జాబ్ కార్డుల తొలగింపు గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్ఫూర్తికే విరుద్ధం

మహాత్మా గాంధి జాతీయ ఉపాధి హామీ పధకంలో 2022-23 లో పెద్దఎత్తున జరిగిన జాబ్ కార్డులు, పేర్ల తొలగింపును మానవ హక్కుల వేదిక (HRF) చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. ఇది గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా ఆదివాసి ప్రాంతంలో ప్రజల బ్రతుకుతెరువుపై తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తుందని మేము భావిస్తున్నాము. ఈ తొలగింపులు ఎంత వరకు సమంజసమో తెలుసుకునేందుకు నలుగురు సభ్యులతో కూడిన హెచ్.ఆర్.ఎఫ్ మరియు లిబ్టెక్ సంస్థల బృందం పార్వతీపురం మన్యం జిల్లాలోని చింతలపాడు, బాలేసు (గుమ్మలక్ష్మీపురం మండలం), దుర్బిలి (కురుపాం మండలం) గ్రామాలను సందర్శించింది. మూడూ ఆదివాసి గ్రామాలే. మా పరిశీలనలో తేలిన విషయాలివి:

  1. మూడు గ్రామాలలో కలిపి మేము మొత్తం 30 మంది తొలగింపబడ్డ వేతన కూలీలను కలిసాము. వారిలో 5 తొలగింపులు మాత్రమే సకారణంగా జరిగినవి. మిగతా 25 మందివీ తప్పుడు తొలగింపులే. ఉదాహరణకు చింతలపాడు గ్రామంలో 29 సంవత్సరాల కొలక రంగారావు పేరును బ్రతికుండగానే చనిపోయినట్లు పేర్కొని తొలగించారు. దుర్బిలి గ్రామంలో ఆరిక చుక్కమ్మ పనుల కోసం వేచి చూస్తుంటే ఆమెకు పని చేయడం ఇష్టం లేదన్న కారణం చూపి తొలిగించారు. ఎక్కువ మందిని ఆ కారణంగానే తొలగించారు కాని వారంతా పని కోసం ఎదురు చూస్తున్న వారేనని తెలిసింది.
  2. ఉపాధి హామీ పధకంలో పని చేసే మేట్లను, ఫీల్డ్ అసిస్టెంట్లను సంప్రదించగా తెలిసిందేమిటంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పధకంలో బ్యాంక్ ఆధారిత చెల్లింపుల స్థానే ఆధార్ ఆధారిత చెల్లింపులను ప్రవేశపెట్టింది అని. అంటే  ఆధార్ కార్డు, రేషన్ కార్డు, జాబ్ కార్డు మూడిటినీ మాచింగ్ చేసే పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ పద్ధతిలో మాచ్ అవ్వని వాళ్ళను రకరకాల కారణాల కింద తొలగించడం జరిగింది. ఇప్పుడు సమస్య ఏమిటంటే వీరిని తిరిగి చేర్చుకోవడం అనేది చాలా క్లిష్టమైన పని. స్థానిక సిబ్బంది ద్వారా కాని పని.
  3. గ్రామీణ, ఆదివాసి ప్రాంతంలోని బడుగు పేద ప్రజలకు తేలికగా, సత్వరమే కూలి డబ్బులు అందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ పధకం ఇప్పుడు వారికి అశనిపాతంగా మారిపోయింది. గుర్తింపు కార్డులలో ఏవో చిన్న తేడాలు లేని వారు ఉండరు. వాటిని సరి చేసుకొని తిరిగి జాబ్ కార్డు పొందడానికి ఒక ఆదివాసి కూలీకి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చు. అప్పటి వరకూ వారు పని లేకుండా ఉండిపోవాల్సి వస్తుంది.  
  4. కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త పద్ధతిని ప్రవేశపెట్టే ముందు ఇటువంటి తప్పులు జరగకుండా సిబ్బందికి తగు ట్రైనింగు ఇచ్చి, కొంత సమయం ఇచ్చి ఉండాల్సింది. ఈ సంవత్సరం కూలికి వెళ్తున్న వారిలో కూడా చాలా మందికి డబ్బులు అందలేదని మాకు చెప్పారు. బహుశ ఈ కొత్త పద్ధతి వల్లనే అది కూడా జరుగుతూ ఉండ వచ్చు.

మూడు గ్రామాలలోనే ఇన్ని సమస్యలు ఉంటే ఇక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఉపాధి హామీ అమలు తీరు గురించి లిబ్టెక్ సంస్థ ఇటీవల విడుదల చేసిన రిపోర్టు ప్రకారం 2022-23 సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం 77.9 మంది కూలీలను తొలగించారు. అంటే రాష్ట్రంలో పని చేసే 1.22 కోట్ల మంది కూలీలలో నికరంగా 59.6% మంది తొలగింపబడ్డారు. ఈ పధకానికి ఏటా తగ్గిపోతున్న బడ్జెట్ తో పాటు ఇప్పుడు ఈ తొలగింపులు చూస్తే మొత్తంగా ఉపాధి పధకాన్నే నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందనిపిస్తోంది. గ్రామీణ, ఆదివాసి ప్రాంతాల ప్రజలకు ఎంతో కొంత ఆసరాగా ఉంటూ వారి బ్రతుకుతెరువుకు ఒక మేరకు భద్రతను ఇచ్చే ఈ పధకాన్ని పటిష్టంగా అమలు చెయ్యాలని, తొలగించిన కార్డులను తక్షణమే తిరిగి చేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాము.          

మానవ హక్కుల వేదిక
20 ఆగస్టు, 2023

Related Posts

Scroll to Top