మెదక్ జిల్లా, టేక్మల్ గ్రామ పంచాయతీలోని గొల్లగూడెం గ్రామంలో 3 సెప్టెంబర్ 2024 ఉదయం రాములు అనే వ్యక్తిపై చేతబడి ప్రయోగించాడు అనే నెపంతో గ్రామస్తులు దాడి చేయగా అతను మరణించాడు అని వార్తా పత్రికలలో వచ్చింది. ఈ విషయం మీద భారత నాస్తిక సమాజం, డి.బి.ఎఫ్ మరియు మానవ హక్కుల వేదిక సంస్థలు నిజ నిర్ధారణ జరిపాయి.
దేవుడుకాడి రాములు, మెదక్ పట్టణంలోని మక్తాల మల్లన్న గుడిలో పూజారిగా పనిచేస్తుంటాడు. అతను ఒగ్గు కథ కళాకారుడు కూడా. అతను గొల్లగూడంలో నివసిస్తున్న తన మేనకోడలు గంగవ్వ ఇంటికి సెప్టెంబర్ 1 న వెళ్ళాడు. ఆ ఇంట్లో అప్పటికే గంగవ్వ మిత్రురాలు బాలమణి మరియు గంగమ్మ తల్లి దుర్గమ్మ ఉన్నారు. వెళ్ళిన రోజే రాములుకు వాంతులు విరోచనాలు మొదలయ్యాయి. అవి ఎక్కువ కావడంతోటి స్థానిక టేక్మల్ ప్రభుత్వ దవాఖానలో చూపించుకున్నాడు. రెండు రోజులు అయినా అర్యోగం కుదుట పడలేదు. అలోపతి పనిచేయకపోవడంతో, రోగానికి విరుగుడుగా తన తల మీద కల్లు సీసా, రెండు కోడి గుడ్లు తిప్పి రోడ్డు మీద వేయమని రాములు చెప్పాడు. అదే పని సెప్టెంబర్ 3వ తారీఖు ఉదయం 4 గంటలకు గంగవ్వ చేసి వాటిని బాలామణికి ఇచ్చి దూరాన పడేసి రమ్మని చెప్పింది. ఈ సంగతి తెలియని గ్రామస్తులు, చుట్టపు చూపుగా ఆ వూరికి వచ్చిన పూజారి క్షుద్రపూజలు ఎవరికో చెడు చేయడానికి చేస్తున్నాడని తలచారు. ఆ కోడిగుడ్లు మా ఇంటి ముందు పడేసారు, మా మీద చేతబడి ప్రయోగించారు అని వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న గంగవ్వ బంధువులు విఠల్, ఇందిరమ్మ మరియు కొందరు గ్రామస్తులు రాములుని ఇక్కడి నుండి పంపియమని గంగవ్వకు చెప్పారు. తన పైన, రాములు పైన మరియు బాలమణి పైన దాడి చేసారని, తాను రాములును తీసుకుపోడానికి ఆటో కోసం వెళ్లగా, తిరిగి వచ్చేసరికే రాములు కిందపడిపొయ్యి ఉన్నాడు అని గంగవ్వ చెప్పింది. జోగిపేట హాస్పిటల్ కి తరలించగా అప్పటికే రాములు మరణించాదు అని తెలిసింది. ఇంటి పక్కనే ఉన్న విఠల్ , ఇందిరమ్మ, తదితరులు దాడి చేయడం వల్లనే మా మామ రాములు మృతి చెందినట్టు గంగవ్వ చెప్పింది. ఈ విషయం ఇందిరమ్మ, వాళ్ళ కుటుంబ సభ్యులను అడగగా, మా ఇంటి ముందు కోడిగుడ్లు వేశారు అని, ఇక్కడి నుండి పంపించేయండి అని మాత్రమే చెప్పాము కానీ రాములు మీద మేము ఎటువంటి దాడి చేయలేదు అని, అతను అనారోగ్యంతోనే మరణించాడు అని చెప్పారు. రాములు కొడుకు శివుడిని కలిసి వివరాలు సేకరించినప్పుడు మా తండ్రి ఇంటి నుండి వెళ్లేటప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమయిందో మాకు తెలియదని, ఇదే పోలీసులకు చెప్పామని, తనకు అనుమానం ఉన్న వాళ్ళ పేర్లు ఇచ్చామని పోస్ట్-మోర్టన్ రిపోర్ట్ ఇంకా రాలేదని చెప్పాడు. ఈ విషయంపై గ్రామస్తులు స్పందించడానికి నిరాకరించారు. ఈ విషయం మీద టేక్మల్ పోలీసులు 194 బి.ఎన్.ఎస్.ఎస్ (అనుమానాస్పద మృతి) కింద నలుగురి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.
