అధికార బలంతో చేపట్టిన అక్రమ ఆక్వా చెరువుల తవ్వకం ఆపాలి

ఏలూరు జిల్లా మండవల్లి మండలం కానుకల్లు గ్రామం దళితవాడనానుకుని ఉన్న పంట భూములలో ఆక్వా చెరువుల తవ్వకం విషయమై, ఈ రోజు ఇద్దరు సభ్యుల మానవ హక్కుల వేదిక బృందం నిజ నిర్ధారణ చేపట్టింది. స్థానికలను కలిసి వివరాలు సేకరించింది.

పుట్టి సత్యనారాయణ కుటుంబానికి చెందిన 9 1/2 ఎకరాలలో ఎటువంటి అనుమతులు లేకుండానే చేపట్టిన ఆక్వా చెరువు  తవ్వకం తక్షణమే ఆపివేయాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది. ఈ గ్రామంలో 74, 75 సర్వే నెంబర్లలో ఉన్న భూమిలో అధికార పార్టీ ఎంపీటీసీ భర్త పుట్టి సత్యనారాయణ పోలీసులను భారీ సంఖ్యలో మొహరించి, స్థానికులను బెదిరించి అక్రమంగా చెరువు తవ్వకం చేపట్టారు. తమ మంచినీటి వనరులు పాడవుతున్నాయని ప్రశ్నించిన స్థానికులను కులం పేరుతో దూషించి బెదిరించారు. ఇక్కడ ఉన్న బావి నీటిపై, కాలనీలోని 300 కుటుంబాలే కాక చుట్టుపక్కల రెండు గ్రామాల ప్రజలు మంచినీటి కోసం ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు తవ్వుతున్న ఆక్వా చెరువు మోదుగుమూడి పంటకాలవను ఆనుకుని ఉంది. ఆక్వా కాలుష్యం పంటకాలవ ను కూడా ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో అక్రమంగా తవ్విన అనేక ఆక్వా చెరువుల వల్ల ఇక్కడ ఉన్న మంచినీటి బావుల లోని నీరు ఉప్పు నీటిగా మారిపోయింది.

ఇప్పుడు తవ్వుతున్న అక్రమ ఆక్వా చెరువు గురించి స్థానికులు కలెక్టర్ కు పలుమార్లు ఫిర్యాదు చేశారు. అసలు ఈ చెరువుకు ఉన్న అనుమతులు ఏంటి అని ఎమ్మార్వోని అడగగా ఆయన నిర్దిష్టంగా సమాధానం చెప్పడం లేదు. తమను కులం పేరుతో తిట్టి, బెదిరించిన ఆక్వా చెరువు యజమాని పై మండవల్లి పోలీసు స్టేషన్లో బాధితులు ఇచ్చిన కంప్లైంట్ పై ఇంతవరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు. అక్రమంగా తవ్వుతున్న ఆక్వా చెరువును కలెక్టర్ నేతృత్వంలోని డి ఎల్ సి తక్షణమే ఆపివేయాలని, మండవల్లి పోలీసులు బాధితులు ఇచ్చిన కంప్లైంట్ పై వెంటనే కేసు నమోదు చేయాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది.

వై రాజేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
జి రోహిత్, రాష్ట్ర కార్యదర్శి
09.07.23

Related Posts

Scroll to Top