భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం బోడగుట్ట అటవీ ప్రాంతంలో 5.9.2024 తెల్లవారు జామున ఆరుగురు మావోయిస్టులను (అందరూ ఆదివాసులే) కాల్చి చంపిన పోలీసు అధికార్లపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని మానవహక్కుల వేదిక (HRF) డిమాండ్ చేస్తోంది. ఆ సంఘటనకు సంబంధించి సి.బి.ఐ చేత కాని, తెలంగాణా రాష్ట్ర పోలీసులతో సంబంధం లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేత కాని నేర పరిశోధన జరిపించాలని HRF కోరుతోంది.
ముగ్గురు సభ్యులతో కూడిన HRF నిజనిర్ధారణ బృందం 13.10.2024 నాడు కరకగూడెం, పినపాక మండలాల్లోని గ్రామాలను సందర్శించి స్థానికులతో మాట్లాడింది. పోలీసులు చెబుతున్నట్లు రెండు వైపులా కాల్పులు జరగలేదని మా నిర్ధారణలో తేలింది. దట్టమైన అడవిలో తెల్లవారుజామున మావోయిస్టు దళంపై ఏకపక్ష కాల్పులు జరిగినట్టు స్పష్టమవుతోంది.
పోలీసులు మావోయిస్టుల మీద హత్యా ప్రయత్నం చేసారన్న నేరం కింద ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసారు కాని అది చట్ట ప్రకారం సరిపోదు. ఆరుగురు వ్యక్తులపై కాల్పుల సంఘటనలో పాల్గొన్న పోలీసులందరిపైనా హత్యా నేరం కింద, ఇంకా ఎస్.సి.,ఎస్.టి (అత్యాచార నిరోధక) చట్టం కింద కేసులు నమోదు చెయ్యాలి. వారు చెబుతున్నట్లుగా పోలీసులు ఆత్మ రక్షణ కోసం కాల్పులు జరిపారా లేదా అన్నది నిర్దారించాల్సింది న్యాయస్థానం, పోలీసులు కాదు. ఇరు వైపులా కాల్పులు జరిగాయని ఏకపక్షంగా నిర్ధారించేసి కేసును మూసివేస్తే అది చట్టాన్ని, రాజ్యాంగాన్నీ అపహాస్యం చేసినట్లు అవుతుంది.
కాల్పులు జరిగిన ప్రదేశానికి మీడియాని అనుమతించకపోవడం మీద మాకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి. తెలంగాణలో ‘ఎన్కౌంటర్’ జరిగిన ప్రదేశాలకు మీడియాను వెళ్ళనీయకపోవడం గతంలో జరగలేదు. పోలీసులు ఏమి దాయదల్చుకున్నారు? నేరం జరిగిన ప్రదేశంలో ఆధారాలు పాడవకుండా చూసుకుంటే సరిపోతుంది కాని మీడియాను అసలు వెళ్ళనీయక పోవటం ఏమిటి?
ఆందోళన కలిగించే ఇంకొక విషయం ఏమిటంటే స్థానిక కోయ జాతి ఆదివాసులు భయభ్రాంతుల్లో బ్రతుకుతున్నారు. నిత్య పహారా కాస్తున్న పోలీసుల సమక్షంలో స్తానిక ఆదివాసులు నోరుమెదపటానికి కూడా భయపడుతున్నారు. అంతేకాదు, సెప్టెంబర్ రెండవ వారంలో నిజనిర్ధారణ కోసం వెళ్ళిన పౌర హక్కుల సంఘం (CLC) బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
పోలీసులు ఎంత న్యాయబద్ధంగా ఉండాలో ఎంత విచ్చలవిడిగా ప్రవర్తించ వచ్చో అన్నది అధికారంలో ఉన్న పాలకపక్షం చేతుల్లోనే వుంది. పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరించి, జవాబుదారీగా ఉండేలా చూడాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని HRF ఈ సందర్భంగా గుర్తు చేస్తోంది. న్యాయసూత్రాలను అతిక్రమిస్తూ జరిపే ఎన్కౌంటర్ హత్యలకు ఒక పక్క పచ్చ జెండా ఊపుతూ మరో పక్క ‘ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం’ అంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీకి అర్ధం లేకుండా పోతోంది. రాష్ట్ర పాలకుల ఆమోదం, ప్రోత్సాహంతో సాగుతున్న ఈ ‘ఎన్కౌంటర్’ హత్యాకాండను ఆపాలి.
శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది. అలాగే మావోయిస్టుల హింసను ఎదుర్కోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఏదైనా అది న్యాయసూత్రాలకు, చట్టబద్ధ పాలనకు లోబడి, ప్రజల హక్కులను గౌరవిస్తూ జరగాలి. ‘నక్షలైటు ఉగ్రవాదాన్ని’ సాకుగా చూపెడుతూ చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడరాదు. పోలీసులు ఎన్కౌంటర్ల పేరిట ఈ రకమైన హత్యాకాండకు పాల్పడటం నాగరిక సమాజం అంగీకరించదు.
మావోయిస్టు ఉద్యమాన్ని కేవలం శాంతిభద్రతల సమస్యగా మాత్రమే చూడవద్దని మేము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విన్నపిస్తున్నాము. మావోయిస్టులు వారి రాజకీయ వ్యూహంలో భాగంగా హింసను ప్రయోగిస్తారన్నది వాస్తవామే గాని అది ప్రధానంగా రాజకీయ ఉద్యమం. దాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలిగాని వన్యమృగాలను వేటాడినట్టు చుట్టుముట్టి కాల్చి చంపే లైసెన్సు జారీ చేయడం చట్టవిరుద్ధం, అనాగరికం.
డా. ఎస్. తిరుపతయ్య – HRF ప్రధాన కార్యదర్శి, తెలంగాణ.
వి. ఎస్ కృష్ణ – HRF తెలంగాణ, ఆంధ్ర సమన్వయ కమిటీ సభ్యులు.
15.10.2014,
హైదరాబాద్.