం తోని అలెర్ట్ అయిన పోలీసులు రెండు రోజుల క్రితం ఒక కానిస్టేబులును రాము ఇంటికి పంపి క్షమాపణ చెప్పించి, వైద్యం చేపిస్తాము అని మాట ఇచ్చారు అని రాము చెబుతున్నాడు. కానీ ఇప్పటి వరకు ఎవరు సహాయం అందించలేదు. తన మీద గతంలో ATM మెషీన్ మీద దాడి చేసిన కేసు ఉండేదని, తను తప్పు చేయనందున ఆ కేసు ఎత్తేశారని రాము చెప్పాడు.
ఈ విషయమై జీడిమెట్ల స్టేషన్ హౌస్ ఆఫీసర్ మా బృందంతో ఫోన్ లో మాట్లాడుతూ, రాము మీద ఇదివరకు కూడా కేసులు ఉన్నాయని, తాగి గొడవ చేస్తాడని, ఆ రోజు పోలీస్ స్టేషన్ లో కూడా రామునే తల గోడకు బాదుకోడం వంటివి చేశాడని అన్నారు. రాము ను కొట్టిన విషయం కంటే తన స్వభావం, అలవాట్ల గురించే ఎక్కువగా చెప్పుకొచ్చారు. రాము పోలీస్ స్టేషన్ లో చర్యలకు వీడియో కెమెరా ఫుటేజ్ ఉందని చెప్పారు. రాముని పిలిచి మాట్లాడటం జనరల్ డైరీ లో నమోదు చేశారా అన్న ప్రశ్నకు సంతృప్తికర సమాధానం మాత్రం దొరకలేదు.
కొద్ది రోజుల క్రితం, ఇదే జీడిమెట్ల పోలీస్ స్టేషనులో దొంగతనం చేసిన తన స్నేహితుడి వివరాలు చెప్పాలి అని అశోక్ అనే భాగ్యలక్షి కాలనీ నివాసిని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. మనస్థాపానికి గురైన అశోక్ ఆత్మహత్యా ప్రయత్నం చేసుకొని సెప్టెంబర్ 11 న మృతి చెందాడు. వివరాలు బయటికి రానివ్వకుండా పోలీసులు పోస్ట్ మార్టమ్ చేపించి, బంధువులను పిలిపించి హుటాహుటిన అశోక్ స్వగ్రామం అయిన రాజస్థాన్ కు తరలించారు అని తెలుస్తోంది. గత నెల రోజులుగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో జరిగిన రెండో ఘటన ఇది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ అశోక్ విషయంలో అసలు మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా ఈ విషయాల మీద సైబరాబాద్ కమిషనర్ కి మానవ హక్కుల వేదిక తరుపున నివేదిక సమర్పిస్తాం.
మా డిమాండ్లు:
- దెబ్బలతో బాధపడుతున్న రాము ను పోలీసులు వేంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి తగిన చికిత్స అందే విధంగా చూడాలి.
- జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో జరిగిన రెండు సంఘటనలపై డి.సి.పి ఆధ్వర్యంలో విచారణ జరిపి, రిపోర్ట్ ను సామజిక మాధ్యమాల్లో పెట్టాలి.
- రాము మరియు అశోక్ విషయం లో బలప్రయోగానికి పాల్పడిన పోలీసులను సస్పెండ్ చేసి, చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి.
సంజీవ్,
హైదరాబాద్ నగర ప్రధాన కార్యదర్శి.
రోహిత్,
హైదరాబాద్ నగర కార్యదర్శి.
22.09.2024,
జీడిమెట్ల.