ల్యాండ్ పూలింగ్ జి.ఓ. 72 ను వెంటనే ఉపసంహరించుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూసేకరణ చేయడానికి తీసుకొచ్చిన జి.ఓ. 72 ను వెంటనే ఉపసంహరించుకోవాలని మానవ హక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.) డిమాండ్ చేస్తోంది.  పేదలకి ఇళ్ళు ఇచ్చే పేరుతో పేదల భూములనే సేకరించి వారి జీవనోపాధిని దెబ్బతీసే ప్రయత్నాలను ప్రభుత్వం మానుకోవాలి.  జి.ఓ. 72 ప్రకారం విశాఖపట్నం చుట్టుపక్కల 10 మండలాల్లో మొత్తం 6116.50 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించడానికి గుర్తించారు. అందులో అసైన్డ్ భూములు 2552.33 ఎకరాలు వుండగా మిగతా దాంట్లో పేదలు ఆక్రమించిన భూమి కొంత వుంది.  వాళ్ళంతా నిరుపేదలు, దళితులు.  వీరి దగ్గర నుండి పూలింగ్ పద్ధతిలో భూమిని సేకరించి అసైన్మెంట్ పట్టా వున్న వారికి 900 గజాలు, 10 సం కంటే ఎక్కువ కాలం ఆక్రమణలో వున్నా వారికి 450 గజాలు, 5-10 సం వరకు ఆక్రమణలో వున్న వారికి 250 గజాల ప్లాట్లు ఇవ్వనున్నట్లు జి.ఓ. చెబుతుంది. 

          పేదల కోసం ఎంతో ఔదార్యంతో చేపట్టిన కార్యక్రమంగా కనబడే ఈ ప్రక్రియ నిజానికి వారి పొట్టను కొట్టే అన్యాయమైన చర్యగా మానవ హక్కుల వేదిక భావిస్తోంది.  అసైన్డ్ భూములు ఇప్పటికే బలవంతుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి.  అంతే కాదు, రాజకీయ పెద్దలు ప్రభుత్వ భూములను చాలా పెద్ద సంఖ్యలోనే కబ్జా చేసిన సంగతి మనకి తెలుసు.  ఇప్పటికి రెండు సార్లు దాని మీద సిట్ వేసినా ఏమీ తేలలేదు.  ఇక పేదల ఆక్రమణలో వున్న భూమి విషయానికి వస్తే వాటి మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు (చిన్న, సన్నకారు రైతులు, వారిలో అధిక శాతం దళితులు)వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారు.  వారి బ్రతుకుతెరువును నాశనం చేసి వారికి 900 లేదా 450 గజాల ప్లాట్లు ఇస్తే వారు ఏమి తిని బ్రతకాలి.

          మొత్తం సేకరిoచిన భూమిలో 15% వి.ఎం.ఆర్.డి.ఏ. తీసుకుని దాని మీద వచ్చే ఆదాయంతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుందని జి.ఓ. పేర్కొంది.  ఇది సరాసరి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తలుపులు తెరవడమే.  ఇక అభివృద్ధికి ఏ నిర్వచనం అయినా ఇవ్వవచ్చు. పెద్ద పెద్ద మాల్స్, రెస్టారెంట్లు కూడా ‘అభివృద్ధి’ కోవలోకి వస్తాయి.  కాబట్టి ఈ ప్రక్రియే మోసపూరితం అని హెచ్.ఆర్.ఎఫ్. భావిస్తోంది. 

          నిజంగా పేదల ఇళ్ళ కోసం భూమిని సేకరించాలంటే 2013 భూసేకరణ చట్టం ద్వారా సేకరిస్తే అత్యంత అర్ధవంతంగా వుంటుంది.  అది కూడా పేదల భూముల జోలికి పోకుండా పెద్దల కబ్జాలో వున్న ప్రభుత్వ భూమిని సేకరించడం అందరికీ శ్రేయస్కరం. జి.ఓ.లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రీయ పూర్తి చేయాల్సిన గడువు కూడా నిర్దేశించారు. 30 రోజుల్లో భూసేకరణ పూర్తి చేయాలని వుంది.  ఇంత హడావిడిగా చేసే ఈ కార్యక్రమంలో ప్రజలతో సంప్రదింపులు,  చర్చలు జరగడానికి ఎంత వరకూ ఆస్కారం వుంటుందో ఉహించవచ్చు.  వారిని నాయానా భయానా ఒప్పించడం చివరికి మిగులుతుంది.  ఇంత అక్రమమైన, అన్యాయమైన ల్యాండ్ పూలింగ్ విధానాన్ని వెంటనే నిలిపివేసి, జి.ఓ. 72ను రద్దు చేయాలని హెచ్.ఆర్.ఎఫ్. డిమాండ్ చేస్తుంది.  పేదలకు ఇళ్ళు ఇచ్చే మంచి కార్యక్రమం కోసం 2013 భూసేకరణ చట్టం ప్రకారం సక్రమంగా భూమిని సేకరిoచమని కోరుతోంది.

మానవ హక్కుల వేదిక
ఆంధ్రప్రదేశ్
31 జనవరి 2020

Related Posts

Scroll to Top