ఆదివాసి ప్రాంతంలో పంప్డ్ స్టోరేజి హైడ్రో ఎలెక్ట్రిక్ ప్రాజెక్టులను రద్దు చేయాలి

అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలలోని ఐదవ షెడ్యూల్‌ ప్రాంతంలో ప్రైవేటు సంస్థలకు కేటాయించిన పంప్డ్ స్టోరేజ్‌ హైడ్రోఎలెక్ట్రిక్ ప్రాజెక్ట్‌(PSP)లను రాష్ట ప్రభుత్వం రద్దు చేయాలని మానవ హక్కుల వేదిక (HRF) డిమాండ్  చేస్తోంది.

ఇప్పుడున్న సమాచారాన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఐదవ పెడ్యూల్‌ ప్రాంతంలో నాలుగు పి.ఎస్.పి.లను అనుమతించినట్లు తెలుస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండు (యర్రవరం, పెదకోట), పార్వతీపురం మన్యం జిల్లాలో మరొక రెండు (కురుకుట్టి, కర్రివలస) పి.ఎస్.పిలు ప్రతిపాదనలో ఉన్నాయి. పెదకోట, కురుకుట్టి, కర్రివలస పి.ఎస్.పి.లను అదాని గ్రీన్‌ ఎనర్జీకి, యర్రవరం పి.ఎస్.పి ని షిరిడీ సాయి ఎలెక్ట్రికల్స్ కు కేటాయించారు. కొత్తగా ఏర్పడిన నూతన పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (NREDCAP) ఈ ప్రాజెక్టులకు నోడల్‌ సంస్థగా వ్యవహరిస్తుంది. ఈ నాలుగు ప్రాజెక్టుల సామర్థ్యం 1000 మెగావాట్లు, లేదా అంతకంటే ఎక్కువే.

మానవ హక్కుల వేదిక సభ్యులు ఈ నాలుగు ప్రాంతాలను సందర్శించి, స్థానిక ప్రజలతో (అత్యధికంగా ఆదివాసులు) మాట్లాడారు. ఐదవ షెడ్యూల్‌ ప్రాంతానికి వర్తించే షెడ్యూల్డ్‌ ఏరియా పంచాయతీ విస్తరణ (PESA) చట్టాన్ని, అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని (FRA), రాజ్యాంగ నిబంధనలను ఇంత బాహాటంగా ఉల్లంఘించి ఈ ప్రాజెక్టులను అనుమతించడం మాకు దిగ్భ్రాంతి కలిగించింది. ఆ రెండు చట్టాల ప్రకారం ఐదవ షెడ్యూల్‌ ప్రాంతంలో ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే ముందు స్థానిక ప్రజలతో చర్చించి, వారి గ్రామ సభలను సంప్రదించి, వాటి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంది. గ్రామసభల అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి ప్రాజెక్టుల మీద ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు. గ్రామసభలో ఆమోదం తెలపకుండా ఏ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నా అది చట్ట విరుద్ధం అవుతుందని పెసా చట్టం స్పష్టంగా చెబుతుంది. అయినా, ఈ నాలుగు PSP ప్రాజెక్టులను అనుమతించే ముందు స్థానిక ప్రజలకు వాటి గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, వారితో ఎటువంటి చర్చ జరపలేదు. ఏ మాత్రం పారదర్శకత పాటించకపోవడమే కాకుండా, ఉద్దేశపూర్వకంగానే స్థానిక ఆదివాసుల నుండి సమాచారాన్ని దాచిపెడుతున్నా రనేది అర్ధమవుతోంది.