రాములు వృత్తి రీత్యా పూజారి అవ్వటం మూలాన, పసుపు రంగు చొక్కా ధరించడం, తనకి చేతబడి చేయటం వచ్చు అన్న వాదానికి ఆద్యం పోసింది. గంగవ్వకు 5 ఎకరాల భూమి ఉన్నది. దీంట్లో 1.2 ఎకరాలు తన పేరు మీద రెజిస్ట్రేషన్ అయింది.
మిగతా స్థలానికి పత్రాలు లేవు. రాములు కుటుంబానికి, గంగవ్వ కుటుంబానికి ఈ భూమి విషయం మీద కొంత గొడవ జరుగుతున్నది. రెండు కుటుంబాలు బంధువులే అయినప్పటికీ భూమి వివాదాలు వల్ల తోపులాట జరిగి రాములు మరణించాడా లేదా అప్పటికే ఆరోగ్యం బాగా లేని కారణంగా రాములు చనిపోయాడా అన్న అనుమానాలు ఉన్నాయి. ఏది ఏమయినప్పటికి ఒక ప్రాణం పోయింది.
ఆధునిక యుగంలో, కృత్రిమ మేధ విస్తరిస్తున్న కాలంలో, బాణమతి, చేతబడి లాంటి మూఢనమ్మకాలను ప్రజలు నమ్మడం బాధాకరం.
రాములుకు ఒంట్లో బాగాలేదు, నిజంగా క్షుద్ర పూజలు వచ్చి ఉంటే, ఆ మంత్రాలతోని తన ఆరోగ్యమే బాగుచేసుకోలేని వాడు ఇతరుల మీద ఎలా ప్రయోగిస్తాడు అన్న కోణంలో గ్రామస్తులు ఆలోచించలేక పోయారు. గడిచిన మూడు సంవత్సరాలుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో మూఢనమ్మకాల పేరుతో దాడులు జరగటం ఇది మూడవ సంఘటన. ఇటువంటి ఘటనలు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా సమాజం లో ఇంకా చాలా ప్రచారం కల్పించాలని నిరూపిస్తూ ఉంటాయి. మూఢనమ్మకాల నిర్ములన చట్టం ఇప్పటికే 7 రాష్ట్రలలో అమలులో ఉన్నది, ఇదే చట్టాన్ని తెలంగాణాలో అమలు చేయమని ప్రభుత్వాన్ని అభ్యర్దిస్తున్నాము.
మా డిమాండ్లు:
- పోస్టుమార్టం రిపోర్టులో రాములు పైన దాడి జరిగింది అని రుజువైతే, ప్రభుత్వం రాములు కుటుంబానికి తగిన నష్టపరిహారం చెల్లించాలి.
- తెలంగాణ ప్రభుత్వం మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయాలి.
- ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లాలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా కౌన్సిలింగ్ మరియు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి.
ఈ నిజ నిర్ధారణ బృందంలో భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు జీడి సారయ్య, డి.బి.ఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, మెదక్ జిల్లా కార్యదర్శి విద్యాసాగర్, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు స్పార్టకస్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి అహ్మద్, రాష్ట్ర నాయకులు రోహిత్ పాల్గొన్నారు.
టేక్మల్,
10.09.2024.