అమలు కాని లైంగిక వేధింపుల నిరోధక చట్టం – 2013

అంబాజీపేట మండలం పెదపూడి గ్రామంలో పనిచేస్తున్న హెల్త్ వర్కర్ తనను గ్రామ ప్రెసిడెంట్ భర్త అయిన బీర రాజారావు, హెల్త్ సూపర్వైజర్ నెల్లి మధుబాబు వేధింపులకు గురి చేస్తున్నారు అని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయమై మానవ హక్కుల వేదిక సభ్యులు ముగ్గురు ఈ రోజు నిజనిర్ధారణ చేపట్టారు. లైంగిక వేధింపుల నిరోధక చట్టం, 2013 ప్రకారం ఆమె ఫిర్యాదుపై నిష్పాక్షిక విచారణను చేపట్టాలని, నిందితులతో ఎటువంటి సంబంధము లేని వాళ్ళని మాత్రమే విచారణ కమిటీ సభ్యులుగా నియమించాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తోంది. వేదిక సభ్యులు బాధితురాలిని, ముక్కామల పి.హెచ్.సి వైద్యాధికారిని, అలాగే డిఎంహెచ్ఓ ఆఫీస్ A.O ని కలిసి విషయ సేకరణ చేశారు. బాధితురాలి ఫిర్యాదుపై విచారణ చేయడానికి చట్ట ప్రకారం ఒక కమిటీని నియమించాలని, దానిలో కచ్చితంగా ఇద్దరు మహిళలు ఉండాలని వేదిక సభ్యులు అన్నారు. పని ప్రదేశాలలో జరిగే వేధింపులను అరికట్టడానికి 2013 లో వచ్చిన లైంగిక వేధింపుల నిరోధక చట్టం అమలు ఘోరంగా ఉందని వేదిక సభ్యులు అభిప్రాయపడ్డారు. 

ఈ చట్ట ప్రకారం పదికి పైగా ఉద్యోగులున్న ఏ కార్యాలయం/పని ప్రదేశంలోనైనా ఒక ఇంటర్నల్ కమిటీ ఏర్పాటు చేయాలి. దాన్లో ఖచ్చితంగా ఇద్దరు మహిళా సభ్యులు ఉండాలి. ప్రతి సంవత్సరం ఈ కమిటీ తమకు వచ్చిన ఫిర్యాదులు, వాటిపై తాము తీసుకున్న చర్యలు తదితర వివరాలతో కూడిన రిపోర్టును జిల్లా కమిటీకి దాఖలు చేయాలి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని, బాధితులను, ఇతర సాక్షులను విచారించి వారి సాక్ష్యాలను నమోదు చేసే సివిల్ కోర్టు తరహా అధికారాలు ఈ కమిటీకి ఉంటాయి. విచారణ తర్వాత తగిన చర్యలు, అంటే నిందితులను సస్పెండ్ చేయడం, జరిమానా విధించడం లాంటి చర్యలకు ఈ కమిటీ ఆదేశాలు ఇవ్వవచ్చు. అయితే పని ప్రదేశాలలో వేధింపులు లేని వాతావరణం పెంపొందించే ఉద్దేశంతో రూపొందించిన ఈ చట్టం కాగితాలకే పరిమితం అవుతోంది. ఈ చట్టం అమలుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేస్తోంది.

మానవ హక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్
17 మార్చి 2023

Related Posts

Scroll to Top