షెడ్యూల్‌ ప్రాంతంలో భూమికి సంబంధించిన లావాదేవీలన్నీ ఎ.పి. భూబదలాయింపు నియంత్రణ (LTR) చట్టానికి లోబడి ఉంటాయి. అలాగే, సమత కేసులో సుప్రీంకోర్టు 1997 లో ఇచ్చిన తీర్పు ప్రకారం కూడా షెడ్యూల్‌ ప్రాంతంలో ప్రైవేటు వ్యక్తులు, లేదా సంస్థలు ఎటువంటి ప్రాజెక్టులు స్టాపించకూడదు. రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటినీ ఉల్లంఘించడమే కాకుండా, గిరిజన సలహా మండలి (Tribal Advisory Council) తో  చర్చించకుండా వాటి మీద నిర్ణయం తీసుకోవడం అంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడమే.

ఆదివాసులు ఈ ప్రాజెక్టులకు పూర్తి వ్యతిరేకంగా వున్నారు. వారి జీవనానికీ, జీవనోపాధికీ ఇవి హాని తలపెడతాయని వారు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రతి PSP కి ఎగువనొకటి, దిగువనొకటి రెండు రిజర్వాయర్లు కడతారు. వాటి కోసం చాలా భూమి అవసరం అవుతుంది. 1200 మెగావాట్ల సామర్థ్యం గల యర్రవరం ప్రాజెక్టుకు 820 ఎకరాలు, 1000 మెగావాట్ల సామర్ధ్యం గల పెదకోట ప్రాజెక్టుకు 680 ఎకరాలు అవసరం అవుతాయి. అంటే, వేలాది ఆదివాసులు నిర్వాసితులు కాబోతారు.  స్థానిక ఆదివాసుల అంచనా ప్రకారం ఒక్క యర్రవరం ప్రాజెక్టు వల్లే చింతపల్లి, కొయ్యూరు మండలాలలో 34 కు పైగా గ్రామాలు మునిగిపోతాయి.

ఈ పి.ఎస్.పి లన్నీ వివిధ రిజర్వాయర్ల పరీవాహక ప్రాంతంలో ఉన్నాయి. తాండవ రిజర్వాయర్‌ పరీవాహక ప్రాంతంలో యర్రవరం ప్రాజెక్టు, రైవాడ రిజర్వాయర్‌ పరీవాహక ప్రాంతంలో పెదకోట ప్రాజెక్టు, సువర్ణముఖి నదిమీద ఉన్న వెంగళరాయసాగర్‌ పరీవాహక ప్రాంతంలో మన్యం జిల్లా ప్రాజెక్టులు ఉన్నాయి. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఈ ప్రాజెక్టులు ఆ రిజర్వాయర్ ల నుంచి, స్థానిక వాగుల నుండి, ప్రవాహాల నుండి నీటిని లాగేసుకుంటాయి. ఫలితంగా ఈ జలవనరులపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసులకు తీవ్రనష్టం కలుగుతుంది. ఆదివాసులే కాదు, మైదాన ప్రాంత రైతులు కూడా నీటి భద్రతను కోల్పోయే ప్రమాదం ఉంది.

ఐదవ షెడ్యూల్‌ ప్రాంతానికి ఉన్న ప్రత్యేక రాజ్యాంగ హామీల గురించి, ఆదివాసుల రక్షణ కోసం ఉన్న ప్రత్యేక చట్టాల గురించి ప్రభుత్వానికి తెలియదనుకోవాలా? లేదా అహంకార పూరితంగా దబాయించి ముందుకెళ్లాలని నిర్ణయించుకుందా? షిర్డి సాయి ఎలక్ట్రికల్స్, అదాని గ్రీన్‌ ఎనర్జీ సంస్థలకు ఇచ్చిన అనుమతులు పూర్తిగా చట్టవిరుద్ధమైనవి. అవి ఆదివాసుల జీవనోపాధి హక్కులను హరించి, వారిని నిర్వాసితులుగా మిగులుస్తాయి.

కాబట్టి ఈ ప్రాజెక్టులను తక్షణమే రద్దు చేయాలని మానవ హక్కుల వేదిక ప్రభుత్వాన్ని కోరుతున్నది.

మానవ హక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్
17 జనవరి 2023

Related Posts

Scroll to Top