కంచ గచ్చిబౌలి లో ఉన్న 400 ఎకరాల భూమిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకే కేటాయించాలి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో సర్వే no. 25 (p) లో ఉన్న 400 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం TGIIC (తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్) పేరుతో ఇండస్ట్రీలను ఆక్షన్ కి పిలిచింది. ఈ విషయం తెలుసుకున్న అక్కడి విద్యార్థులు ఈ భూమి పైన మాకు మాత్రమే హక్కు ఉంది నిరసనలు తెలుపుతున్నారు. ఈ వార్త పత్రికలు , సోషల్ మీడియా లో ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. ఈ విషయం పై మానవ హక్కుల వేదిక హైదరాబాద్ శాఖ 23 మార్చి 2025 రోజున నిజ నిర్ధారణ జరిపింది .

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కీ భారత ప్రభుత్వం 1973 లో 2300 పైగా ఎకరాల భూమిని యూనివర్సిటీ నిర్మాణానికి కేటాయించింది . కేటాయించిన సమయంలో ఈ భూమి యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ జరగలేదు. తరువాత కాలంలో టి.ఐ.ఎఫ్.ఆర్, అర్.టి. సి, ఇంకా ఇతర సంస్థలకి వేరే కారణాల చేత దాదాపు 600 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కేటాయించిన సంస్థలు కూడా ప్రజా ప్రయోజనాల కోసం పని చేసే ప్రభుత్వ సంస్థలు లేదా రీసెర్చ్ కు సంబంధించినవే. ఇప్పటి వరకు ఈ భూమి మీద సర్వేలు ఏమి జరగలేదు. నాక్ అక్రిడేషన్ కోసం 1700 ఎక్కరాల భూమి ఉన్నటు అధికారికంగా యూనివర్సిటీ తెలుపుతూ వచ్చింది. 2003 లో తెలుగుదేశం ప్రభుత్వం ఈ యూనివర్సిటీ ని అనుకోని ఉన్న కంచ గచ్చిబౌలి అని పిలవబడే ప్రాంతంలో 534 ఎకరాల భూమిని ఐ.ఎం .జి. భారత్ అనే ప్రైవేట్ సంస్థకు కు ప్రకటిస్తూ ఒప్పందం చేసుకుంది . అయితే 2004 లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ మెమోరాండం ను రద్దు చేసింది . ఈ విషయం మీద ఐ.ఎం .జి. న్యాయస్థానాన్ని ఆశ్రయించింది . ఈ కేసు లో యూనివర్సిటీ ఎక్కడ కూడా ఇంప్లీడ్ కాలేదు. 2024 లో ఈ భూమి రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుంది అని కోర్ట్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం సంస్థ TGIIC 400 ఎక్కరాల భూమి ఆక్షన్ కి ఆహ్వానిస్తూ ఫిబ్రవరి 28, 2025 న నోటిఫికేషన్ విడుదల చేసింది. కానీ ఆ భూమి యూనివర్సిటీకే చెందుతుంది అని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు నిరసనలు తెలపటం మొదలు పెట్టారు . అయితే అప్పట్లో తీసుకున్న 534 ఎకరాలకు ప్రత్యామ్నాయంగా వేరే భూమిని ఇచ్చారని, కాని ఆ ప్రత్యామ్నాయ భూమిని వేరే సంస్థలకు ఇచ్చేసారు అని తెలుస్తోంది.

