హైదరాబాద్ గండిపేట మండలం లోని బైరాగిగూడ ప్రాంతంలో పద్మ అనే గృహిణి 28 జులై ఉదయం 11 గంటల సమయంలో బట్టలు పిండుకుంటూ ఉండగా తన ఎడమ కాలు నుండి బులెట్ దూసుకుపోయిన వార్త పత్రికల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ విషయం మీద మానవ హక్కుల వేదిక బృందం బాధితురాలిని, స్థానికులను, నార్సింగి పోలీసు అధికారులను కలిసి వివరాలు సేకరించింది.
నార్సింగి దగ్గర్లో ఉన్న బైరాగిగూడ ప్రాంతం భారతదేశ మిలిటరీ క్యాంపు మరియి తెలంగాణ పోలీసు అకాడమీ దగ్గర్లో ఉంది. ఈ క్యాంపుల్లో ట్రైనింగ్ కోసం వచ్చిన రక్షకభటులకి ట్రైనింగ్ లో భాగంగా షూటింగ్ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఈ రెండు ట్రైనింగ్ క్యాంపులోని షూటింగ్ ప్రాక్టీస్ బైరాగిగూడ ప్రాంతానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే జులై 28 తారీకు ఉదయం 11 గంటల సమయంలో విద్యానగర్ కి చెందిన పద్మ ఇంట్లో బట్టలు పిండుకుంటూ ఉండగా గేట్ చప్పుడు చేస్తూ బుల్లెట్ ఒకటి లోపలికివచ్చి గిర్రున తిరిగి కిందపడింది. ఏమి జరిగిందో తెలుసుకునే లోపే తన ఎడమకాలికి రక్త ప్రవాహం మొదలైయింది. అది బుల్లెట్ వల్లే జరిగింది అని తెలుసుకొని స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా వాళ్ళు దగ్గరలోని గోల్కొండ హాస్పిటల్ కు తీసుకు వెళ్ళారు. ఆ తరువాత పద్మ ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంది. ఈ విషయం మీద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకొని బాధితురాలిని, చుట్టుపక్కన్న వాళ్ళని కలిసి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. పద్మ ఉంటున్న ఇల్లు రెండు అంతస్తులు ఉండగా, గ్రౌండ్ ఫ్లోర్ లో పని చేసుకుంటున్న తనకు బులెట్ తాకడం ఆశ్చర్యమైన విషయం. ఇలాంటి సంఘటనే ఒకటి మిలిటరీ షూటింగ్ రేంజ్ కి ఇంకొక వైపు ఉన్న అదే గ్రామానికి చెందిన శివ సాయి నగర్లోని నాల్గవ అంతస్తులోకి బులెట్ చొచ్చుకువచ్చింది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడం మూలాన ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. బైరాగిగూడలోని విద్యానగరలో పద్మ ఒక సంవత్సరం నుండి గ్రౌండ్ ఫ్లోర్ లో తన కుటుంబం తోని అద్దెకు ఉంటుంది. దాని చుట్టు పక్కనే దాదాపు పన్నెడు ఏళ్లుగా ఉంటున్నటు చెప్పింది.
ఒక కొండకి, బైరాగిగూడ గ్రామానికి మధ్యలో షూటింగ్ రేంజ్ ఉంది. షూటింగ్ ప్రాక్టీసు కొండ వైపు జరుగుతుంది. పద్మ ఇంటికి పోలీస్ క్యాంప్ గేటుకు మధ్య అర కిలోమీటరు పైగా దూరం ఉంది. పద్మ ఇల్లు షూటింగ్ రేంజ్ ప్రాంతం కన్నా చాలా ఎత్తులో ఉంది. పద్మ ఇంటి నుంచి షూటింగ్ రేంజ్ కనిపించదు, మధ్యలో రెండు అంతస్తుల భవనాలు చాలా ఉన్నాయి.
ఇక శివ సాయి నగర్ వెంచర్ షూటింగ్ రేంజ్ కి చాలా దూరం లో ఉంది. శివ సాయి నగర్ కి కాని, పద్మ ఇంటికి కి కాని షూటింగ్ రేంజ్ కి డైరెక్ట్ లైన్ ఆఫ్ సైట్ లేదు.
