ప్రభుత్వం ఇప్పటికైనా నిద్రలేచి జీ.ఓ. 43ని అమలు పరచి, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలి

అనంతపురము జిల్లాలో అత్యధికంగా జరుగుతున్న రైతు ఆత్మహత్య కుటుంబాలను మానవ హక్కుల వేదిక (HRF), రైతు స్వరాజ్య వేదిక (RSV) కలిసి వివరాలను సేకరించాయి. ప్రభుత్వం ఇప్పటికైనా నిద్రలేచి జీ.ఓ. 43ని అమలు పరచి, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము.

పాలకుల నిర్లక్ష్యం, ప్రకృతి చిన్న చూపు వల్ల రైతులకు జరుగుతున్న తీవ్ర అన్యాయం కారణంగానే అనంతపురము జిల్లాలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయని మా నిజనిర్ధారణలో నిరూపణ అయ్యింది. చనిపోయిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందటం లేదు.

మా బృందం జూన్ 27, 28 తేదీలలో అనంతపురము జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ల లోని కూడేరు, శెట్టూరు, ఆత్మకూరు, కల్యాణదుర్గం, బెలుగుప్ప, అనంతపురం గ్రామీణ, గార్లదిన్నె, పెద్దవడుగూరు, పామిడి మండలాల్లోని 18 గ్రామాలలో ఆత్మహత్య చేసుకున్న 18 మంది రైతు కుటుంబాలను, గ్రామస్తులను కలిసింది. రైతు ఆత్మహత్యలకు గల కారణాలు, ప్రభుత్వ స్పందన గురించి విషయ సేకరణ చేసింది. ఒక్క కుటుంబానికి కూడా G.O. 43 ప్రకారం పరిహారం అందలేదు. వీరికే కాదు. 2024 మొదటి నుండి మొన్నటి మే చివరి వరకు ఉమ్మడి అనంతపురము జిల్లాలో దాదాపుగా 160 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే అందులో ఒక్కరంటే ఒక్కరికీ కూడా ప్రభుత్వం పరిహారం అందించలేదు.

అనంతపురము జిల్లాలో మేము కలిసిన రైతు కుటుంబాలకి అందరికీ ఎంతో కొంత స్వంత భూమి ఉన్నప్పటికీ కౌలుకి కూడా భూమిని తీసుకుని వ్యవసాయం చేయక తప్పని పరిస్థితి. ఎంతో ఖర్చుతో, రిస్కుతో కూడుకున్న వాణిజ్య పంటలైన పత్తి, మిరప, టొమాటో లాంటి పంటలు, అలాగే కందులు, ఆముదం పంటలు సాగు చేస్తున్నారు. అయితే అరకొర నీటి లభ్యత, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, చీడ పీడల కారణాలతో తీవ్ర నష్టాలతో అప్పుల వారి వత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ నష్టాలు ముఖ్యంగా పత్తి, మిర్చిలో ఒక రకమైన బ్యాడగీ మిర్చీ సాగులో చాలా తీవ్రంగా ఉన్నాయి. అధిక ఖర్చుతో కూడిన విత్తనాలు, కనీస మద్దతు ధర లేకపోవడం లాంటి కారణాల వల్ల వడ్డీ వ్యాపారుల నుండి అధిక వడ్డీకి అప్పులు చేయవలసిన పరిస్థితి ఉంది. కొన్ని సార్లు ఈ వార్షిక వడ్డీ 60 శాతం వరకు ఉంటున్నది. ఇంత వడ్డీకి వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేయడం అంటే బ్యాంకులు ప్రాధమిక రంగానికి ఇవ్వాల్సిన రుణాలు ఏ స్థాయిలో రైతులకి అందుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు.

వ్యవసాయ రోజువారీ ఖర్చులు ఇలా ఉండగా, పెట్టుబడి ఖర్చులు మరొక గుదిబండగా తయారయ్యాయి. మేము కలిసిన ప్రతి కుటుంబం కూడా బోర్ వెల్ తవ్వకాలకి లక్షలు లక్షలు ఖర్చుపెట్టింది. ఎన్ని వందలు అడుగులు లోతుకి వెళ్ళినా నీరు పడుతుంది అనే నమ్మకం లేని ప్రాంతం ఇది. ఎప్పటినుండో ఈ జిల్లాని పట్టి పీడిస్తున్న సమస్య ఇది.

ఉదాహరణకి, శెట్టూరు మండలంలో ఐదు వందల అడుగులు దాటి వెళ్ళినా నీరు పడని పరిస్థితి ఉంది. 9 బోర్లు వేసి, ఒక్కదానిలో కూడా నీటిని చూడని రైతులు ఉన్నారు. వీటి కోసం రైతులు లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ అప్పుల పాలవుతున్నప్పటికీ అవి చాలా సార్లు విఫలం అవుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన తెగుళ్ళ కారణంగా పత్తి, మిర్చి పంట దిగుబడి తగ్గిపోయింది. దానికి తోడు గణనీయంగా రేట్లు కూడా పడిపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రభుత్వ లోపభూయిష్ట పంటల బీమా కారణంగా పంటలు నష్టపోయిన రైతుల కుటుంబాలకు ఎప్పుడూ నష్ట పరిహారం అందిన దాఖలాలు లేవు.

