మూక దాడులు, మతం పేరిట జరిగే నేరాల నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలి – తుక్కుగూడ సంఘటన మీద నిజనిర్ధారణ నివేదిక

రంగారెడ్డి జిల్లా, తుక్కుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యయుడు రాములు గారి మీద అయ్యప్ప మాల వేసుకున్న స్వాముల రూపంలో హిందుత్వ మూకలు 23 డిసెంబర్ 2024 రోజున దాడి చేసిన విషయం తెల్సిందే. ఈ విషయం మీద మానవ హక్కుల వేదిక సభ్యులు 5 జనవరి 2025 రోజున నిజ నిర్ధారణ చేపట్టారు.

ప్రధాన ఉపాధ్యాయులు రాములు గారిని కలిసి వివరాలు సేకరించారు. రాములు గారు 58 ఏళ్ల ప్రభుత్వ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు. తుక్కుగుడ స్కూల్ కి 2023 లో వచ్చారు. ఆయన లెక్కల మాష్టారు. డిసెంబర్ 21 వ తారీఖున, క్లాస్ జరుగున్న సమయం లో కింద కూర్చున్న ఒక 8వ తరగతి విద్యార్థిని లేచి నుంచోమని విద్యార్థి భుజం మీద తడుతూ చెబుతున్న క్రమంలో రాములు గారి మోకాలు , విద్యార్థి వీపుకు తాకిన విషయాన్ని , హిందుత్వ వాదులు అయ్యప్ప మాల వేసుకున్న కారణం వల్లనే ఆ విద్యార్థిని కాలితో తన్నాడని whatsapp గ్రూప్స్ లో ప్రచారం చేసి, హిందూ మతం మీద దాడిగా అభివర్ణించారు. అదే క్లాస్ లో చదువుతున్న మరొక విద్యార్థి నుంచి వివరాలు తీసుకుని, తమకు కావలసిన సమాధానాలు వచ్చే విధంగా ప్రశ్నలు వేసి అది ఆడియో రికార్డు చేసి గ్రూప్స్ లో షేర్ చేసారు. 23 వ తారీఖు , అయ్యప్ప మాల ధరించిన 50 నుంచి 60 మంది జై శ్రీరామ్ నినాదాలు ఇస్తూ ప్రధానోపాధ్యాయుడు రాములు గారి బట్టలు చిరిగేలా కొట్టి, అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థి కాళ్ళు మొక్కేలా చేసారు. విశ్వ హిందూ పరిషత్ వారు రాములు మీద పోలీసు కంప్లయింట్ ఇచ్చారు. విషయం తీసుకున్న పోలీసులు వచ్చి రాములు గారి దగ్గర కంప్లయింట్ తీసుకున్నారు కాని, స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల 24 వ తారీఖున కంప్లయింట్ వెనక్కి తీసుకున్నారు రాములు గారు. VHP వారు కూడా కంప్లయింట్ వెనక్కి తీసుకున్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన మద్దతుతో తిరిగి డిసెంబర్ 28వ తారీఖు రోజున మరల కంప్లయింట్ ఇచ్చారు. FIR నమోదు అయ్యింది. SC/ST అట్రాసిటీస్ తో పాటు, BNS 132, 352, 115(2) కింద కేసు బుక్ అయ్యింది. రాములు గారు దళిత వర్గానికి చెందిన వారు.

ఈ సంఘటనలో గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, దాడి చేసిన వారిలో దళితుల కూడా ఉండటం, రెండు , అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు దాడిలో పాల్గొనడం కాని, రాములు మీద కంప్లయింట్ కాని చేయలేదు, వారు బంజారా వర్గానికి చెందిన వలస కూలీలు. మూడోది, అయ్యప్ప మాల వేసుకున్న ఆ విద్యార్థి మళ్ళీ స్కూల్ కి రాలేదు. నాలుగోది, మరో విద్యార్థి తో మాట్లాడించిన ఆడియో రికార్డింగ్ లో, ఆ విద్యార్థిని రాములు కులం గురించి అడగడం, స్కూల్ లో దాడి చేస్తున్న సమయంలోనూ ఆయనను ” మాదిగ లంజకొడకా” అని తిట్టడం. అయిదవది, స్వామి మాల వేసుకున్న స్వాములు ఇలా బూతులు మాట్లాడటం, కొట్టడం.

