కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని స్వర్ణగిరిగా మారిన జొన్నగిరిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ బంగారు గనుల కంపెనీలకు అన్నిరకాల అనుమతులను ఇవ్వడంవల్ల అక్కడి ప్రజల జీవితాలు, పర్యావరణం ఏ విధంగా విధ్వంసానికి గురైంది పరిశీలించడానికి మానవ హక్కుల వేదిక (HRF) ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీగా తొమ్మిదిమంది సభ్యుల బృందం అక్టోబర్ 2 నాడు పగిడిరాయి, బొల్లవానిపల్లె, ఉప్పర్లపల్లె, జొన్నగిరి గ్రామాల ప్రజలను విచారించగా వెల్లడైన విషయాలు ఈ విధంగా ఉన్నాయి.
1. JioMysore Services India Private Ltd, 2. Deccan Gold Mines, 3. Lloyd Metals & Triveni Group 2 (2013-2043) అనుమతి ఇవ్వడం జరిగింది. లీజు కాలం ముగిసిన తరువాత కంపెనీ మరో 50 ఏళ్ళవరకు లీజును పొడిగించుకోవచ్చని చెప్పారు. ఈ గనుల కారణంగా వెలువడే పర్యావరణ కాలుష్యం గురించి ప్రజలకు ఎటువంటి అవగాహన లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 18, 2025 లో గనులు ఏర్పాటుచేసే గ్రామాలలో కాకుండ, పత్తికొండలోని ఆర్డిఓ కార్యాలయంలో తూతూ మంత్రంగా పబ్లిక్ హియరింగ్ నిర్వహించింది. రాష్ట్రప్రభుత్వం సహకారంతో కంపెనీలు పదేళ్ల పాటు బంగారు గనులకు మౌలిక వసతులు (భూమి, నీరు, కరెంటు, రోడ్లు, కార్మికులు, ఉద్యోగాలు, యంత్రసామాగ్రి, భవనాలు మొదలైనవి) చట్టబద్దంగా కాకుండ అడ్డగోలుగా సమాకూర్చుకున్నాయి. గత మూడేళ్లుగా బంగారాన్ని ప్రాసెసింగ్ చేయడం చాపకిందనీరు లాగా కొనసాగిస్తున్నాయి.
కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా, గనులకు అనుమతులు ఇవ్వడం వల్ల కాలుష్య నియంత్రణతోపాటు, ప్రజల ఆరోగ్యాలకు భద్రతలేకుండా పోవడం, అందులో పనిచేసే కార్మికులకు చట్టబద్ధమైన కనీస వేతనాలు, సౌకర్యాలు లేకపోవడం, భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్ విషయంలో రెవెన్యూశాఖ ప్రమాణాలు పాటించక, మిగితా అన్ని శాఖల వైఫల్యం కూడ మా బృందానికి కళ్ళకు కట్టినట్టు కనపడ్డాయి. ఇంత జరుగుతున్నా మీడియా వాటిని గురించి వార్తలు రాయక, బయటి ప్రపంచానికి వాస్తవాలు ప్రచారం కాలేదన్నది వాస్తవం. ప్రభుత్వం అడ్డగోలుగా వనరులను దోచిపెడుతున్నా, అన్ని శాఖలు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నా, వామపక్ష పార్టీలు తప్ప, అధికార కూటమి, ప్రతిపక్ష రాజకీయపార్టీలు ఏమి పట్టనట్టు ఉండి, బంగారు గనుల కంపెనీలకు దాసోహం అవ్వడం శోచనీయం.
కంపెనీ కర్మాగారం కొరకు 350 ఎకరాల భూమిని, లీజుకు 1477 ఎకరాల భూమిని తుగ్గలి మండలంలోని పగిడిరాయి, బొల్లవానిపల్లి, ఉప్పర్లపల్లె, జొన్నగిరి గ్రామాల పరిధిలో తీసుకొన్నాయి. సీలింగ్ భూములకు, పట్టా భూములను కంపెనీ మార్కెట్ ధర ఇవ్వడం లేదని దళితుల ప్రధానమైన ఆరోపణ. కంపెనీ పవన విద్యుత్ కొరకు ఇచ్చే భూములకన్నా, తక్కువ ధరకు లీజుధర నిర్ణయించి, ఇస్తున్నారని, లీజు అగ్రిమెంట్ కాపీ ప్రజలకు ఇవ్వడంలేదని వారు ఆరోపించారు. కంపెనీ పరపతి ఉన్నవారికే భూములకు మార్కెట్ ధరను చెల్లించడం, పరపతిలేని యస్.సి, యస్.టి, బీసీల భూముల మార్కెట్ ధరకన్నా మూడు రెట్లు తక్కువ ధరను ఇస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కంపెనీ యస్ సి, యస్ టి, బీసీ భూములకు కొనేటప్పుడు కూడ ఒకరికి ఇచ్చిన ధర, వేరొకరికి ఇవ్వలేదని, ఈ విషయాన్ని తాము ఆర్.డి. ఓ, తహసీల్దార్లకు చెప్పగా, కంపెనీ యాజమాన్యం నిర్ణయించిన ధరను తీసుకోకపోతే, వాటిని తిరిగి తీసుకొంటామని బెదిరించారని వాళ్ళు తెలిపారు.