ఇక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడం కోసం తెచ్చిన జీవో 43 అమలు తీరు ఎంత దారుణంగా ఉందంటే మేము సందర్శించిన 18 కుటుంబాలలో ఒక్కటంటే ఒక్క కుటుంబానికి కూడా ఆ జీవో కింద ఏడు లక్షల ఎక్స్ గ్రేషియా అందలేదు. కొన్ని చోట్లనైతే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలవి నిజమైన రైతు ఆత్మహత్యలేనని నివేదికలు తయారు చేసి సంవత్సరం దాటిపోయినా ఆ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ఈ రోజుకీ అందలేదు. ఏ ఒక్క కుటుంబం దగ్గరికి కూడా డివిజన్ స్థాయి త్రిసభ్య కమిటీ (RDO, DSP, ADA) స్వయంగా వెళ్ళలేదు.

కనీసం ప్రాథమిక నివేదిక సమర్పించవలసిన మండల స్థాయి త్రిసభ్య కమిటీ (తహశీల్దార్, వ్యవసాయ అధికారి, సబ్ ఇన్స్పెక్టర్) కూడా కుటుంబాల దగ్గరికి రాలేదు. రెవెన్యూ ఇన్స్పెక్టర్, గ్రామ రెవెన్యూ అధికారి లాంటి అధికారులు కనీసం కుటుంబ సభ్యులను కూడా కలవకుండా తూతూ మంత్రంగా విచారణ చేసి నివేదికలు పంపారు. ఆత్మహత్య జరిగిన రైతు కుటుంబాలలోని మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చాలా కుటుంబాలలోని మహిళకు వితంతు పెన్షన్ రావడం లేదు.

పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో అర్థంచేసుకోవడానికి పెద్దవడుగూరు మండలం చింతలచెరువు గ్రామంలో 12-04- 2025 నాడు ఆత్మహత్య చేసుకున్న రైతు రాచేపల్లి రామాంజనేయులు కుటుంబం సజీవ సాక్ష్యం. ఆయన భార్యకి ఎప్పటినుండో పక్షవాతం ఉంది. మరొక మనిషి సహాయం లేకుండా మంచం మీద నుండి కూడా లేవలేదు. మేము వెళ్ళినప్పుడు కూడా ఆవిడ లేవలేని పరిస్థితి. అయిన నేటికీ కూడా ఏ అధికారి తన ఇంటికి వెళ్ళి విషయాలు సేకరించింది లేదు. అటువంటి వ్యక్తి తనకు రావలసిన ఎక్స్ గ్రేషియా గురించి కార్యాలయాల చుట్టూ తిరగగలదా? ఆవిడ భర్త ఆత్మహత్య చేసుకుని సంవత్సరం దాటుతుంది. అయిన నేటికీ కూడా ఆవిడకి ఎక్స్ గ్రేషియా అందని పరిస్థితి.

అదే విధంగా, కల్యాణదుర్గం మండలం ఉప్పొంక గ్రామంలో 17.09.2024 నాడు ఆత్మహత్య చేసుకున్న తూర్పు శ్రీకాంత్ కుటుంబ పరిస్థితి కూడా అంతే హృదయ విదారకంగా ఉంది. ఆయన భార్యకి ఏ ఆధారం లేని పరిస్థితి. 6, 4, 2 సంవత్సరాల పాపలు ఉన్నారు. మూడో పాపతో గర్భిణీగా ఉన్నప్పుడు తనకు రావలసిన ఎక్స్ గ్రేషియా కోసం ఎక్కని మెట్టు లేదు దిగని మెట్టు లేదు. పాప పుట్టింది. రెండేళ్ల వయసు వచ్చింది. అయినా నేటికీ కూడా ఎక్స్ గ్రేషియా అందలేదు. కనీస జీవితం కూడా గడిపే పరిస్థితి లేని కుటుంబం.

సమాచార హక్కు చట్టం ద్వారా, నేర పరిశోధన విభాగం వారి లెక్కల ప్రకారం ఉమ్మడి అనంతపురము జిల్లాలో ఈ 12 సంవత్సరాలలో దాదాపుగా 700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే వారు ఎంత సంక్షోభంలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఉద్యాన పంటల ద్వారా అనంతపురము ముఖచిత్రమే మారిపోతున్నదనే ప్రభుత్వ ప్రచారం ఎంత డొల్లో ఈ సంఖ్య మనకి చెబుతుంది. ఆయా ప్రాంతాల వాతావరణానికి అనుగుణంగా ఉండే పంటలు సాగు చేయడం తప్పనిసరి. అయితే ఉద్యాన పంటల సాగుకి అయ్యే ఖర్చు, మొదటి 4-5 సంవత్సరాలు ఆదాయం లేని పరిస్థితులు ఉన్నప్పుడు, రైతులకి ప్రభుత్వం సహాయం అందించకుండా అందరూ అవే పంటలు సాగు చేస్తారు అని ఆశించడం అహేతుకం.