ముందుగా హిందూ మతానికి వ్యతిరేకం అని ఒక అసత్య ప్రచారం చేయడం, తరువాత హిందూ ధర్మ పరిరక్షణ చేస్తున్నామని హింసకు పాల్పడటం, ఆ హింసాత్మక సంఘటన వీడియో తీసి సోషల్ మీడియా లో ప్రచారం చేసి, హిందూ ధర్మానికి న్యాయం చేస్తున్నామని చెబుతూ, అంతర్లీనంగా ఒక వర్గాన్ని బెదిరించడం అనేది, హిందుత్వ మూకలు వాడుతున్న ఒక విధానం. హింసకు పాల్పడ్డ వ్యక్తులు, ఆ హింసాత్మక సంఘటనను వీడియోలు తీసి ప్రచారం చేస్తున్నారు అంటే, వారికి చట్టం పట్ల ఎటువంటి భయం లేదని, ఇలాంటి హింస చేస్తే ఇతర హిందువులు తమని హిందూ రక్షకులుగా గుర్తించి అభిమానిస్తారని, తమ రాజకీయ ఎదుగుదలకు అది దోహద పడుతుంది అన్న భావన, ఒక సమాజంగా మనం ఎవరిని మన నాయకులుగా అనుకుంటాము అన్న విషయం పునరాలోచించుకోవలసిన అవసరాన్ని తెలియచేస్తుంది. ఈ సోషల్ మీడియా వ్యూహం తో పాటు, హిందుత్వ వాదుల మరొక వ్యూహాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అది హింసాత్మక సంఘటన జరిగిన వెంటనే పోలీసు స్టేషన్ కి వెళ్లి, హింస అనుభవించిన వారిపట్ల కేసు పెట్టడం. హింసకు గురి అయినవారు షాక్ నుంచి తేరుకుని , దెబ్బలకు కట్టులు కట్టుకుని, పోలీసు స్టేషన్ కి వెళ్ళే సరికల్లా వారి మీద అప్పటికే ఒక కంప్లయింట్ ఉంటోంది. వీరు కూడా కంప్లయింట్ ఇచ్చాక, మధ్యవర్తులు వచ్చి, రెండు పార్టీల చేత కంప్లైంట్లు వెనక్కు తీసుకునేలా చేసి, రాజీ కుదురుస్తారు. ఈ రాజీ వల్ల, హింసకు పాల్పడినవారు, హీరోలా బయటకి నడిస్తే, హింస అనుభవించిన వారు, ఇప్పటికీ అయినది చాలు, మళ్ళీ పోలీసులు, కోర్టులు ఎవడు పడతాడులే అని బయటకి వస్తారు.

ఉపాధ్యాయ సంఘాలు , దళిత సంఘాలు ఇచ్చిన ప్రోత్సాహం మరియు ధైర్యంతో రాములు గారు ఈ కేసుని ముందుకి తీసుకెళ్లే నిశ్చయంతో ఉన్నారు. ఆయనకు అండగా నిలబడి, ఆయనలో ధైర్యాన్ని నింపిన అన్ని సంఘాలకు అభినందనలు. 450 మంది దాకా విద్యార్థులు ఉన్న ఆ పాఠశాలలో, పాఠశాల ప్రాంగణంలోనే , ప్రధానోపాధ్యాయుడి బట్టలు చిరిగేల కొట్టడం, ఆ విద్యార్థులలో , ఉపాధ్యాయుల పట్ల గౌరవాన్ని తగ్గించి, ఇటువంటి మూకల పట్ల ఆరాధన భావాన్ని పెంచితే, వచ్చే తరంలో తుక్కుగుడ ప్రాంతం ప్రశాంతంగా ఉండగలుగుతుందా అని కూడా ప్రశ్నించుకోవాలి.

సంఘటన జరిగి ఇన్ని రోజులు అయినా ఇంకా నిందితులను పోలీసులు పట్టుకుకోకపోవడం, ఒక ప్రధాన ఉపాధ్యాయుడిని మతం ముసుగులో కొట్టచ్చు అన్న సందేశం సమాజం లోకి వెళ్తుంది. ఈ విషయం మీద వెంటనే పోలీసులు స్పందించాలని డిమాండ్ చేస్తూ, రెచ్చగొట్టే సోషల్ మీడియా మెస్సేజీలను నిజానిజాలు తెలుసుకోకుండా ప్రభావం అవ్వడం మానుకోవాలి అని మానవ హక్కుల వేదిక ప్రజలకు పిలుపునిస్తోంది.

డిమాండ్లు:

  1. పోలీసులు వెంటనే నేరస్తులను గుర్తించి అరెస్టు చేయాలి
  2. స్కూల్ లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ పెట్టించి విద్యార్దులకు, వారి తల్లిదండ్రులకు పరిస్థితి వివరించాలి.
  3. మతం పేరిట జరిగే ఇటువంటి మూకదాడులు నిరోధించేవిధంగా ప్రత్యేక చట్టం తీసుకురావాలి.

ఈ నిజ నిర్దారణ లో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య గారు, ఉపాధ్యక్షులు బాలరాజు గారు, వరంగల్ యూనిట్ ప్రధాన కార్యదర్శి దిలీప్, హనుమాన్ ప్రసాద్, రంగారెడ్డి జిల్లా నుంచి నరసింహ, జంగయ్య, హైదరాబాద్ యూనిట్ ప్రెసిడెంట్ సురేష్ బాబు , వెంకట్నారాయణ, రోహిత్, సంజీవ్ పాల్గొన్నారు.

రంగారెడ్డి ,
05.01.2024.

Related Posts

Scroll to Top