కంపెనీ భూములు కోల్పోయిన స్థానిక ప్రజలకు అర్హత ఉన్నా, ఉద్యోగాలు ఇవ్వకపోగా, మట్టి ఎత్తివేసే పనులు చట్టబద్దమైన ఒప్పందం లేకుండా కొనసాగుతోంది. కంపెనీలో పనిచేస్తున్న వారిలో నైపుణ్యం కలిగిన వారు దాదాపు 700 ఉద్యోగులు ఉన్నారని, నైపుణ్యంలేని కార్మికులు దాదాపు 300 మంది స్థానికులు పని చేస్తున్నారని చెప్పారు. కంపెనీ రాజకీయ పరపతి ఉన్నవారికి ఉద్యోగాలు ఇస్తున్నారు. భూములు కోల్పోయిన స్థానిక ప్రజలకు అర్హతఉన్నా, ఉద్యోగులు ఇవ్వడం లేదని ఆరోపించారు. మట్టి పని చేసేవారికి నెలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నా, కనీస వేతనాలు, ఇ.హెచ్. యస్, పి.పి. యఫ్, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించడం లేదు. ఇంత జరుతున్నా కార్మిక శాఖ ఏంచేస్తున్నట్టు?
కంపెనీ కాలుష్యం నుండి ప్రజల ఆరోగ్యాలు దెబ్బ తినకుండా చూడడంలో ఆరోగ్యశాఖ వైఫల్యం. పగిడిరాయి మేజర్ పంచాయితీకి అత్యంత సమీపంలో ఉన్న కంపెనీ 600 అడుగుల వరకు బోర్లను వేయడంవల్ల, పొలాలోని బోర్డులో నీళ్లు పడడం లేదు. బంగారు తయారు చేయడంలో రసాయనాలు వాడడంవల్ల భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని ఆరోపించారు. దీనివల్ల తమకు ఆరోగ్యసమస్యలు పెరిగే ప్రమాదం ఉందని, తమ గ్రామానికి ఒక్క ఫిల్టర్ వాటర్ ప్లాంట్ సరిపోవడం లేదని, దీనివల్ల దళిత కాలనీ నీళ్లుఅందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేజర్ గ్రామ పంచాయితికి వైద్యసేవలు అందించే, ఆసుపత్రిలేదని ప్రజలు వాపోయారు.
పర్యావరణ కాలుష్యం అతిపెద్దసమస్య. కేంద్ర ప్రభుత్వం ఈ కంపెనీలకి పర్యావరణ అనుమతి ఇచ్చింది. కంపెనీ మైనింగ్ యూనిట్ పగిడిరాయి, బొల్లవానిపల్లె, ఉప్పర్లపల్లె, జొన్నగిరి గ్రామాలు 1-3 కిలో మీటర్లు దూరంలో ఉన్నాయి. కంపెనీ నేల నుండి బంగారు ఖనిజాన్ని తీయడానికి రసాయనాలు వాడడంవల్ల అక్కడి గాలి, నీరు, భూమి విషపూరితం అయ్యే ప్రమాదం ఉంది. మైనింగ్ చేసేక్రమంలో నేలను బ్లాస్టింగ్ చేసి, ఖనిజాన్ని క్రషింగ్ చేయడం ద్వారా, ప్రాసెసింగ్ చేసే క్రమంలో గాలి, నీరు, భూమి విషపూరితమై ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కంపెనీ అక్కడ ముప్పై ఏళ్ళ కొనసాగడమే ప్రమాదం అనుకుంటే, మరోయాభై ఏళ్ళుకు కొనసాగించుకోవచ్చని అనుమతిని ఇవ్వడం పర్యావరణ విధ్వంషానికి దారితీసే ప్రమాదం ఉంది.
ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బంగారు గనుల కంపెనీలు అడ్డగోలుగా వనరులను అప్పజెప్పడం మానుకోవాలని, కంపెనీ చట్టవిరుద్ధచర్యలను అధికారయంత్రాంగం అరికట్టకపోగా, వారికి వంతపాడడం తీవ్రమైన విషయం. ప్రజల జీవితాలు, పర్యావరణం విధ్వంషానికి గురికాకుండా, చూడకపోతే ప్రజల ఆగ్రహన్ని చూడవలసిన వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.
మా బృందంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు యు.జి. శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి యు.యం. దేవేంద్రబాబు, జిల్లా బాధ్యులు కె. ఉరుకుందప్ప, బి. సూర్యనారాయణ, సి. కారప్ప, వీరేష్, నవీన్, రమేష్ లు ఉన్నారు.
యు.జి. శ్రీనివాసులు (HRF రాష్ట్ర ఉపాధ్యక్షులు)
యు. ఎం. దేవేంద్ర బాబు (HRF రాష్ట్ర కార్యదర్శి)
కె. ఉరుకుందప్ప (HRF కర్నూలు జిల్లా అధ్యక్షులు)
బి. సూర్య నారాయణ (HRF కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి)
ఆదోని,
03.10.2026