ప్రభుత్వం తక్షణమే బాధిత కుటుంబాలకి దక్కవలసిన ఎక్స్ గ్రేషియా అందించాలి మరియు పునరావాసం కలిపించాలి.

డిమాండ్లు:

  1. ప్రభుత్వం ఇప్పటికైనా నిద్రలేచి చితికిపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.
  2. బాధిత కుటుంబాలను డివిజనల్ స్థాయి త్రిసభ్య ధృవీకరణ కమిటీ ఆలస్యం చేయకుండా సందర్శించి, విచారణ పూర్తి చేసి సత్వరమే పూర్తి స్థాయిలో కుటుంబాలకు ఆర్థిక సహాయం, పునరావాసం కల్పించాలి.
  3. జీఓ 43కి సవరణ చేసి బాధిత కుటుంబాల అప్పుల వన్ టైం సెటిల్మెంట్ కోసం కొంత సొమ్మును కేటాయించాలి.
  4. బోర్లు తవ్వకానికి సంబందించి ప్రభుత్వం భాగస్వాములతో చర్చించి విధి విధానాలని రూపొందించాలి.
  5. రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. అత్యధిక ఆత్మహత్యలు జరుగుతున్న రాయలసీమ జిల్లాలలో సమగ్ర అధ్యయనం చేసి సమస్యలు ఉన్న రైతుల కోసం ఒక హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేయాలి.

మేము సందర్శించిన రైతుల కుటుంబాల వివరాలు:

కూడేరు మండలం
1. గుత్తి ఉన్నూరప్ప – ముద్దలాపురం గ్రామం, మరణించిన తేదీ: 11-07-2024
2. ముప్పవరపు నిరంజన్ కుమార్ – కడదారికుంట, 11-04-2026
3.⁠ ⁠మనమల గోవిందు – కరుట్లపల్లి, 14-04-2026
4. జెర్రిపోతుల నారాయణప్ప – పి. నారాయణపురం, 26-03-2025

ఆత్మకూరు మండలం
5. హరిజన కుంటన్న – పి. యాలేరు, 15-09-2025
6. పొట్టే నరేష్, పంపనూరు, 07-12-2024

శెట్టూరు మండలం
7. గొల్ల గోవిందప్ప – యాటకల్లు, 03-06-2025

కళ్యాణదుర్గం మండలం
8. ⁠తూర్పు శ్రీకాంత్ – ఉప్పొంక, 17-09-2024
9.⁠ ⁠బుల్లి ఎర్రిస్వామి – బోరంపల్లి, 02-02-2026

బెలుగుప్ప మండలం
10.⁠ ⁠కురువ ఎర్రిస్వామి – కాలువపల్లి, 17-06-2024

అనంతపురము గ్రామీణ మండలం
11.⁠ ⁠అల్లు కేశవ నాయుడు – సజ్జలకాలువ, 10-03-2025

గార్లదిన్నె మండలం
12.⁠ ⁠కురువ సుదర్శన్ – ఇల్లూరు, 18-10-2025

పెద్దవడుగూరు మండలం
13.⁠ ⁠ఇల్లూరి సీతారాముడు – మిడుతూరు, 24-01-2025
14.⁠ ⁠రాచేపల్లి రామాంజనేయులు – చింతలచెరువు, 12-04-2025
15.⁠ ⁠వలగొండ రామాంజనేయులు – ముప్పల్లగుత్తి, 07-04-2026
16.⁠ నాగేంద్ర – కృష్ణపాడు, 11-05-2026

పామిడి మండలం
17.⁠ ⁠నాగిరెడ్డిగారి ముత్యాల రెడ్డి రామరాజుపల్లె, 12-05-2026
18.⁠ ⁠బెల్లాల బాల నాగేంద్ర రెడ్డి – నీలాలు, 05-05-2026

నిజ నిర్ధారణ బృందం:

బి. కొండల్ – RSV ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు
వై. రాజేష్ – HRF ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
బి.ఎన్. సుబ్బన్న – HRF ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి
జి. రోహిత్ – HRF ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి
శశాంక మౌళి – HRF అనంతపురము జిల్లా అధ్యక్షులు
డి. సత్యం బాబు HRF అనంతపురము జిల్లా ప్రధాన కార్యదర్శి

29-06-2026,
ఆనంతపురము

Related Posts

Scroll to Top