యూనివర్సిటీ లు నిర్వీర్యం అవుతున్న కాలంలో, విద్యార్థులకు విశాలమయిన దృక్పథాన్ని అందించే జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యత తో కూడిన వాతావరణం ఎంతైనా అవసరం . ఈ యూనివర్సిటీ ప్రాంగణంలోని 232 రకాల వృక్ష జాతులు ఉన్నాయి . 14 ఈయూషన్ (IUCN), స్పీసీస్ కూడా ఉన్నాయి. పీకాక్ మరియు బఫెల్లో లేక్ ఈ 400 ఎకరాలను అనుకోని ఉంది. సోషల్ మీడియా లో ప్రాచుర్యం పొందిన మష్రూమ్ రాక్ తో పాటు మీసోలిథిక్ ((Mesolithic) రాక్స్ చాలా ఉన్నాయి. 2017 హెచ్.ఎం.డి.ఏ అధికారులు ప్లాంటేషన్ డ్రైవ్ పేరుతో బయో – డైవర్సిటీ ని దెబ్బ తీసే మొక్కలను నాటారు, దీని ప్రభావం అక్కడి చెట్లపైన పడింది. ఇపుడు ఈ 400 ఎకరాలను ప్రైవేట్ రంగ సంస్థలకు ఇస్తే ఇంతటి జీవ రాసుల తోని వైవిద్యనగా ఉన్న యూనివర్సిటీ పర్యావరణానికి దెబ్బ పడుతుంది. ఈ ప్రకృతి వైవిధ్యాన్ని కాపాడుకుంటే మేము రీసెర్చ్ కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేదు అని అక్కడి వృక్ష పరిశోధన విద్యార్థులు మాట్లాడుతున్నారు. అలాగే 1973 లో భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విధంగానే భూమి మొత్తని విశ్వవిద్యాలయనికే కేటాయించాలని యూనివర్సిటీ లో ఏర్పడిన JAC (విద్యార్థులు, ప్రొఫెసర్లు, నాన్-టీచింగ్ స్టాఫ్) వాళ్ళ వాదన.

ఇది ఇలా ఉంటే , కోర్ట్ తీర్పు మాకు అనుకూలంగా వచ్చింది, ఈ భూమి మాకే సొంతం అందుకే వేలానికి అనుమతి ఇచ్చాం అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అక్కడ పులుల సింహాలు ఎమైనా ఉన్నాయా అని ముఖ్యమంత్రి గారు బయో-డైవర్సిటీ మీద పూర్తి అవగాహ లోపం తోని మాట్లాడుతున్నారు. అంతే కాకుండా నిరసనలు తెలుపుతున్న విద్యార్థులను పాత పద్ధతులతోనే నిర్బంధించి బలవంతంగా అరెస్ట్ చేస్తున్నారు

ఈ విషయం లో రెవెన్యూ కోణం ఉంది. అసలు యూనివర్సిటీ భూమి ఎంత ఉంది, దాని సరిహద్దులు ఏమిటి అన్న విషయం మీద స్పష్టత లేదు. యూనివర్సిటీ భూభాగం లో హెలిపాడ్ ను, పక్కనే ఉన్న గచ్చిబౌలి స్టేడియం లో జరిగే కార్యక్రమాలకు బాగా వాడుతున్నారు, అలాగే హెలిపాడ్ ప్రాంతం లోని భూమిని గచ్చిబౌలి స్టేడియం పార్కింగ్ కోసం వాడుతున్నారు.

ఒక విశ్వవిద్యాలయానికి వందల వేల ఎకరాలు అవసరమా, బహుళ అంతస్తులు కట్టే ఈ కాలంలో అంత భూమి ఎందుకు అన్న ప్రశ్న రావొచ్చు. కాకపోతే, ఒక యూనివర్సిటీ ప్రాంగణాన్ని ఒక ఎంసెట్ కోచింగ్ ఇచ్చే ఒక కార్పొరేట్ కాలేజ్ తో పోల్చలేము. యూనివర్సిటీ అనగానే తరగతి గదులు మాత్రమే కాదు, అక్కడి విద్యార్ధుల మానసిక ఎదుగుదలకు స్టేడియంలు, ఆటస్థలాలు, కాస్త గాలి పీల్చుకునే వసతులు ఉండాలి. అన్నిటికి మించి, పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న విద్యావకాశాలు, సైన్సు, సోషల్ విభాగాలలో పెరుగుతున్న శాఖలు దృష్టిలో పెట్టుకుంటు, ఇంకో రెండు మూడొందల సంవత్సరాల దూరం ఆలోచిస్తే, ఒక విశ్వవిద్యాలయానికి ఆ మాత్రం భూమి ఉండాలి అని అర్థం అవుతుంది.

