గాజులరామారంలోని గడ్డిపోచమ్మ, బాలయ్య, రాజ రాజేంద్ర మరియు అబిద్ బస్తీలలో సెప్టెంబర్ 21వ తేదీన మొత్తం 275 ఇళ్లను రాష్ట్ర ఫైనాన్షియల్ కార్పొరేషన్ స్థలంలో నిర్మించారనే కారణంతో హైడ్రా కూలగొట్టింది. ఈ విషయంపై మానవ హక్కుల వేదిక (HRF) మరియు దళిత బహుజన ఫ్రంట్ (DBF) సెప్టెంబర్ 27వ తేదీన నిజనిర్ధారణ జరిపింది.
హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ మండలం, గాజులరామారం ప్రాంతంలో ఒక క్వారీ ఉండేది. ఆ క్వారీలో రాళ్లు కొట్టే పని నిమిత్తం మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు సుమారు ఇరవై ఏళ్ల కిందట ఇక్కడికి వచ్చి గుడిసెలు వేసుకుని నివసించడం మొదలుపెట్టారు. క్రమేణా ఆ గుడిసెలను తీసి ఇళ్లు కట్టుకున్నారు. కొంత ప్రాంతాన్ని అక్కడ ఉన్న లోకల్ లీడర్లు కబ్జా చేసి, ఇళ్లు కట్టి జీవనోపాధి కోసం వచ్చిన ప్రజలకు అమ్మడం మొదలుపెట్టారు. అలా నాలుగు బస్తీలు ఏర్పడ్డాయి. ఇక్కడ నివసించే ప్రజలు అందరూ రాళ్లు కొట్టడం, కూలి పని, ఆటో నడుపుకుంటూ జీవనం గడుపుకునేవారే. కొంత మంది ప్రజలు జి.ఓ. 58 కింద తాము నివసిస్తున్న ఇంటికి పట్టా కూడా చేయించుకున్నారు. అన్ని ఇళ్లకు ఇంటి నంబర్, కరెంటు కనెక్షన్ కూడా ఉన్నది.
సెప్టెంబర్ 21 తేదీ ఉదయం 5 గంటల ప్రాంతంలో హైడ్రా, రెవెన్యూ, పోలీస్, ఇతర ప్రభుత్వ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్కడికి చేరుకున్నారు. ఒక్కొక్కటిగా ఇళ్లు కూలగొట్టడం ప్రారంభించారు. కట్టిన ఇంట్లో ఎవరూ లేకపోతే, సామాన్లు ఉన్నప్పటికీ కూల్చారు. తక్కువ జనాభా, లేదా తక్కువ సామగ్రి ఉంటే, వారిని బయటికి లాగి, సామాన్లు తీసుకోవాలని చెప్పి ఇళ్లు కూల్చారు. ఎక్కువ కుటుంబ సభ్యులు ఉన్న ఇళ్లను ముట్టుకోలేదు. అలాగే తమ పొరుగింటి ఇళ్లను కూలగొడుతుంటే అడ్డుకునే ప్రయత్నం చేసిన ప్రజలను, “మీరు ఇంట్లో నుంచి బయటికి రావద్దు, వస్తే మీ ఇంటిని కూడా కూలగొడతాం” అని భయపెట్టారు. అడ్డు వచ్చిన వారిని పోలీసుల సహాయంతో అడ్డుకున్నారు. అక్కడ మొత్తంగా 900 ఇళ్లు ఉండగా, వాటిలో 275 ఇళ్లు కూల్చారు. మిగతా వారికి కూడా మళ్లీ అక్టోబర్ 6వ తేదీన తిరిగి వస్తామని, అప్పటివరకు ఖాళీ చేయవలసిందిగా చెప్పారు.
ఆసక్తికర విషయం ఏమిటంటే, గవర్నమెంట్ భూమిగా చెబుతున్న హైడ్రా అధికారులు రెండు ఇళ్ల మధ్యలో ఉన్న ఇల్లు కూల్చి, ఆ తరువాత మీ ఇళ్లు కూడా కూల్చుతాం అని ఇరుగుపొరుగు వాళ్లను భయపెట్టారు. మరుసటి రోజే రంగనాథ్ గారు, పేదలు నివసిస్తున్న ఒక్క ఇంటిని కూడా కూల్చలేదు, అందరూ రౌడీషీటర్లు, కబ్జాదారులు మాత్రమే అని బాహాటంగా ప్రకటన ఇచ్చారు.
