అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీ ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టుల హత్యకు కారకులైన పోలీసు సిబ్బందిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం అటవీ ప్రాంతంలో 2025 జూన్ 18న ముగ్గురు మావోయిస్టు సాయుధ దళ సభ్యుల హత్యకు కారకులైన పోలీసు సిబ్బందిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని మానవహక్కుల వేదిక (హెచ్.ఆర్.ఎఫ్.), హ్యూమన్ రైట్స్ వాచ్ (హెచ్.ఆర్.డబ్ల్యు.) డిమాండ్ చేస్తున్నాయి. ఆ చర్యకు పాల్పడ్డ వారిపై హత్యానేరం కింద, ఎస్.సి.,ఎస్.టి. (అత్యాచార నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేయాలి. సాధారణ పోలీసులే కానీయండి, లేదా ప్రత్యేక దళాలకు చెందిన వారే కానీయండి, ఈ నేరంతో సంబంధం ఉంది కనుక స్థానిక పోలీసులకు ఎట్టి పరిస్థితులలో దర్యాప్తు అప్పగించకూడదు. దర్యాప్తు ఒక స్వతంత్ర, నిష్పాక్షిక సంస్థచే జరిపించాలి కనుక దానిని సి.బి.ఐ. కానీ సుప్రీo కోర్టు పర్యవేక్షణలో కానీ జరిపించాలని మేము కోరుతున్నాం.

ఈ ‘ఎన్కౌంటర్’ విషయమై వాస్తవాలు సేకరించడానికి ముగ్గురు సభ్యుల  హెచ్.ఆర్.ఎఫ్., హెచ్.ఆర్.డబ్ల్యు. బృందం 2025 జూలై 18న రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళింది. వేములకొండ, ఆకూరు పంచాయతీలలోని అనేక గ్రామాలలోని ఆదివాసులతో, మారుమూల గ్రామమైన కింటుకూరు గ్రామస్థులతో నిజనిర్ధారణ బృందం సభ్యులు మాట్లాడారు. కూంబింగ్ ఆపరేషన్ చేపట్టిన గ్రేహౌండ్స్ దళాలపై మావోయిస్టులు కాల్పులు జరపగా, ఆత్మరక్షణ కోసం వారు తిరిగి ఎదురుకాల్పులు జరిపితే ఆ ముగ్గురు మావోయిస్టులు చనిపోయారనే పోలీసుల కథనం పచ్చి బూటకం, అభూత కల్పన.

18 జూన్ తెల్లవారు జామున గ్రేహౌండ్స్ దళాలు ఆ ముగ్గురు మావోయిస్టులను చుట్టుముట్టి వారిపై ఏకపక్షంగా కాల్పులు జరిపి వారిని హత్య చేసారు. ఆ ముగ్గురు మావోయిస్టులు కింటుకూరు గ్రామానికి పశ్చిమాన 3.5 కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అడవిలో ఉన్నారు. ఊట పక్కన ఒక మామిడి చెట్టును – స్థానికులు ‘ఊట మామిడి’ అని పిలిచే ప్రాంతంలో – మావోయిస్టులు తమ శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఊట నీరు వెనకనున్న గెడ్డలో కలిసి తూర్పు దిక్కునున్న పాములేరు వాగులోకి పారుతుంది. ఆ ప్రాంతం కొండమొదలు రిజర్వ్ ఫారెస్ట్, పాపికొండ నేషనల్ పార్క్ లో ఉంది. ఆ ముగ్గురు మావోయిస్టులు రెండు వారాలకు పైగా అదే ప్రాంతంలో ఉన్నారు.