సంఘటన జరిగిన తరువాత పోలీసులు, పత్రికల వాళ్ళు చాలా మంది వచ్చారు కానీ తనకు ఎలాంటి నష్టపరిహారం విషయమై ఎవరు మాట్లాడలేదు అని పద్మ చెపింది. తన భర్త వెంకటేష్ మేస్త్రి పని చేస్తుంటాడు, ఇద్దరు పిల్లలు. పద్మకు ఇంతకు ముందు హౌస్ కీపింగ్ పనికి వెళ్ళేది. ఇపుడు మళ్ళీ ఏదన్నా పని చూసుకుందాం అనుకుంటున్న సమయంలో ఇలా జరిగింది అని పూర్తిగా రెండు కాళ్లతోని నడవలేని పరిస్థితి అని ఆవేదన వ్యక్త పరిచింది. ఈ సంఘటన వల్ల ఇంకొంత కుంగిపోతూ, అనుక్షణం భయంగా బ్రతుకుతున్నాం అని వాపోయింది.
షూటింగ్ రేంజ్ కి దగ్గరలో కబ్జా చేసి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు అని అందుకే ఇలా జరిగి ఉండొచ్చని ఒక వాదన ఉంది. ప్రభుత్వం ఆ ప్రాంతం వారికి 2009 లో స్థలాలు కేటాయించింది. ఈ ప్రదేశానికి కొంత దూరంలో పోలీసుల క్యాంపుకి ఇంకా దగ్గర్లో పట్టా భూములు, రిజిస్టర్ అయిన ఇల్లు కూడా ఉన్నాయి. ఏ లెక్కన చూసినా ప్రభుత్వ అనుమతులతోనే కట్టుకున్న ఇళ్లలాగా కనిపిస్తున్నాయి, అదే విషయాన్ని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి సంఘటన గత 10-15 సంవత్సరాలుగా ఎన్నడూ జరగలేదు అని చెప్పారు.
ఇదే విషయం మీద స్థానిక నార్సింగి పోలీస్ అధికారులతోని మాట్లాడినపుడు, ఇది అంత పెద్ద విషయం కాదు అని వాదిస్తూనే ఆ ప్రాంతానికి దగ్గర్లో రెండు షూటింగ్ క్యాంపులు ఉన్నాయి అని వాటిలో దేని నుండి బులెట్ వచ్చిందో ఎలా వచ్చిందో అన్న విషయాలపై విచారణ జరువుతున్నట్టు చెప్పారు. షూటింగ్ ప్రాక్టీస్ లో గురి తప్పి రీబౌండ్ (ricocheted) అయినపుడు ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది అని, కానీ అంత దూరం ప్రయాణించిన బులెట్ కి ప్రాణాలు తీసే అంత శక్తి ఉండదన్నారు. ఈ విషయంపై నార్సింగ్ పోలీసుల సలహాల మేరకు షూటింగ్ రేంజ్ లో, షూటింగ్ చేసే దిశని, తుపాకీ పెట్టి షూటింగ్ చేసే ఎత్తుని తగ్గించారు అని అని పోలీసు వారు అన్నారు. పద్మ ని హాస్పిటల్ కి తీసుకెళ్లినప్పుడు అక్కడ మెడికల్ లీగల్ కేసు గా రిజిస్టర్ చేశారు కానీ, హాస్పిటల్ ట్రీట్మెంట్ కాగితాలు పద్మకి ఇవ్వలేదు, అవి పోలీస్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి.
ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి.
పద్మకి తగిలింది ప్రాణాలు తీసే బుల్లెట్, క్రికెట్ బాల్ కాదు, ఏదో పొరపాటున తగిలిందిలే అనుకోడానికి. బుల్లెట్ ఒక మనిషి మీదకి వచ్చేది, ఆ మనిషిని చంపడానికి మాత్రమే. పద్మ ఇంటి పక్కన ఫైరింగ్ రేంజ్ ఉంది కాబట్టి, పొరబాటున వచ్చిన బుల్లెట్ అని ముందే పోలీసులు నిర్ధారణకు వచ్చేసారు. శివ సాయి నగర్ వెంచర్ లో కూడా ఒక బుల్లెట్ వచ్చింది. అప్పుడు కూడా ఇదే ఆలోచనా ధోరణి ఉంది.