సమాచార సేకరణ సమయంలో, ఇళ్లు కోల్పోయిన వారిలో చాలా తక్కువ మందితోనే మాట్లాడగలిగాం; మిగతా వారందరూ అక్కడి నుండి వెళ్లిపోయారు. మూడు రోజుల ముందే కరెంటు తీసేయడంలో పెట్టిన శ్రద్ధ ప్రజలకు నోటీసులు ఇవ్వడంలో పెట్టలేదు అని తెలుస్తోంది. ఇదే ప్రాంతంలో మూడు ఎకరాల ఫామ్‌హౌస్ కూడా ఉన్నది, దానిని హైడ్రా అధికారులు ముట్టుకోకపోవడం గమనార్హం. స్థానిక తహశీల్దార్‌తో మాట్లాడే ప్రయత్నం చేశాం, కానీ అధికారులు అందుబాటులో లేరు.
నాలాల సంరక్షణతో మొదలై, ప్రభుత్వ భూములను కూడా కాపాడుతున్నాం, దాదాపు 50 వేల కోట్ల ఆస్తులను జప్తు చేసుకున్నాం అని చెబుతున్న హైడ్రా అధికారులు, ఇళ్లు లేని వారికి ఇళ్లు ఇవ్వటం కూడా ప్రభుత్వం యొక్క ముఖ్యమైన పని అని ఎవరైనా హైడ్రాకి చెప్పాలి. నివాసం ఉండే ఒక్క ఇంటిని కూడా కూల్చలేదు అని చెప్తూ, పేదవాడు వేసుకున్న గుడిసెను పీకి పడేసే ప్రయత్నం ఇకనైనా మానుకోవాలి. కొంత మంది ప్రజలు స్థానిక నాయకుల, కబ్జా చేసిన వారి దగ్గర ఇళ్లు కొన్న విషయం వాస్తవం అయినప్పటికీ, ఈ ప్రక్రియలో బ్రతుకుదెరువు కోసం వచ్చిన ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతోంది.
కొన్ని ఇళ్లు కూలగొట్టి, కొన్ని ఇళ్లు కూలగొట్టక పోవడం అనేది, అసలు ఒక అధికారిక నోటీసు ఇవ్వకుండా బుల్ డోజర్లు తీసుకు రావడం వంటివి, హైడ్రా చట్టాలకు అతీతం అని, అది అడ్డదిడ్డంగా పనిచేస్తుందని, హై కోర్టు వేసే మొట్టికాయలు, కోర్టుకు వెళ్ళే ప్రభుత్వ లాయరుకు తప్ప, హైడ్రా అధికారులకు తగలడం లేదని అర్థం అవుతోంది.
ప్రభుత్వ భూమి అని బుల్ డోజర్లు వేసుకు వచ్చారు కానీ అసలు కూలగొట్టే వారికి, కూలగొట్టించే వాటికి కానీ ఎక్కడి వరకు కూలగొట్టలో తెలుసా? సాయంత్రం 4 తర్వాత సరిగ్గా పని చేయని ప్రభుత్వ యంత్రాంగం, ఆదివారం పొద్దున్నే 5 గంటలకు కూలగొట్టడం, రేసు గుర్రం సినిమాలో కిల్ బిల్ పాండే లాగా ఈ ఆవేశం అర్థం చేసుకోడం కష్టం.
అతి భారీ వర్షాలు పడి, నాలాలు పొంగి, వాటికి ఫెన్సింగ్ సరిగ్గా లేక మనుష్యులు దానిలో పడి కొట్టుకుపోతు ఉంటే, వాటిని ఎలా నివారించాలి అన్న విషయం ఆలోచించడం మానేసి, భారీ వర్షాలు పడుతుంటే పేదల ఇళ్లు కొల్లగొట్టడం ప్రాధాన్యతగా తీసుకున్న హైడ్రా అధికారులు చేయాల్సిన పనిలో ఏది ముఖ్యం, ఏది పద్ధతి అన్న విషయాల మీద శిక్షణ ఇవ్వాల్సి ఉంది.
డిమాండ్లు:
- హైడ్రా చట్ట పరిధిలోనే పని చేయాలి.
- ఇళ్లు కూల్చే ముందు, నోటీసులు ఇవ్వాలి. ముందుగా ప్రభుత్వ భూముల సరిహద్దులు గుర్తించి , ప్రజలకు తెలియచేయాలి.
- గాజులరామారంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు పట్టాలు ఇచ్చి పక్కా ఇళ్లు నిర్మించాలి.
- హైడ్రా అధికారుల చర్య వల్ల ఉన్నదంతా కోల్పోయిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి.
- ఈ ప్రాంతంలో మున్ముందు ఎలాంటి కూల్చివేతలు ఉండవని హైడ్రా అధికారులు హామీ ఇవ్వాలి.
- కబ్జాదారుల బారిన పడి, బాధితులకు నష్టం కలగకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలి.
సంజీవ్, హెచ్.ఆర్.ఎఫ్ సిటీ యూనిట్ ప్రధాన కార్యదర్శి
శంకర్, డి.బి.ఎఫ్, జాతీయ కార్యదర్శి
రోహిత్, హెచ్.ఆర్.ఎఫ్ సిటీ యూనిట్ కార్యదర్శి
01-10-2025,
హైదరాబాద్.