జూన్ 17 అర్ధరాత్రి తర్వాత గ్రేహౌండ్స్ సిబ్బంది పెద్ద సంఖ్యలో కింటుకూరు మీదగా వెళ్లారు. మావోయిస్టులు ఎక్కడున్నారో వారికి కచ్చితమైన సమాచారం ఉండబట్టి వారు ఆ ప్రాంతానికి దక్షిణాన రెండు వైపుల నుండి చుట్టుముట్టారు. అక్కడ ఎటువంటి ఎదురుకాల్పులు జరగలేదు. తెల్లవారుతుండగా మావోయిస్టులను గురిపెట్టి కాల్చేసారు. గ్రేహౌండ్స్ తలచుకుని వుంటే వారిని తేలికగా అదుపులోకి తీసుకోగలిగే వారు. చంపాలని అనుకున్నారు, చంపారు. చనిపోయిన ముగ్గురు – గాజర్ల రవి (తెలంగాణలో జయశంకర్ భుపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని వెలిషాల గ్రామo), వెంకట రవివర్మ చైతన్య (విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలోని కరకవానిపాలెం), కొవ్వాసి అంజు (బోడగుబల్ గ్రామం, కొంట బ్లాక్, ఛత్తీస్గఢ్ కి చెందిన ఆదివాసీ).

మృతదేహాలను అదే రోజు సాయంత్రం రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు కాని శవపరీక్ష జరపడంలో కావాలనే జాగు చేసారు. శవపరీక్ష మర్నాటికి కాని పూర్తి కాలేదు. బంధువులు మృతదేహాలని ఇంటికి తీసుకుపోవడానికి పడిగాపులు పడుతూ, ప్రాధేయపడుతున్నా పట్టించుకోలేదు. శవాలు అందజేయడంలో జరుగుతున్న జాప్యం గురించి వరసగా మీడియా కథనాలు రావడంతో పోలీసులు దిగివచ్చి బంధువులకు కుళ్ళిపోయిన శవాలను జూన్ 19 రాత్రి అందజేశారు. మృతదేహాలను ఇంటికి తీసుకుని వెళ్లేసరికి వాటికి పురుగులు పట్టేసాయి.

ఇవి  కేవలం ఒక పథకం ప్రకారం ప్రత్యేక పోలీసులు చేస్తున్న నరమేధంలో భాగంగా జరిగిన హత్యలు. 2024 జనవరి నుండి ఇప్పటి వరకు 440కు పైగా మావోయిస్టులను, నిరాయుధ పౌరులను, అత్యధికంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో, ఎన్కౌంటర్ పేరిట హత్య చేసారు. మృతుల్లో అధిక సంఖ్యాకులు ఆదివాసులు కాగా, జరిగిన ఈ ఎన్కౌంటర్లలో అధిక శాతం బూటకపు ఎదురుకాల్పులేనని బలమైన ఆరోపణలు ఉన్నాయి. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న ఈ అమానుష వేటను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం ఆపాలని మేము కోరుతున్నాం. ప్రభుత్వ అనుమతితో జరిగే ఇటువంటి చట్టబాహ్యమైన హత్యలను, రాజ్యాంగ విలువలకు లోబడే ఏ ప్రజాస్వామ్యము అనుమతించదు.

కాల్పుల విరమణ, శాంతి చర్చల కోసం మావోయిస్టులు పదే పదే చేస్తున్న ప్రతిపాదనలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రాధాన్యతనిచ్చి వారితో నిర్మాణాత్మకమైన సంవాదం జరపాలని మేము కోరుతున్నాం. పీడన నుండి ఉపశమనం పొందడానికి, మరీ ముఖ్యంగా అనాదిగా సమస్యల వలయంలో చిక్కుకునిపోయిన ఆదివాసుల పీడనను తగ్గించడానికి ఇదొక ఒక అరుదైన రాజకీయ సందర్భం. సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ హింసాకాండ వల్ల మానవాళి ఇప్పటికే చాలా మూల్యం చెల్లించింది.

వై. రాజేష్ – హెచ్.ఆర్.ఎఫ్. ఏ.పి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
వి.ఎస్. కృష్ణ – హెచ్.ఆర్.ఎఫ్. ఏ.పి. & టి. జి. సమన్వయ కమిటీ సభ్యులు
బాలు అక్కిస – హెచ్.ఆర్.డబ్ల్యు. ఏ.పి. రాష్ట్ర అధ్యక్షులు

21-7-2025
విశాఖపట్నం

Related Posts

Scroll to Top