బుల్లెట్ వల్ల హత్యా ప్రయత్నం జరిగింది అని కేసు పెట్టి విచారణ మొదలు పెడితే దానికి ఉండే ప్రాధాన్యత వేరు. బులెట్ కేవలం షూటింగ్ ప్రాక్టీస్ వల్లనే వచ్చిందా లేక ఇంకా వేరే ఉదేశం ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా విచారణ చేపడితే బాగుంటుంది. షూటింగ్ రేంజ్ నుంచి అనుకోకుండా రావడం అని నిర్ధారించేసి, అది మిలటరీ షూటింగ్ రేంజ్ నుంచి వచ్చిందా లేదా తెలంగాణ పోలీస్ అకాడమీ రేంజ్ నుంచి వచ్చిందా అన్న విషయం మీద జరుగుతున్న విచారణ ఉత్తరాలలో ఉండిపోతుంది. ఉత్తరానికి ప్రత్యుత్తరం రాలేదు అని చెప్పి విచారణ కొంతకాలానికి కోమాలోకి వెళ్ళిపోతుంది.
సూటిగా వెళ్లాల్సిన బుల్లెట్ అలా కాకుండా, అటు ఇటు కొట్టుకుని చివరికి ఇళ్లలోకి వచ్చింది అనుకుంటే, అలా రాకుండా చర్యలుచేపట్టాలి. మరియు బాధితురాలికి నష్టపరిహారం ఇప్పించాలి. ఈ విషయం మీద కాలనీ లీడర్ల దగ్గర నుండి ఎమ్మెల్యే వరకు ఏ ప్రజా ప్రతినిధి స్పందించిన దాఖలాలు లేవు, పొరపాటున వచ్చింది అని వాదిస్తున్న పోలీస్ శాఖ కూడా నష్టపరిహారం గురించి మాట్లాడడానికి ఇష్టపడలేదు.
ఇంతకాలం బైరాగిగూడ ప్రజలు బుల్లెట్ పేల్చిన శబ్దాలు మాత్రమే వినేవారు, ఇప్పటిదాకా ఎప్పుడు ఇలా బుల్లెట్లు ఊర్లోకి దూసుకు రావడం జరగలేదు. అంటే రెండు షూటింగ్ రేంజ్ లో ఏదో ఒక దాంట్లో కొత్త రకం రైఫిల్స్ వచ్చి ఉండాలి. ఆ రైఫిల్ ఆ బుల్లెట్ యొక్క రేంజ్ షూటింగ్ రేంజ్ దాటి ఉండాలి లేదా షూటింగ్ రేంజ్ లో నుంచి పొరపాటున బుల్లెట్స్ బయటి రాకుండా చేసిన ఏర్పాట్లు ఈ కొత్త తుపాకీలకు సరిపోతున్నట్టు లేవు.
మా డిమాండ్లు:
- బాధితురాలికి వెంటనే తగినంత నష్టపరిహారాన్ని కలిపిస్తామని ప్రభుత్వం ప్రకటించాలి.
- జరిగిన సంఘటనపైన పూర్తి నివేదికను త్వరగా సిద్ధం చేసి ఆ వివరాలను సమాచార మాధ్యమాల్లో పెట్టాలి.
- ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలి.
- భయాందోళనలకు గురి అవుతున్న బైరాగిగూడ నివాసులకు ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగవు అని హామీ ఇస్తూ తగిన అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి.
మా నిజనిర్దారణ బృందంలో మానవ హక్కుల వేదిక హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి సంజీవ్, కార్యదర్శి రోహిత్, హైదరాబాద్ యూనిట్ సభ్యులు సురేష్, రోహిత్ చంద్ర, జాన్ మైఖేల్, ఆకాష్ లు పాల్గొన్నారు.
05.08.2024,
Hyderabad.