ఆగస్టు 2024 సమయానికి, యూనివర్సిటీ నుంచి 5 నిమిషాల దూరంలో ఉన్న గచ్చిబౌలి లో 15 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ఖాళీగా ఉంది, అలాగే 15 నిమిషాల దూరంలో ఉన్న ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ లో 50 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ఖాళీగా ఉంది. ఇంకో 22 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ నిర్మాణంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విదేశాలకు వెళ్లి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇచ్చి, అక్కడి వారిని బాగా మెప్పించేసి రాష్ట్రానికి కొత్త సాఫ్ట్వేర్ కంపెనీలను తీసుకొస్తే, ఆ ఆఫీస్ స్పేస్ నిండి అద్దెలు బాగా వస్తాయి అని రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు ఆశిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో, కాస్త మంచి గాలిని ఇచ్చే ప్రాంతాన్ని చదును చేసి, అది అమ్మేసుకుని, అక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు అద్దాల భవంతులు కట్టేస్తే, కొత్త కంపెనీలు వచ్చేసి, బోలెడు మందికి ఉపాధి దొరికేస్తుంది అన్న ప్రచారం ప్రభుత్వం చేసుకుంటోంది.

ఇక్కడ గమనించాల్సింది రెండు విషయాలు

  1. ఒకప్పుడు విలువ లేని భూమి, ఇప్పుడు బాగా విలువ ఉన్న భూమిగానే ప్రభుత్వం చూస్తోంది. ధన రూపంలో కాకుండా, ఆ భూమి విలువ పర్యావరణ, జీవ వైవిధ్యాల రూపంలో అర్థం చేసుకోమని విద్యార్ధులు అడుగుతున్నారు.
  2. ప్రభుత్వ భూమిని ప్రజా ప్రయోజనాల గురించి వాడకుండా, ఇలా అమ్ముకుని డబ్బులు సంపాదిద్దాం అన్న ఆలోచన మంచిది కాదు.

ఆ భూమి బీడు భూమి అని నమ్మించడానికి కొద్ది రోజుల క్రితం JCB ల సహాయంతో కొంత చదును చేసారు. మార్చి 30 2025, ఉగాది పండగ రోజున పోలీసు దళాల రక్షణలో పదుల సంఖ్యలో మళ్ళీ JCB లు క్యాంపస్ లోకి అడుగుపెట్టాయి. నిరసన తెలిపిన వందల సంఖ్యలో ఉన్న విద్యార్ధులను వివిధ పోలీసు స్టేషన్లలో నిర్బంధించారు. నవీన్ , రోహిత్ అనే విద్యార్ధులపై కేసు పెట్టారు.

రాష్ట్ర ప్రభుత్వం తన పద్దతిని మార్చుకొని , భూమిని విశ్వవిద్యాలయానికే కేటాయించాలి అని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది .

మా డిమాండ్లు:

  • నిరసనలు తెలుపుతున్నారని అరెస్ట్ చేసిన విద్యార్థులను అందరిని వెంటనే విడుదల చేయాలి. వారి మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలి.
  • రాష్ట్ర ప్రభుత్వం 400 ఎక్కరాల భూమిని విశ్వవిద్యాలయానికే కేటాయిస్తూ, భూమి మీద పూర్తి సర్వే చూపించాలి. ఇకనైనా పూర్తి భూమిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపించాలి.
  • బయో – డైవర్సిటీ కి సంబంధించి సర్వే చేసి ప్రకృతిని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి .

ఈ నిజ నిర్ధారణ బృందంలో మానవ హక్కుల వేదిక హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ ఎం.సురేష్ , ప్రధాన కార్యదర్శి సంజీవ్ తో పాటు సభ్యులు రోహిత్, మనోజ్ పాల్గొన్నారు.

31.03.25,
హైదరాబాద్.

Related Posts

Scroll to Top